అంగన్యాసములని వేటిని పిలుస్తారు ?

54.224.117.125

అంగన్యాసములని వేటిని పిలుస్తారు ? రుద్రంలోని మహాంగాన్యాసం అర్థం ఏంటి ? 
కూర్పు లక్ష్మీరమణ 

రుత్ అంటే - దుఃఖం ద్రానయతి అని అర్థం . దుఃఖాన్ని నాశనం చేయువాడు రుద్రుడు . వశా  అనే ధాతువు నుండీ పుట్టిన శబ్దం శివ ! వశతి అంటే, ప్రకాశిస్తున్నవాడు అనిఅర్థం . ప్రకాశం అంటే, చీకటిని అంతం చేసేది . చీకటి అజ్ఞానానికి రూపమైతే, వెలుగు దాని నిరోధకం అంటే, జ్ఞానం . జ్ఞానం అంటే, మంలో ఉన్న ఆత్మే ! మొత్తంగా మనలోని పరమాత్మ ప్రకాశమే రుద్రుడు .  

మహాన్యాసము మనల్ని ఆ రుద్ర సమానుణ్ణి చేస్తుంది  మంత్రం యుక్తంగా , అంగన్యాసంతోటి ఇది సాధ్యమవుతుంది . ఇందులో భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట అనే పధ్ధతి వివరించబడింది . దీన్నే రౌద్రీకరణము అంటారు.  ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠిస్తూ , తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అవుతాడు .

“నారుద్రో రుద్రమర్చయేత్” - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. మహాశివ భక్తుడైన రావణాసురుడు మనకి ఈ  ‘న్యాస ప్రక్రియ’ (రుద్రుని నిలుపుకునే విధానం ) లో తెలియజేశారు. ఆ తర్వాత నుండే మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
 ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
 ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
 తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
 చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
 పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది


ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు. వీటిని మరింత వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం . న్యాసములు చేస్తున్నాం అంటే, మనలో రుద్రుణ్ణి నిలుపుకుంటున్నాం అనే మాటని , భావాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి . ఆ భావంతోనే మీరు మీ అంగములని స్పృశించాలి . అప్పుడది నిజమైన అంగన్యాసం అవుతుంది . 

 ప్రథమాంగన్యాసము
భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర(తూర్పు ముఖమైన - తత్పురుష ) , దక్షిణాంగముఖ రుద్ర(అఘోర ), పశ్చిమాంగముఖ రుద్ర (సద్యోజాత) , ఉత్తరాంగముఖ రుద్ర (వామదేవ), ఊర్ధ్వాంగముఖ రుద్రు(ఈశాన ) లకు స్తోత్ర పూర్వక నమస్కారము చేయాలి . 
తర్వాత, "
యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

 ద్వితీయాంగన్యాసము
ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః  అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయాలి .

 తృతీయాంగన్యాసము
సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అంటే  శివుడు. ఇలా న్యాసము చేయడం వలన భక్తుడు ఆ సదాశివుడే తానవుతాడు.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠిస్తూ,  ఆయా దిక్కుల అధిదేవతలైన ఇంద్రాదులకు నమస్కారములు చేయాలి. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, సంపుటంలో చెప్పిన మంత్రములు పఠిస్తూ , వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు, ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దిక్కుల అధిదేవతలైన వారికి  (ఇంద్రుని మొదలు పృథివి చివర) నమస్కరిస్తూ ,రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ‘ఓం  అం విభూరసి  ప్రవాహణో.... ‘అనే మంత్రముతో మొదలు పెట్టి ‘ఓం అః  ఆహిరసి బుధ్నియో’ అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమున రుద్రుని భావించాలి. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందుతాడు .  సర్వ భూతములచేత  అపరాజితుడవుతాడు.  ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందుతాడు .

 చతుర్థాంగన్యాసము
"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ లో ఆ పరమాత్మ ని నిలిపి ఉంచడం (ఆవాహన చేయడం ) అవుతుంది .

 పంచమాంగన్యాసము
ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగుతుంది .

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.

తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తనని తాను  రుద్ర రూపునిగా ధ్యానించ వలెను. 

‘శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం 
నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం 
వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండలం వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం 
జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా 
సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర 
మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్’

అని ధ్యానం . 

అర్థం : శుద్ధ స్ఫటికము వలే ప్రకాశిస్తూ , మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజాలు గల నీలకంఠుని ,  సర్వాలంకార భూషితునిగా - చంద్ర వంక , సర్ప యజ్ఞోపవీతము , నాగాభరణాలు , పులి చర్మపు ఉత్తరీయము ధరించి , చేతులలో కమండలం , జపమాల , శూలము , అభయముద్ర, వరముద్రని కలిగి ఉంది , ఎరుపు పసుపు కలిసిన కపిల వర్ణములోని కేశములని చుట్టిన శిగతో , వృషభుడైన నంది మూపురాన్ని అధిరోహించి , అర్ధనారీశ్వరుడిగా సగభాగాన ఉమాదేవిని వహించి ఉన్న ఈశ్వరునికి నమస్కారం చేస్తూ - అమృతమైన ఆనందంతో , దివ్య భోగముతో దిక్కులకి అధిపతులు , ఇతర దేవతలు , అసురులూ నమస్కరిస్తున్న ఆయన రూపాన్ని నిత్యునిగా , శాశ్వతునిగా , శుద్ధునిగా , సర్వప్యాపిగా , ఈశానునిగా , సకల జగద్రూపునిగా భావన చేస్తూ ధ్యానం చేయాలి . 
   
దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించాలి  . 

చూశారా ! ఒక్క నమస్కార మంత్రానికి శివుడు సశరీరుడై కళ్ళముందు ఉమాదేవితోపాటు నిలబడినట్టే ఉంది కదూ ! అసలు ఆ బ్రహ్మానందంలోనే ఆ రుద్రుని మించిన సౌందర్యం లేదట . అందుకే ఆయన తత్వమెరిగిన పరమ ప్రక్రుతి ఉమాదేవి గౌరిగా మారినా సరే, ముసలివాడై ఆమెని పరీక్షించిన సరే, ఆ స్వామిని చేరేందుకు పరితపించింది . తపస్సు చేసి పతిగా పొందింది . భక్తుడు తానే రుద్రుడైన వేళ, ఆ రుద్రుడికీ , ఈ రుద్రుడికీ తేడానే లేదు .  అది మీ భావనలో ఉంది . భక్తిలో ఉంది . అర్థాన్ని తెలుసుకుంటే, అర్థం మాత్రమే తెలుస్తుంది . భావన చేస్తే , ఆచరణాత్మకమైన మాత్రం , ఆ భగవత్ తత్వాన్ని అనుభవంలోకి తెస్తుంది .

Quote of the day

Man learns through experience, and the spiritual path is full of different kinds of experiences. He will encounter many difficulties and obstacles, and they are the very experiences he needs to encourage and complete the cleansing process.…

__________Sai Baba