Online Puja Services

శివుని విగ్రహాలకు ఎందుకు పూజలుండవు?

18.191.228.88

శివుని విగ్రహాలకు ఎందుకు పూజలుండవు?

శివ లింగము హిందూ మతంలో భక్తులచే పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించే వారు. కానీ ఆ పరమాత్మని లింగరూపంలో పూజించడానికి వరాహపురాణంలో ఓ చరిత్ర ఉంది.

 అది ఏంటంటే వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు. అప్పటి నుండి శివుడిని లింగరూపంలో కొలుస్తున్నాం. 

అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవని తెలుస్తుంది. ఆ శాపం కారణంగానే శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెపుతుంటారు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ఇక పోతే శివుడికి రూపం కూడా ఉండకపోవటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు.

మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం.

ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు.

శివ లింగనిర్మాణము:

శివలింగములో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 

- బి. సునీత  

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore