Online Puja Services

శివుడిని లింగరూపంలో ఆరాధించడం వల్ల

18.119.104.238

శివుడిని లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి.
లక్ష్మీరమణ 
 
శివుని ఆలయాల్లో ఎక్కడా కూడా స్వామి స్వరూపం కనిపించదు . అందుకు ప్రతిగా లింగ స్వరూపాన్నే ఆరాధించడం జరుగుతుంది . ఇందుకు తార్కాణంగా మనకి వరాహపురాణంలో ఒక కథ కనిపిస్తుంది . త్రిమూర్తులనీ పరీక్షించడానికి వెళ్లిన భృగుమహర్షి , కైలాసానికి చేరుకుంటారు . ఆసమయంలో  శివయ్య , అమ్మవారితో కలిసి ఆనంద తాండవం చేస్తుంటారు . ఆయన రాకని పట్టించుకోకుండా , కనీస అతిధి మర్యాదలు చేయకుండా పరమేశ్వరుడు , తనదేవేరితో కలిసి నాట్యవిలాసాన్ని ప్రదర్శించారని కోపిస్తారు భృగుమహర్షి. మహర్షుల కోపం, కరుణా కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి మరి ! ఆ కోపంలో ఆయన పరమేశ్వరుణ్ణి “నీ రూపానికి పూజలు జరగవని” శపిస్తారు. భక్తులు పరమేశ్వరుని పూజని వీడి ఉండగలరా ! అందుకే ఆ తర్వాతనుండీ ఈశ్వరుని రూపానికి మారుగా ఆయన స్వరూపంగా లింగానికి పూజలు చేయడం మొదలయ్యింది . అయితే నిజానికి       శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలే  విశేషంగా ఉంటాయి అంటున్నారు పండితులు.    
 
శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన పరమాత్మని  సూచిస్తుంది. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు.  అందువల్ల సాకారమైన స్వరూపంగా కాకుండా ఇలా చిహ్నంగా పూజలు అందుకుంటున్నాడని కూడా భావించవచ్చు . అయితే, 
పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. 
 
ఆ శివ  స్వరూపమే విశిష్టం అనుకుంటే, శివారాధన మరింత విశిష్టం .  స్వయంగా రుద్ర స్వరూపం కానివాడు, శివారాధనకి అనర్హుడు . ఇక్కడ శివుడు అంటే మనలోని తోజోస్వరూపమైన ఆత్మ . విశ్వమంతా ఆత్మ స్వరూపాలే అయినప్పుడు , ఆ ఆత్మ జ్యోతికి, పరంజ్యోతి కి భేదం లేదుకదా ! రుధ్రానువాకాలలో ఈ విషయం మనం గమనించవచ్చు .  ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. స్వయంగా రుద్రునిగా భావన చేశాకే, ఆ రుద్రుని పూజని నిర్వహించడం సంతాన ధర్మం లోని గొప్పదముకాక మరేమిటి ? 
 
ఇక ఆ శివుని రూపాలు ఈ దేశంలో కోకొల్లలు . శివునికి జంగముడని పేరు .  జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు తదితర జీవులన్నీ. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. సర్వజీవులలో ఆ ఈశ్వరుణ్ణి భావన చేసే గొప్ప సంప్రదాయం ఇది. 
 
జీవులేకాదు ప్రక్రుతి కూడా పరమేశ్వర స్వరూపమే ! కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు  ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు ఆ  పరమశివుడు. ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం ఆ శివుడికి మనం చేసే గౌరవం, అర్చన అవుతుందని గుర్తుంచుకోవాలి . 
 
అణువూ అణువునా నిండిన స్వామిని మన సౌలభ్యం కోసం , మన ఏకాగ్రత కేంద్రీకృతం కావడం కోసం ఒక రూపానికి తెచ్చి పూజించుకుంటున్నాం . ఆ ఆకారం నిరాకారం , సాకారం కూడా అయ్యే గొప్ప చమత్కారం కలిగిన రూపం ఆ మహాశివుడు . మానవసేవే మహాదేవుని సేవగా ఎంచి అనుగ్రహించే భోళా శంకరుడు . కార్తీకమాసంలో ఏ జీవికైనా చేసే అతిచిన్న దానానికి కూడా అమితానందంతో అనుగ్రహాన్నిచ్చే అమృతస్వరూపుడు . ఆయన కరుణాకటాక్షాలు మనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, స్వస్తి !! 

 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda