తనని తానే సృష్టించుకున్న బోళాశంకరుడు!

3.236.51.151

సృష్ట్యాదిలో భక్తుల సౌకర్యార్థం తనని తానే సృష్టించుకున్న బోళాశంకరుడు!
 
ప్రపంచంలో ఒకే ఒక చోట తాననితానే సృష్టించుకున్న ఆ శివుని లింగస్వరూపం ఉంది. ఇది శివశక్తి సమన్వితం . పరమశివుని ఆత్మలింగాన్ని తెమ్మని రావణాసురుణ్ణి , అతని తల్లి కైకసి అడిగినప్పుడు ఈ శివస్వరూపమగురించి ఆమెకి తెలిసి ఉండదు . అలా తెలిసి ఉంటె, ఆత్మలింగంకోసం కైలాసాన్నే పెకిలించాల్సిన అవసరం రావణాసురుడికి వచ్చేదికాదు. ఇంతకీ ఈ క్షేత్రం తమిళనాడులోని   తిరువిడైమరుదూర్ లో ఉంది . 

సృష్టిని ఆరంభిస్తూ , బ్రహ్మ దేవుడు స్థాపించిన కలశం మొదట భూమి పై తాకిన ప్రదేశం కుంభకోణం. కుంభకోణానికి అతిసమీపంలోనే ఉంటుంది ఈ పరమపావన లయకారుని ఆలయం . ఇక్కడ పరమశివుడు తనని తానె ప్రతిష్టించుకున్నాడు .  ఈ స్వామిని శ్రీ మహాలింగేశ్వరస్వామి గా పిలుస్తారు . మహాలింగస్వామి స్వంభువుడు. పేరుకి తగినట్టే , మహా స్వరూపంతో విరాజిల్లుతుంటాడు .  భక్తితో ఈయన ఆలయానికి ప్రదక్షిణ చేసివారికి  ఏ విధమైన మానసిక బాధలైనా తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  అంతేకాదు, వివాహం, పిల్లలు, ఉద్యోగం వగైరా సకల కోరికలూ నెరవేరుతాయట.

అమ్మవారు బృహత్ సుందర కుచాంబాల్ (తమిళంలో పెరునల మామువై అమ్మాళ్).  ఇక్కడ గర్భాలయం ముందు ముఖ మండపంలో వున్న నంది ఈ జిల్లాలోని అన్ని ఆలయాలలోని నందులకన్నా పెద్దది (బృహదీశ్వర ఆలయంకన్నా కూడా).  కానీ ఇది ఏకశిలానిర్మితం కాదు . పూర్వకాలంనాటి ఆ సాంకేతికత  నందీశ్వర స్వరూపంలో మన ముందు నిలువెత్తునా నిలిచి ఆశ్చర్యానికి గురిచేస్తుంది . 

 పురాణప్రశస్తి :

ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని ఇతిహాసం . పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే, అది స్వామి ఆత్మలింగంతో సమానమైనదేగా !! 

స్థలపురాణం ప్రకారం ఒకసారి అగస్త్య మహర్షి ఇతర మహర్షులతో కలిసి మధ్యార్జునానికి వచ్చి ఉమాదేవికోసం తపస్సు చేశాడు.  ఆవిడ ప్రత్యక్షమైనప్పుడు, ఆవిడని ప్రార్ధించిన అగస్త్యుడు స్వామి దర్శనం కూడా ప్రసాదించమన్నాడు.  అమ్మవారు వారికోరిక మన్నించి, శివుడికోసం తపస్సు చేసింది.  శివుడు ఆవిడ కోరిక మన్నించి, ఆవిడకీ, ఋషులకీ ప్రత్యక్షమయ్యాడు.  వారిముందు ప్రత్యక్షమైన తర్వాత శివుడు అక్కడవున్న లింగాన్ని పూజించసాగాడు.  ఆశ్చర్యపోయిన ఉమాదేవి శంకరుణ్ణి అడిగింది .స్వామి, భక్తులూ, దేవతలూ మిమ్మల్ని పూజించాలిగానీ, మీరేమిటి మిమ్నల్ని మీరే పూజించుకుంటున్నారు అని.  పూజించేవారమూ, పూజలు స్వీకరించేవారమూ మనమే.  ఈ ఋషులు మనల్ని పూజించటం మరచిపోయారు గనుక,  మనని మనమే పూజించుకోవాలి.  అందుకే ఇలా చేశాను అన్నారట . అహం బ్రహ్మాస్మి అని ఆ స్వామీ ఇలా తెలియజేశారు కదా ! అప్పటినుండీ ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు . 

సప్త దేవాలయాల నడుమ మహాలింగేశ్వరుడు :
 
మహాలింగస్వామి స్వయంభువు. ఈయన ఈ ప్రాంతంలోని సప్తఆలయాలకు నడుమ మహాలింగేశ్వరస్వరూపంగా విరాజిల్లుతున్నారు . అవే  1. చిదంబరంలో నటరాజస్వామి ఆలయంలోని నటరాజు, 2. తిరు చెంగలూరు ఆలయంలోని చండికేశ్వరుడు, 3. తిరువలంజులిలోని శ్వేత గణపతి , 4. స్వామిమలైలోని సుబ్రహ్మణ్యస్వామి, 5. శీర్ కాళిలోని సత్తెనాధార్ ఆలయంలో భైరవుడు, 6. నవగ్రహాల ఆలయాలలో ఒకటైన సూర్యుడు, 7. అలాన్ గుడి లోని ఆప్త సహాయేశ్వర్ ఆలయంలో దక్షిణా మూర్తి.

పంచలింగ స్ధలం :
ఆలయం చుట్టూ నాలుగు దిక్కులలో నాలుగు శివాలయాల నడుమ మహాలింగేశ్వరాలయం  వుండటంచేత  దీనిని పంచలింగ స్ధలమని కూడా అంటారు. నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు దేవాలయాలు ఇవీ : తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఆత్మనాధుడు, ఉత్తరపు వీధిలో చొన్ననాధుడు. ఇంతటి విశిష్టతలను నింపుకున్నది కాబట్టే  హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

శ్రీ శంకర విజయం :
తిరువిడైమరుదూర్ మహాలింగస్వామి కి సంబంధించిన మరో విశేషం ఏమంటే , ఆదిశంకరాచార్యులవారికి దర్శనమిచ్చి , ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్హాతాన్ని ఉద్దేశిస్తూ ,  స్వయంగా "అద్వైతం సత్యం" అని మూడుసార్లు వక్కాణించి శ్రీ శంకరాచార్యులవారిని ఆశీర్వదించి, అద్వైత సిధ్ధాంత ప్రచారానికి ఆమోదానుజ్ఞ ఇచ్చిన  పరమేశ్వరరూపం ఈ మహాలింగస్వామివారే!

నడిచే దేవునికి ఇష్టదైవం మహాలింగేశ్వరుడు :
పరమ గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్యులవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు మధ్యార్జునం, శ్రీశైలం. ఆయనకీ ఎవరేమిచ్చినా ఒకంతట స్వీకరించేవారు కాదు . కానీ  మధ్యార్జునంనుంచి ప్రసాదం ఎవరైనా తెస్తే , అత్యంత భక్తితో తీసుకుని తలమీద పెట్టుకుని తీసుకునేవారట . 

ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. 
 ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక స్థానిక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారిపాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెళతాడు. తిరిగి వచ్చే సరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతిని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివ భక్తుడైన పాండు రాజు శివుణ్ణి ప్రార్థిస్తాడు.

శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది.రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు.

బ్రహ్మహత్య దోషం:
స్థలపురాణం లో చెప్పినట్టు , ఆ రాజు వదిలిన బ్రహ్మహత్యాదోషం ఇప్పటికీ తూర్పువాకిలి దగ్గరే ఉండిపోయిందని, లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా తిరిగి బయటికి వస్తే, ఆ  బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

మధ్యార్జునం
ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టును మనం చూడగలం.

మూకాంబిక దేవాలయం
ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారత దేశంలో అత్యంత మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతుంది.

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.

ఇలా చేరుకోవాలి :
రోడ్డు మార్గం-తిరువిడై మరుదూర్ కు కుంబకోణం బస్ స్టాండ్ చాలా దగ్గర. అక్కడి నుండి జిల్లా సర్వీస్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం-తిరువిడై మరుదూర్ కు కేవలం 9కిలోమీటర్ల దూరంలో కుంబకోనం రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడి నుండి లోకల్ బస్స్ సర్వీలు ఉన్నాయి.
విమాన మార్గం-98కిలోమీటర్ల దూరంలో తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడి నుండి బస్సు, టాక్సీ ల ద్వారా తిరువిడై మరుదూర్ చేరుకోవచ్చు.

- లక్ష్మి రమణ 

Quote of the day

It is the habit of every aggressor nation to claim that it is acting on the defensive.…

__________Jawaharlal Nehru