Online Puja Services

కాలభైరవ ఆవిర్భావం ఒక అద్భుతం!

18.191.21.86

కాలభైరవ ఆవిర్భావం ఒక అద్భుతం!
కాలభైరవాష్టమి (30/11/22) శుభాకాంక్షలతో !!
లక్ష్మీ రమణ 

 కాలభైరవ ఆవిర్భావం ఒక అద్భుతం . కాలభైరవ ఉపాసన చేసేవారు ఈరోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆస్వామి జన్మించిన అష్టమి మార్గశీర్ష మాసంలోనే వస్తుంది. ఒకే భగవంతుడు అనేకరూపాల్లో ప్రభవించడం , సృష్టి ఆరంభాన్ని తెలియజేయడం ఈ కాలభైరవుని ఆవిర్భావంలో దాగున్న విశేషం.  రుద్రాంశ అయినా కాలభైరవుడు అగ్నిస్వరూపుడు.  స్వయంగా కాలమే తానైనవాడు. పరమేశ్వరుని ముడిపడిన భృకుటి నుండీ ఉద్భవించినవాడు. భూత, భవిష్యత్ , వర్తమాన కాలాలు మూడూ కలిసి రూపు కట్టిన కాలస్వరూపం. ఆ స్వామీ ఆవిర్భావ విశేషాన్ని ఒక్కసారి స్మరించుకుందాం . 

సృష్టి చేయాలంటే- సృష్టి , స్థితి, లయం అనే మూడు కార్యక్రమాలూ జరగాలి . తనలో నుండీ సృష్టించేవాడే , తనలోనే అన్ని కలుపుకోగలడు. ఆయనే పరమేశ్వరుడు.  ఆదిదేవుడు.  ఆ ఆదిదేవుడు స్థితి కారకుడైన మహావిష్ణువుని సృష్టించాడు. మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన నాభి కమలంలో నుండీ ఆవిర్భవించాడు , సృష్టి కారకుడైన బ్రహ్మగారు. అయిదు తలలతో ఆవిర్భయించిన బ్రహ్మ గారికి తన జన్మ కారణం తెలియలేదు.  ఆయన అంతర్ముఖుడై ధ్యానంలోకి వెళ్లారు. అప్పుడు ఆయనకీ ఒక నాదం వినిపించింది. అదే పరమేశ్వర స్వరూపమైన ఓం కారం . అప్పుడు ఆయన తన సృష్టికి అవసరమైన దేవీదేవతలని సృష్టించాడు. ఇంకా భూమి గట్రా అప్పటికి ఏర్పడలేదు. 

ఆయన తన పద్మం నుండీ కిందికి దిగి వచ్చాడు. అక్కడ మహా శేషువు మీద శయనించిన మహావిష్ణువు దర్శనమిచ్చారు. బ్రహ్మగారు కాస్త పెద్దరికంగా ‘ ఎవరు నాయనా నువ్వు ?’ అని అడిగారు. ‘కూర్చో నాయనా !’ అన్నారు విష్ణుమూర్తి. ‘ నన్ను నాయనా అని పిలుస్తున్నావ్ ? ఎవరు నువ్వు ?’ అని ప్రశ్నించారు బ్రహ్మగారు. నేను ‘నీకు పూర్వజుణ్ణి’. అని బదులిచ్చారు మహావిష్ణువు.  బ్రహ్మగారు అయితే నీవు నాకంటే శక్తిమంతుడివా ? అని అనడిగారు.  అలా వారిద్దరిమధ్యా ఎవరు గొప్ప అనే వివాదం మొదలయ్యింది . అది బ్రహ్మగారు బ్రహ్మాస్త్రాన్ని , విష్ణువు వైష్ణవాస్త్రాన్ని ఒకరిమీద ఒకరు ప్రయోగించుకొని, సృష్టి మొదలవ్వ కొండానే ప్రళయాన్ని సృష్టించేంతదాకా వెళ్ళింది. 

సరిగ్గా అప్పుడు వారిమధ్య ఉదయించింది ఒక మహా అగ్ని శిఖ.  ఆదీ, అంతము తెలియని  ఒకానొక పరం జ్యోతి అది. నిలువునా దివ్యమైన వెలుగులు చిమ్ముతున్న ఆ జ్యోతిని చూసి , వీళ్ళిద్దరూ ఒక పందెం కట్టుకున్నారు.  ముందుగా ఈ అగ్ని స్వరూపం మొదలు లేదా తుది ఎవరు కనిపెడతారో వాళ్ళు గొప్ప అని. విష్ణుమూర్తి వరాహరూపంలో మొదలు కనిపెట్టడానికి కిందికి తవ్వుకుంటూ వెళ్ళాడు.  అందుకే ఆయన్ని ఆదివారాహస్వామి అని వ్యవహరిస్తాం . ఇక బ్రహ్మగారు హంసస్వరూపుడై రివ్వున ఎగురుతూ పైకి వెళ్లారు , ఆ మహా జ్యోతి తుది కనిపెట్టడానికి. 

రోజులు గడిచిపోతున్నాయే కానీ , ఆది అంతములేని ఆ జ్యోతి తుది మొదలు వారిద్దరికీ దొరకనేలేదు.  అప్పుడు బ్రహ్మగారు విసిగిపోయి నేను అసత్యం చెబుతాను. నేను ఈ జ్యోతి అంతము చూశాను . అంటాను. ఎవరు మాత్రం దానిని నిగ్గు తేల్చగలరు? తేల్చాలంటే, దీని అంతాన్ని చూసినవాడై ఉండాలికదా ! అని భావించారు. అదేసమయంలో ఒక మొగలి రేకు ఆ జ్యోతి స్వరూపము నుండీ జారుతూ కనిపించింది. దానిని పట్టుకొని , నీవు ఆ జ్యోతి అంతాన్ని చూశావా అని ప్రశ్నించారు. లేదు, నేను ఈ జ్యోతి నుండీ కిందికి జారుతున్నాను. అని చెప్పింది . అయితే, నువ్వు దీని అంతాన్ని చూశానని నాకు సాక్ష్యం చెప్పు అన్నాడు బ్రహ్మగారు.  ఆవిధంగా మొగలిరేకు సాక్ష్యాన్ని తీసుకొని విష్ణువుతో అసత్యం పలికాడు. 

బ్రహ్మగారు ఆ జ్యోతి ఒక జడ స్వరూపం అనుకున్నారే గానీ అది పరమాత్మ స్వరూపమని అగ్ని లింగమని తెలుసుకోలేక పోయారు.  పరమాత్మకు అసత్యం ఆడడం , అసత్యమార్గంలో వెళ్లడం, అధర్మాన్ని ఆచరించడం అనేవి అస్సలు ఇష్టం లేని అంశాలు. ఆయన వెంటనే ఆ జ్యోతిలో నుండీ రుద్రునిగా ఐదు ముఖాయల్తో , నాగాభరణాలతో , జటాజూటంతో ఇవతలికి వచ్చారు. వస్తూనే బ్రహ్మగారిని తన భృకుటి ముడివేసి తీక్షణంగా చూశారు.  భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే నేత్రాలుగా, సూర్యచంద్రలని కలిగిన ఆ త్రినేత్రుడు అలా కనుబొమ్మలు ముడివేయగానే, ఆ నుదుటిలోనుండీ ఉద్భవించాడు దిగంబరంగా ఉన్న ఒక నీలవర్ణ రుద్రుడు.  ఆయనే కాలభైరవుడు. ఆయన వస్తూనే నాలుగు తలలమీద ఉన్న బ్రహ్మగారు ఐదవతలని తన గోటితో తొలగించి పారేశాడు.  అది ఆ కాలభైరవుని ఆవిర్భావ కథనం. 

ఈ భైరవస్వరూపాలు ఎనిమిది స్వరూపాలు . వారిని అష్టవిధ భైరవులు అంటారు. భైరవుని వాహనం శునకం. ఆ శునకం మాదిరి నిత్యం మనని అంటిపెట్టుకొని, కాపలాగా ఉండి, రక్షించేవాడు కాలభైరవుడు. కాలమే తానైనవాడికి తెలియనిది ఏది ? మంచీ చెడులు , భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని ఆయనకి కారతలామలకమే ! కాలము కన్నా శక్తివంతమైనది మరేదీ లేదు.  మన కర్మలన్నీ కూడా సాక్షిగా ఉండి  గమనించే వాడే ఈ కాలభైరవుడు. అందువల్ల కాలభైరవార్చన చేయడం వలన కస్టాలు దూరమవుతాయి, అపమృత్యువు తొలగిపోతుంది  అని చెబుతోంది మనశాస్త్రం.  

శుభం . 

#kalabhairava 

Tags: kalabhairava, bhairavastami, astami, kalastami, 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha