Online Puja Services

శివుడు కూడా విష్ణువు మోహినిగా మారినప్పుడు వెంటపడ్డాడు

52.14.240.178

శివుడు కూడా విష్ణువు మోహినిగా మారినప్పుడు ఆమె వెంటపడ్డాడు. ఆయన గుణరహితుడు ఎలా అయ్యాడు ? 
-లక్ష్మీ రమణ 

శ్రీహరి అలంకార ప్రియుడు. స్త్రీలు అలంకార ప్రియులు . శ్రీహరి చుట్టుముట్టే సమస్యలని పరిష్కరించే పోషకుడైన స్వామి. ప్రతి ఇంట్లో మంత్రిత్వం వహించి (కార్యేషు మంత్రి) అన్ని పనులూ చక్కబెట్టేది ఇల్లాలు . మాధవుడిగా ఆ మహనీయుడు స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ ఆకర్షించి సమ్మోహితులని చేసిన ప్రేమ మూర్తి . సమ్మోహనం స్త్రీల అమ్ములపొదిలో ఉండే జన్మతః వచ్చిన అస్త్రం . లాలిత్యమూ, సహనమూ, ఓర్పు  త్రిమూర్తుల్లో ఉన్నది ఒక్క విష్ణుభగవానుడికే అని భృగుమహర్షి తేల్చేశారు కదా ! అతంటి పరమాత్ముడు అదే సమయంలో దుష్ట శిక్షణ కూడా చేస్తారు. ఈ లక్షణాలన్నీ పరమ ప్రకృతివి కాదా ?  అటువంటి ప్రకృతి (స్త్రీ) లక్షణాలు ఆ స్వామిలో ఎందుకున్నాయి? 

ఎందుకంటే ఆయనే పరమ ప్రకృతి అయిన ఆ జగన్మాత గనుక. ‘విష్ణుస్య హృదయం శివః’ అని ఆర్షవాక్యం. విష్ణుహృదయనివాసిని లక్ష్మీ దేవి . ఇప్పుడు విష్ణువు హృదయంలో ఉన్నదెవరు? లక్ష్మీ అనుకుంటే ఆ  దేవే పరమేశ్వరుడు. ఆ దేవి ధనానికి ప్రతీక . ధనమే దాహమై , వ్యామోహముగా మారితే చివరికి మిగిలేది బూడిద . అదే, ఆమెని పరమేశ్వరిగా, పరమార్ధిక లక్ష్యంతో ఆరాధిస్తే, పొందేది పరమ పురుష/ ఈశ్వర  సాన్నిధ్యం . 

ఇక్కడ లక్ష్మీకి, ఈశ్వరునికి ఏవిధంగా అభేదమో , అదే విధంగా , శక్తి స్వరూపమైన, పరమ ప్రక్రుతి పరమేశ్వరే విష్ణువు. లలితా సహస్రంలో వివిధమైన ఆకారములలో సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే అర్థంలో ‘ వ్యాపినీ వివిధాకారా’ అని వాగ్దేవతలు స్తుతి చేస్తారు. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం . ఇప్పుడు చెప్పండి , ఆ లలితాంబికే విష్ణువు కాదా ! ఆ విధంగా ఈశ్వరికి, విష్ణువుకీ అభేదం . 

ఉన్నది ఒక్కటే జంట. అందుకే వారే ఆది దంపతులు . పరమఈశ్వరుడు , పరమఈశ్వరి. అంతే ! వారిద్దరే ప్రకృతీ పురుషులు . ఈ భావన కూడా తెలుసుకోగలిగితే , ఒకే ఒక్క పరమాత్మగా మారిపోతుంది . అదెలాగంటే, అదే ప్రకృతీ పురుషుల ఏకీకృత స్వరూపం అర్ధనారీశ్వరుడు. అక్కడ స్వామి తానూ ఒక్కే ఒక్క పరబ్రహ్మముననే వ్యక్తీకరణనిస్తున్నారు కదా ! ఇదే మళ్ళీ శివకేశవ స్వరూపము కూడా ! 

సాకార స్వరూపంలో నుండీ ఈ విధంగా నిరాకార, నిర్గుణ, నిర్గంధ శుద్ధ పరబ్రహ్మను తెలుసుకోవడానికి మనసు నిలకడ పొందుతుంది .  అదీ అర్థం చేసుకోవాల్సింది. అంతే కానీ,  విష్ణువు మోహినిగా మారినప్పుడు శివుడు ఆమె వెంటపడ్డాడు. ఆమెని మోహించాడు.  అనుకుంటే పొరపాటే! అది కేవలం పైకి కనిపించే కథ . దాని అంతరార్థం తెలుసుకోకుండా అపార్థం చేసుకోకూడదు . 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya