మహా పాశుపత మంత్ర ప్రయోగము

18.204.2.231

పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది. 

అయితే రుద్ర సంపుటితో చేసేటటువంటి పాశుపత హోమాన్ని అత్యంత ఫలదాయనిగా చెబుతారు . పాశుపత మంత్రాన్ని కృష్ణుడు ,అర్జనుడికి ఉపదేశించారని,  తద్వారా ఆయన పాశుపతాస్త్రాన్ని శివానుగ్రహంగా పొందారని పురాణవచనం. 

పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయాల్సి ఉంటుంది.  రుద్రములోని  169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి.

ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।

ఇది సంపుటి చేయవలసిన మంత్రం.
ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి.
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి.
ఆ తర్వాత రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి.

ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నట్లయితే  మంచి ఫలితములను ఇస్తుంది.

ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు.

1. మహా పాశుపతము 
2. మహాపాశుపతాస్త్ర మంత్రము 
3. త్రిశూల పాశుపతము 
4. ఆఘోర పాశుపతము 
5. నవగ్రహ పాశుపతము 
6. కౌబేర పాశుపతము 
7. మన్యు పాశుపతము 
8. కన్యా పాశుపతము 
9. వరపాశుపతము 
10. బుణ విమోచన పాశుపతము 
11. సంతాన పాశుపతము 
12. ఇంద్రాక్షీ పాశుపతము 
13. వర్ష పాశుపతము 
14. అమృత పాశుపతము 

ఈ 14 కాక మృత్యుంజయ పాశుపతాన్ని ప్రత్యేకించి అపమృత్యుభయ నివారణకు చేస్తుంటారు . ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం ఇది .ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహించడం ఉత్తమం.

- లక్ష్మి రమణ 

Quote of the day

Our nature is the mind. And the mind is our nature.…

__________Bodhidharma