శివుని వరం కాదని భర్తచితిలో దూకిన ఆహుక

3.231.167.166

ఆహుకుడు - ఆహుక
అది కైలాస పర్వత శిఖరం.శివపార్వతుల ఏకాంత సమయం.

"స్వామీ, నాదొక సందేహం." చిరునవ్వుతో అడిగింది పార్వతి.
"ఏమది? " అని అడిగాడు శివుడు.
"మీకు భక్తులంటే ఇష్టమా లేక తాపసులంటే ఇష్టమా!? బ్రహ్మజ్ఞానులంటే ఇష్టమా! " అని ప్రశ్నించింది.
"అందరూ నాకు ప్రీతి పాత్రులే. కానీ పరోపకారం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగమూర్తులంటే మరింత ఇష్టం." అన్నాడు శివుడు.
"అలాంటి త్యాగమూర్తులు ఎవరైనా ఉన్నారా!" అని అడిగింది పార్వతి.
ఎందుకు లేరూ.. అలా చూడు అని భూలోకం వైపు చూపించాడు శివుడు.. చూసింది పార్వతి.- - -

అది ఒక పర్వతారణ్య ప్రాంతం. కిలకిల నవ్వుతూ పరుగెత్తుకుని వస్తోంది "ఆహుక". ఆమెను ఆట పట్టిస్తూ తరుముతూ వస్తున్నాడు.. "ఆహుకుడు."
వారిద్దరూ భిల్లజాతికి చెందిన ఆటవిక దంపతులు. పరుగెత్తుతున్న "ఆహుక " చెయ్యి పట్టుకుని బలంగా లాగాడు "ఆహుకుడు" ఆమె అతని గుండెల్లో బందీ అయింది.
"ఒగ్గేయ్ మావా! " సిగ్గుల మొగ్గ అవుతూ గారాలు పోయింది "ఆహుక".
"ఒగ్గేసే వాణ్ణే అయితే ఈడదాకా దౌడు తీయించేవాడినా.. ఆడనే ఆగిపోయేవాడిని" కొంటెగా నవ్వుతూ అన్నాడు "ఆహుకుడు" . అరచేతుల్లో ముఖం దాచుకుంది "ఆహుక".
చూస్తున్న పార్వతి "ఆ యిద్దరిలో ఎవరంటే మీకు ఇష్టం." అని శివున్ని ప్రశ్నించింది.
"ఇద్దరూను" అన్నాడు శివుడు.
"అయితే వారి త్యాగం ఏపాటిదో పరీక్షించాల్సిందే" అంది పార్వతి.
"త్యాగానికి పరీక్ష అంటే కఠినంగానే ఉంటుంది. నీ సందేహం తీరాలంటే పరీక్షించాల్సిందే" అని శివుడు ఒక యతి రూపం ధరించి కైలాసం నుంచి కదిలాడు.
ఆహుకుడు, ఆహుక, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవి దారిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆకాశం దట్టంగా మేఘావృతమైంది.
మావా, నింగి నల్లబడింది. వాన కురుస్తుందేమో " అంది ఆహుక.
" అది మన కోసమే నల్లబడింది. నీ బుగ్గల్లో ఎరుపు చూడాలని" అన్నాడు ఆహుకుడు. అతని భుజాలు గిల్లింది ఆహుక.

ఇంతలో ఆకాశం మెరిసింది.
"మావా.. ఆకాశం ఎంత అందంగా మెరుస్తోందో.. " అంది ఆహుక.
"అంతలోనే మాయం అయిందిగా.. ఎందుకంట " చిలిపిగా అడిగాడు ఆహుకుడు.
"ఏమో నాకేం తెలుసు? " అమాయకంగా చూసింది ఆహుక.
"నీ అందం ముందు నిలబడలేదని జారుకుంది " అన్నాడు ఆహుకుడు.
"పో మావా !" అని కొండవాగుకు దగ్గరగా వున్న గుడిసెలోకి పరుగెత్తింది ఆహుక. ఆమె వెనుకే ఆహుకుడు గుడిసెలోకి దూరాడు.

వాన మొదలైంది. చిన్నగా మొదలైన ఆ వాన కొద్దిసేపటికే జడివానగా మారింది. గుడిసే లేపల ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి, ప్రకృతిని మర్చిపోయి కబుర్లాడుకుంటున్నారు ఆహుకుడు, ఆహుక.
వాన మొదలైంది. చిన్నగా మొదలైన ఆ వాన కొద్దిసేపటికే జడివానగా మారింది. గుడిసె లోపల ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి, ప్రకృతిని మర్చిపోయి కబుర్లాడుకుంటున్నారు ఆహుకుడు, ఆహుక.
వాన తీవ్ర రూపాన్ని దాల్చింది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఇవేమీ వారిరువురికి తెలియడం లేదు. ఇంతలో వారి గుడిసె తలుపు ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది. బాహ్య ప్రపంచంలోనికి వచ్చారు యిద్దరూ. తిరిగి తలుపు కొట్టిన చప్పుడు. ఇద్దరూ వెళ్లి తలుపు తీశారు. గుమ్మం దగ్గర బాగా తడిసిపోయి వణుకుతూ నిలబడి వున్నాడు యతి రూపంలో వచ్చిన శివుడు.

"వర్షం బాగా వస్తోంది. చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను. ఈ రాత్రికి మీ గుడిసెలో గడపాలనుకుంటున్నాను ." అన్నాడు శివుడు.
"స్వామీ, మాకున్న స్థలం చాలా చిన్నది. మా యిద్దరికే చాలదు. బయట గాలివాన. మీరా ఋషుల్లా వున్నారు. మీకు గుడిసె యిస్తే, మేమిద్దరం బయట ఉండాలి. అయినా పరవాల్లా. మీ అలుపు తీరే దాకా మా గుడిసెలో సేద తీరండి. " అన్నాడు ఆహుకుడు.
"మరి నీ భార్య ఏమంటుందో? " అన్నాడు శివుడు.
"మా మావ మాటే నా మాట. రా మావా! బయటికి వెళదాం. స్వామీ, మీరు లోనకి వెళ్లండి. " అని చెప్పి ఆహుకుని తీసుకుని బయటకి నడిచింది ఆహుక. యతి రూపంలో వున్న శివుడు గుడిసె లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

గుడిసె బయట చూరు కింద వానకి సగం తడుస్తూ ఒదిగి కూర్చున్నారు ఆహుక, ఆహుకుడు. వాన వేగం తగ్గింది. వారిద్దరికి ఎప్పుడు నిద్ర పట్టిందో వారికే తెలియదు. ఇంతలో ఒక పెద్దపులి అటు వచ్చి నిద్ర పోతున్న ఆహుకుడుపై దాడి చేసింది. నిద్రమత్తులో వున్న ఆహుకుడు శక్తి వంచన లేకుండా పులితో పోరాడాడు కానీ, చివరికి పులి బారిన పడి మరణించాడు. పులి తన ఆకలి తీరే వరకు అతని శరీరాన్ని తిని, తన దారిన తాను వెళ్లిపోయింది. ఇదేమీ ఆహుకకు తెలియదు. ఆమె అలాగే నిద్రపోతోంది.

తెల్లారింది. ఆహుక నిద్ర లేచింది. చచ్చిపడివున్న భర్తను చూచి గుండెలు బాదుకుంటూ అతని శరీరం మీద పడి బావురుమని ఏడుస్తోంది. గుడిసె తలుపులు తెరుచుకుని ఆ యతి బయటకు రాలేదు. ఆహుక ఎండుపుల్లలన్నీ ఒక చోట పేర్చి, తన భర్త శవాన్ని చితిపై నుంచి అగ్ని ముట్టించి, తాను ఆ చితిలో దూకబోయింది. అపుడు తెరుచుకుంది గుడిసె తలుపు.

యతి బయటకు వచ్చాడు "ఆగు ! ఏమిటి తల్లీ ఈ సాహసం " అన్నాడు.
"నా మావ లేక పోయిన తరువాత నాకీ బతుకెందుకు స్వామీ!" అని కన్నీళ్ళతో అంది ఆహుక.
యతి శివుడుగా ప్రత్యక్షం అయ్యాడు. ఆయన ప్రక్కనే పార్వతి నిలిచింది. ఆశ్చర్యంగా చూసింది ఆహుక.
"మీ దంపతుల త్యాగం నాకు సంతోషాన్ని కలిగించింది. ఏ వరం కావాలో కోరుకో!" అన్నాడు శివుడు.
"నీకు ఏ వరం ఇవ్వాలని తలిస్తే అది యివ్వు. " అని చెప్పి చితిలో దూకి ప్రాణ త్యాగం చేసింది ఆహుక. వారివురి ఆత్మలు శివునిలో లీనమయ్యాయి. ఆశ్చర్యపోయింది పార్వతి.
ఆ యిరువురే మరు జన్మలో నల, దమయంతులుగా జన్మించారు. శివుడే హంస రూపం ధరించి వారివురి మధ్య ప్రేమ రాయబారం నడిపి వారికి వివాహం జరిపించాడు

 

MVS సుబ్రహ్మణ్యం
 

Quote of the day

As mortals, we're ruled by conditions, not by ourselves.…

__________Bodhidharma