Online Puja Services

అష్టైశ్వర్యాలనిచ్చే శివుని ఎనిమిది నామాలు

18.119.125.7

అష్టైశ్వర్యాలనిచ్చే శివుని ఎనిమిది నామాలు . 
- లక్ష్మి రమణ 

 అనంతుడైన శివునికి అనేక నామాలు. ఏ పేరు పిలిచినా అది ఆయన నామమే . అయితే మంత్ర రహస్యాలతో కూడిన పరమేశ్వరుని ఎనిమిది నామాలు ఇక్కడ సాధకులు, భక్తులైన వారి సౌకర్యార్థం పొందుపరుస్తున్నాం. వీటిని స్మరిస్తూ, శివార్చన చ్చేయడం వలన పాశుపత వ్రతం చేసిన ఫలితం దక్కుతుందని శివపురాణంలోని వాయవీయ సంహిత  చెబుతోంది.  

ఆ దివ్య నామాలు ఇవీ !

శివో, మహేశ్వరశ్చైవ,
రుద్రో, విష్ణుః  పితామహః 
 సంసార వైద్యః సర్వజ్ఞః 
పరమాత్మ ఇతి ముఖ్యతః 

అని ఆర్షవాక్యం . ఇందులో ముఖ్యమైనవిగా చెప్పబడిన నామాలని విడివిడిగా ఒకసారి పరిశీలించండి . 

 శివాయ నమః 

శివుడు శుభాలని చేకూర్చేవాడు . ఇది ఆయన గుణ విశేషం కాదు . ఆయన పరబ్రహ్మ అని చెప్పే నామం ఇది . సర్వ ప్రాణులకూ ఆశ్రయాన్ని ఇచ్చేవాడు, విశ్రాంతిని కల్పించేవాడు శివుడు . 

మహేశ్వరాయ నమః 

ఈశ్వరుడు అంటే ఐశ్వర్యములకి అధిపతి . శాశించేవాడు.  మహా  ఈశ్వరుడు అంటే, అటువంటి అధిపతులందరికీ అధిపతి వంటివాడు. 

రుద్రాయ నమః 

ఉపనిషత్తులు రుద్రుడు అంటే దుఃఖముని నాశనము చేసేవాద్దని చెబుతున్నాయి . ‘రుత్’ అంటే దుఃఖము. వాటిని ద్రావయతి అంటే నశింప చేసేవాడు రుద్రుడు. కల్పనలో బ్రహ్మకు వేద శబ్దాలను ఇచ్చినవాడు రుద్రుడు.  రుతము అంటే నాదం.  నాదాంతంలో ఆనంద సుధా స్వరూపంగా అనుభవానికి అందేవాడు రుద్రుడు. 

విష్ణవే నమః 

విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని అర్థం . రుద్రుడు సర్వ జీవులలోనూ, విశ్వంలోనూ ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నవాడిని రుద్రనామకం చెబుతోంది . ‘నమో భగవతే రుద్రాయ విష్ణవే’అనే ఆర్షవాక్యం విష్ణువు అనే శబ్దానికి రుద్రుడనే అర్థాన్నిస్తుంది . 

పితామహాయ నమః

తండ్రి తండ్రిని పితామహుడు అని పిలుస్తాం . అలా సృష్టిలోని తండ్రులు అందరికీ తండ్రివంటివాడు శివుడు అని అర్థం . బ్రహ్మ విష్ణువులకీ  తండ్రి శివుడు అని భావం . మరో అర్థంలో బ్రహ్మ అనే అర్థం కూడా వస్తుంది .  

సంసార వైద్యాయ నమః

జనన మరణాల సంసార చక్రం ఒక మహా రోగం . ఆ రోగానికి వైద్యాన్ని చేసి ఆ మహావ్యాధి నుండీ మనని రక్షించగలిగిన వారు కేవలం ఆ పరమేశ్వరుడైన ఈశ్వరుడే ! యజుర్వేదం శివుని వైద్యునిగా పేర్కొంటుంది .   

సర్వజ్ఞాయ నమః 

ఏ ,ఉపకారణాలూ ఇంద్రియాల అవసరమూ లేకుండా సర్వకాలములు, విశ్వమూ తెలిసినవాడు ఈశ్వరుడు .  అందువల్ల ఆయన సర్వజ్ఞుడు . సర్వమూ తెలిసినవాడు . 

పరమాత్మనే నమః 

ఇటువంటి విశిష్టమైన గుణాలన్నీ కలిగిన వాడు కాబట్టి ఈశ్వరుడు పరమాత్మ .  

ఈ ఎనిమిది నామాలూ భావయుక్తంగా ప్రతి నిత్యమూ చేసుకోవచ్చు . వీటిని ప్రతిరోజూ భక్తిగా చేసుకోవడం వలన పాశుపతవ్రతం చేసిన ఫలితం దక్కుతుంది . ఆ రుద్రుని అనుగ్రహంతో దుఃఖాలన్నీ తొలగిపోయి, ఇహలోకంలో జీవికకి అవసరమైన ఐశ్వర్యం, పరలోక సౌఖ్యం పొందేందుకు అవసరమైన పుణ్యం ఆ మహేశ్వరుడు అనుగ్రహిస్తారు . ఆరోగ్యం, జ్ఞానం , కైలాస ప్రాప్తి ఇంతకన్నా ఇక ఒక జీవికి అవసరమైన ఐశ్వర్యం ఏముంటుంది ?

ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు !!

శుభం . 

-ఋషిపీఠం వారి ప్రచురణ ఆధారంగా.

#shiva #siva

Tags: shiva, siva

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya