Online Puja Services

శివరాత్రులు ఐదు రకాలట! తెలుసా !!

3.145.206.169

శివరాత్రులు ఐదు రకాలట! తెలుసా !!
- లక్ష్మి రమణ 
 
శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించని వారుండరు.  అయితే, ఇటువంటి పరమపవిత్రమైన శివరాత్రులు హైందవ సంస్కృతిలో ఏడాదిలో ఐదు రకాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివరాత్రులన్నీ కూడా మహా పర్వాలే. ఈ రోజుల్లో శివయ్యని ఆరాధించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి.  అపమృత్యు దోషాలు పోతాయి . పాపాలన్నీ తొలగిపోయి, పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది . 

పూజలేనని చేసినా మన ధర్మాన్ని నియమం తప్పకుండా పాటించడం కూడా ఒక ఆరాధన లాంటిదే అని గుర్తుంచుకోవాలి . ఎలాంటి మంత్రాలు తెలియకపోయినా, కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా, ఏమీ తోచక బిల్వ దళాలని ఆ పవిత్ర లింగం పైన విసిరివేసినా , చివరికి మనం చూడడం కోసం అనే భావనతో శివాలయంలో దీపం వెలిగించినా అనుగ్రహించి, ఆదరించే వాడు శంకరుడు ఒక్కడే !! ఆయన వంటి దయామయుడు, దేవుడు మరొకడు ఈ విశ్వంలో లేనేలేదు . అటువంటి బంగారు తండ్రిని రోజూ తలుచుకుంటే చాలు , ఒక్క సారి స్మరిస్తే, ఆస్మరణని తపనగా మార్చి, ముక్తినివ్వగల మహిమోపేతుడు ఈశ్వరుడు.  ఆయన్ని పూజించుకోవడానికి శివరాత్రి రావాల్సిన అవసరం లేదు . హృదయంలో ఆ పరమేశ్వరుని నిలుపుకుంటే, అనుక్షణం మానసిక ఆరాధన చేసుకోవచ్చు . అయితే, శరీరాన్ని కూడా ఆ పూజలో నియోగించాలి కదా ! దాని కోసం ప్రస్తమైన సమయాలు ఈ ఐదు రకాల శివరాత్రులు .  
 
 కైలాసనాథుని అర్చించుకోవడానికి పురాణాలలో ఉద్దేశ్యించిన ఐదురకాల శివరాత్రుల వివరాలు ఇలా ఉన్నాయి .

నిత్య శివరాత్రి 
పక్ష శివరాత్రి . 
మాస శివరాత్రి 
మహా శివరాత్రి 
యోగ శివరాత్రి
  

ప్రతి రోజూ శివుని ఆరాధించడం నిత్య శివరాత్రి.  పక్షం అంటే పదిహేను రోజుల కాలం. ప్రతి మాసంలో వచ్చే  శుక్ల, బహుళ పక్షాలలోని  చతుర్దశి రోజున శివరాధన చేయడం పక్షశివరాత్రి అవుతుంది . ఇవీ కుదరకపోతే,  ప్రతీ మాసంలోనూ  బహుళ చతుర్దశి రోజున కనీసం ఈ దేవదేవుని అర్చించాలి . దీనినే  మాస శివరాత్రి అంటారు . ఇక,  మాఘ మాసంలో వచ్చే బహుళ చతుర్దశిని సర్వ శ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. ఇవన్నీ కాలానుగుణంగా వచ్చేవి అయితే, యోగాశివరాత్రి మాత్రం ప్రత్యేకమైనది .  సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్నీ యోగ శివరాత్రి అంటారు. 

 ఈ రోజులన్నింటిల్లో, చక్కగా శివారాధన, అభిషేకం చేసుకోవచ్చు. అయితే, శివరాత్రి రోజున శివుడి అభిషేకము శివరాధన అత్యంత పవిత్రమైనదిగా ప్రాధాన్యతతో కూడినదిగా పురాణ, జ్యోతిష్య శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.  శివుడు అభిషేక ప్రియుడు.  కనుక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు- ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయకాలు. 

#sivaratri #shivaratri

Tags: sivaratri, shiva, siva, shivaratri, 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda