మహాదేవా !! నిన్ను ఎలా పూజించాలి?

35.153.166.111
మహాదేవా ...! నీ అభిషేకానికి నీళ్ళు తీసుకుని గుడిమెట్లు ఎక్కాను...
పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది అని మర్చిపోయాను..
 
మహాదేవా..! హలాహలం వేడితో నువ్వు తపిస్తున్నావని, మంచి గంధo లేపనం వేద్దాం అనుకున్నాను...
చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే నీ వాసం అయితే, నీ శిరసే శశాంకుడి నివాసం అని మర్చిపోయాను...
 
మహాదేవా..! మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం అనుకున్నాను...
మణిరాజు అయిన వాసుకి నీ మెడలో కంఠాభరణం అని మర్చిపోయాను..
 
మహాదేవా..! వేద స్తోత్రాలతో నిన్ను స్తుతిద్దామని అనుకున్నాను...
వేదాలనే చెప్పిన ఆదిగురువు దక్షిణామూర్తివి నీవే అని మర్చిపోయాను....
 
మహాదేవా..! కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపచేద్దాం అని అనుకున్నాను... 
సంగీతానికి బీజమైన ఓంకారo , నీ ఢమరుక నాదమే అని మర్చిపోయాను...
 
మహాదేవా..! శాస్త్రీయనాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను.
నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వే అని మర్చిపోయాను...
 
మహాదేవా..! షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి మురిసిపోదాం అనుకున్నాను... 
అందరికి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే, నీ అర్ధ శరీరం అని మర్చిపోయాను..
 
మహాదేవా..! ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం పొందుదాం అనుకున్నాను... 
శిలాదుడి పుత్రుడైన, బసవ నందీశ్వరుడు నీ వద్దే ఉన్నాడని మర్చిపోయాను...
 
మహాదేవా...! ఇక నిన్ను ఎలా పూజించాలో, ఎలా సేవించాలో , ఎలా తరించాలో తెలియట్లేదు ప్రభూ...! 
నాది అంటూ ఏముంది నాలోన..?
 
నాలో వెలుగుతున్న జ్యోతి నాది కాదు..,
నాది అని భ్రమించే దేహం నాది కాదు..,
నాది అనుకునే "నా అహం" నాది కాదు..,
నాలో చెలరేగుతున్న భావాలు కూడా నావి కాదు...
 
సత్యం తెలిసింది దేవా...
 
"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ".... 
 
 *ఓం నమఃశివాయ* 
 
- పాత మహేష్
 

Quote of the day

The greatness of a nation can be judged by the way its animals are treated.…

__________Mahatma Gandhi