గోకర్ణ క్షేత్రం

18.232.59.38

గోకర్ణ క్షేత్రం -

“పరలోకాలలో శివుడుండే శ్రీ కైలాస మెంత గొప్పదో భూమ్మీద యీ గోకర్ణ క్షేత్రం అంత గొప్పది.

రావణాసురుడి గురించి నీకు తెలుసుగదా ! పది తలకాయలు ఇరవై చేతులూ, పట్టరానన్ని పౌరుష ప్రతాపాలుతో ప్రపంచాన్ని గడగడలాడించేసిన రాక్షసుడు వాడు.  అయితే శివభక్తుడు కూడాను.

ఆ రావణాసురుడి తల్లి కైకసి.  ఆవిడ రోజూ సముద్రతీరంలోని శివలింగాన్ని నిర్మించి, పూజిస్తుండేది.
నదీ మృత్తికతో పార్దివ లింగాన్ని చేసి ఆరాధించడమే మహా పుణ్యం . కాగా సముద్ర తీరపుటిసుకతో చేసిన “సైకత”లింగం యింకెంత ఫలాన్నిస్తుందో వూహించుకో.

అదిగో ! ఆతల్లి చేసిన ఆ పూజల ఫలంగానే-ఆవిడ కొడుకైన రావణాసురుడు అన్నిలోకాలనీ అడ్డూ ఆపూ లేకుండా జయించగలిగాడు.

ఒకరోజు ఆ  రావణుడు తల్లిచేసే సైకత లింగార్చనని చూసి బాధ పడ్డాడు. తనంతటివాడి తల్లి, ఇసుకని పోగుచేసి ఈశ్వరలింగార్చన చేయడం నచ్చలేదతనికి, అసలు కైలాసాన్నే తెచ్చి లంకలో పెట్టేస్తే” వాళ్ళ అమ్మగారు ప్రత్యక్షంగానే పరమేశ్వర పూజ చేసుకోవచ్చు గదా” అనుకున్నాడు.

అనుకోవడమే ఆలస్యంగా సరాసరి కైలాసం చేరాడు. ద్వారంలోనే అడ్డగించాడు నందీశ్వరుడు, తనంతటివాణ్ణి అలా ద్వారం దగ్గరనే ఆపి  వేయడంతో భగ్గుమన్నాడు రాక్షసుడు.

మాటా మాటా పెరిగింది. "పోరా కోతి ముఖమా” అని అధిక్షేపించాడు నందిని.  అందుకు కినిసిన నంది. "ఆ కోతుల వల్లనే” నీ రాజ్యం అంతరించుగాక" అని శపించాడు.  కోతులు తననేమి చేస్తాయి లెమ్మను కున్నాడు రావణుడు.

మొత్తం కైలాసాన్నే పెకలించుకు పోవాలనుకున్నాడు మహా  మహా బలశాలియైన  రావణుడు. ఇరవై చేతులా తల పైకెత్తుకున్నాడా కైలాసాన్ని.  కదిలించాడు కైలాసాన్ని.  కదిలి పోయింది కైలాసం.  అమ్మవారితో కలిసి ఆనంద నృత్యం చేస్తూన్నాడు ఆదిశంకరుడు.
కొండ కదలుడులో పదన్యాసం తప్పబోయింది.  టక్కున ఎడమ కాలి బొటన  వ్రేలితో ఒక్క అదుము అదిమాడు కొండని అంతే.

అంత యెత్తుకు లేపిన కొండా హఠాత్తుగా క్రిందకు అణగిపోయింది. అణగిపోవడమే కాదు దాదాపుగా దాని పూర్వ భూమికకు తాపడమైపో సాగింది. ఆ భూమికకూ భూధరానికీ మధ్య అప్పచ్చి అయిపోయాడా అసుర సామ్రాట్టు.  దిక్కారిపోయాడా దైత్యకులేంద్రుడు దీనుడై పోయాడా దానవేశ్వరుడు.

అంతటితో బుదొచ్చినవాడిలా “హే నీలకంఠ నిజభక్త హృదయంతరంగా సర్వేశా ! " అంటూ వెర్రికేకలు వేశాడు.

నాయనా నామధారకా ! అలనాటి మొసలి పాలబడిన మదగజేంద్రుడే విధంగానయితే ప్రాణభీతితో “లావొక్కింతయు లేదు ధైర్య”మని కుయ్యి పెట్టాడో అదేవిధంగా - ఇప్పుడీ రావణుడు కూడా నిజాహంభావాన్ని కోల్పోయి “హే ఆపన్న శరణ్యా ! నిటాలాక్షా ! నిజభక్త సంరక్షణా దీక్షా ! నమః పార్వతీ పతే హరహర మహాదేవ శంభో శంకరా” అంటూ మొట్టలు పెట్టుకోసాగాడు.

విన్నాడు విషమాంబకుడు. అతని ఆర్తిలోని ఆత్మార్పణా భావాన్ని గుర్తించాడు. అహంకారాన్ని వదులుకుని శరణుకోరాలేగాని ఆ ఆదిశంకరుడు
కరుణించడమెంతపాటి పని ? ఇట్టే అనుగ్రహించేశాడాయన అదిమి పెట్టిన తన బొటనవ్రేలి నక్కడినుంచి తీసివేసి అమ్మవారితో సహా-కొండపాదాన నలిగిపోతున్న రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చేయూతనిచ్చి ఆ లంకేశ్వరుడిని రక్షించాడు.

