శివుడు పట్టుకునే ధనుస్సు

18.204.2.231

ఓం నమఃశివాయ 

"శివో - మహేశ్వరః - శంభుః - పినాకీ - శశిశేఖరః -       
వామదేవో - విరూపాక్షః - కపర్దీ - నీలలోహితః"

మహాకవి "ధూర్జటి" ఒక పద్యంలో తెల్పుతూ, ఓ శివా నీ నామము... 
వజ్రాయుధాన్ని పూవుగా... నిప్పును మంచుగా... అగాధ జలరాశిని నేలగా... శత్రువును మిత్రునిగా... విషం దివ్యాహారంగా... అమృతంగా మారుననీ... 
అంటూ చివరలో  "శివా.. నీ నామము...          
          సర్వవశ్యకరవౌ శ్రీకాళహస్తీశ్వరా’ 
అని వర్ణించి తరించాడు.

ఈశ్వరుడికి ఉన్న నామాల్లో చాలా చిత్రమైనది.. ‘పినాకి’ అనే నామం. 
మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో "కోదండం" పట్టుకున్న శివ మూర్తి... ఎక్కడా కనిపించదు. 

శివుడు పట్టుకునే ధనుస్సు సామాన్యమైనది కాదు. 

ఆయన మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. శ్రీమహావిష్ణువు చేసే రాక్షస సంహారానికి...
శంకరుడు చేసే రాక్షస సంహారానికి చిన్న తేడా ఉంటుంది. 

విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసేటప్పుడు.. 

ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైన శరీరాన్ని స్వీకరిస్తాడు. 
శంకరుడు తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి రాక్షసులను సంహరిస్తాడు. వేరొక రూపం తీసుకోడు. 

అయితే శంకరుడు ధనస్సును పట్టుకున్నట్టు ఎక్కడా చూపించరుగానీ.. వేదం వల్ల శాబ్దికంగా తెలుస్తుంది. 
ఎక్కడంటే... యజుర్వేదంలోని... ‘శ్రీరుద్రం (రుద్రాద్యాయం)’ లో తెలుస్తుంది.

 నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
    నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
    యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః
  శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ’

‘ఓ రుద్రా మా మీద ఏమిటా కోపం? 
స్వామీ మీరు అంత కోపంగా ఉన్నారేమిటి? 
మీ కోపానికి ఒక నమస్కారం’ అని చెబుతూ రుద్రాభిషేకం ప్రారంభిస్తాం. 

ఇక్కడ మనం ప్రసన్నుడైన మూర్తికి నమస్కారం చెయ్యడం లేదు. కోపంగా ఉన్న స్వామివారి మూర్తికి నమస్కారం చేస్తున్నారు. 
కోపంతో ఉన్నవారు తన చేతిలో ఉన్న ఆయుధం నుంచి బాణాలను విడిచిపెడతారు. 
ఇవి మనల్ని రోదింపజేస్తాయి. 

మరి ఎందుకు ఆయన అలా ధనుస్సు పట్టుకోవాలి? 
రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి... ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. 
ఆయన తన ధనుస్సును ఎక్కుపెడితే మన కంట అశ్రుధారలు కారుతాయి. 

ఆయన మనల్ని ఎందుకు బాధపెట్టడం అంటే.. చేసిన పాప ఫలితం బాధపడితేగానీ పోదు కాబట్టి. పాపం పోయేలా ఏడిపించేందుకుగాను ఆయన తన బాణాలను తీస్తున్నాడు.

"నేను పాపం చేశాను... కానీ నన్ను అంత ఏడిపించకు... తట్టుకోలేను... 
నేను ఏడిస్తే నీ పాదాల యందు విస్మృతి కలుగుతుంది. నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. 
కాబట్టి ఈశ్వరా నీ కోపానికి ఒక నమస్కారం. 
ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. 
ఈశ్వరా నీ బాణాలకు ఒక నమస్కారం. 

మేమేదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. 
నీవు తలుచుకుంటే, నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డు రారు. 
నా యందు దయ ఉంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో’ అని ప్రార్థిస్తే... ఆయన ప్రసన్నుడు అవుతాడు. 

అసలు సనాతనధర్మంలో.. మనను భయ పెట్టడానికి మనం చేసే పాపానికి ఫలితం... 
ఇచ్చే వారొకరు... భయం తీసేవారు ఒకరు వేర్వేరుగా ఉండరు. 

                 ‘భయకృత్‌ భయనాశనః’...

భయాన్ని సృష్టించేవాడు, తీసేసేవాడు పరమాత్మే. 
ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు. 
శాస్త్రప్రకారం ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. 

ఘోరరూపంతో పాపఫలితాన్నిచ్చినా.. 
అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా... 
చేస్తున్నది మన రక్షణే. 
ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినది

హర హర మహాదేవ శంభో శంకర 
              ఓం నమఃశివాయ

- సత్య వాడపల్లి 

Quote of the day

Our nature is the mind. And the mind is our nature.…

__________Bodhidharma