అందుకు కృతజ్ఞతగా రావణుడు సామవేదాన్ని సర్వేశ్వర స్తోత్ర పరంగా గానం చేశాడు!  సామగాన ప్రియుడైన సాంబశివుడూ ఆయన అర్థాంగి  పార్వతీదేవీ కూడా.   ఆ రావణ కృత స్తోత్ర గానానికి తన్మయులైపోయారు.  జరిగినదంతా యిట్టే మరిచిపోయి - “ఏం కావాలో కోరుకోవోయ్ రావణా ! అన్నాడు జగదీశ్వరుడు.  అదే అదనుగా భావించిన అసురేశ్వరుడు, తన తల్లియైన కైకసీకృత సైకత లింగారాధనా విషయాన్ని తెలియచేసి ఆమె నిత్యపూజా నిమిత్తమై శివుణ్ణి కైలాస సమేతంగా లంకలో ప్రతిష్టించాలనే తన ఆశను తెలియజేసుకున్నాడు. 

అతగాడి వినయానికి, మాతృభక్తికి మిక్కిలి సంతసించిన మహే శ్వరుడు - మందహాసం చేస్తూ దానవరాజా ! ప్రత్యక్షంగా పూజించడం కోసం కైలాసాన్ని లంకలో స్థాపించనక్కరలేదు. అతిలోకమైన నీ భక్తికి మెచ్చి నీ కోరిక తీరడం కోసం నీకు నా ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాను. అది తీసుకువెళ్ళి లంకలో ప్రతిష్ఠించుకో.  దానిని పూజించినట్లయితే, అది ప్రత్య క్షంగా నన్ను పూజించినట్లే అవుతుంది” అని చెప్పి సృష్ట్యాదినుండి ఆ క్షణం వరకూ యెవ్వరికి అనుగ్రహించనటువంటి తన ఆత్మలింగాన్ని రావణా సురుడికి ప్రసాదించాడా రాజశేఖరుడు. “మహాప్రసాద”మంటూ దోసిలిపట్టి మరీ అందుకున్నాడు రాక్షసరాజు. తక్షణమే లంకకు బయలుదేరబోతున్న దశకంఠుణ్ణి ఆపి - పరమేశ్వరుడిలా అన్నాడు.

"భక్తాగ్రగణ్యా ! ఈ ఆత్మలింగం విషయంలో ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలి సుమా ! దీనిని నువ్వు సరాసరి తీసుకువెళ్ళి లంకా నగరంలో మాత్రమే ప్రతిష్ఠించాలి. ఎందుకంటే ఈ లింగం ఎప్పుడు, ఎక్కడ భూమిని తాకితే అప్పుడే, అక్కడే నేలకు తాపడమై పోతుంది. అందువల్ల పొరబాటున కూడా మార్గమధ్యంలో దీనిని నేలమీద వుంచకు సుమా !”

ఈశ్వరుడి హెచ్చరికను విని - "చిత్త”మంటూ తలవూపి మరీ లంకకు ప్రయాణమయ్యాడా దైతేయుడు. 

ఈ విషయాన్నెలాగో పసిగట్టిన నారదమహాముని సరాసరి ఇంద్రుడి వద్దకు వెళ్ళి “ఈశ్వరుడి ఆత్మలింగం లంకలో ప్రతిష్ఠించబడిదంటే ఇక అమరావతికి దేవతలకీ నూకలు చెల్లినట్లే”నన్నాడు.

నారదుడిమాటలకి కలతపడిపోయిన దేవేంద్రుడు - దేవ గురువైన బృహస్పతిని సలహా అడిగాడు. బృహస్పతి దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వాళ్ళందరిని తీసుకుని వైకుంఠం చేరాడు.

వాచస్పతి నోటిగుండా వాసవాదులకొచ్చిన కష్టమంతా విన్నాడా వాసు దేవుడు.  వినాయకుడిని పిలిపించాడు.  దేవతల కష్టాలన్నీ ఆయనకు వినిపింప చేశాడు.  చివరగా తను కలగజేసుకుని, “విన్నావు గదా వీళ్ళ బాధలని, విఘ్నాలు కలిగించడంలో నీకన్న గొప్పవాళ్ళు లేరు  "అందువల్ల - నువ్వు వెంటనే వెళ్ళి - ఆత్మలింగం లంకకు చేరకుండా విఘ్నాన్ని కలిగించు” అని చెప్పాడు.  తక్షణమే ఆ పనిమీద ప్రయాణమయ్యాడు విఘ్నేశ్వరుడు.

సముద్రతీరాన వెడుతున్నాడు రావణాసురుడు. అంతలోనే సూర్యాస్త మయం కావస్తోంది. అది సంధ్యావందనం చేసుకోవలసిన సమయం కావడంతో రావణుడు ఆలోచనలో పడ్డాడు. సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మణ్యం హరించుకుపోతుంది.  చేద్దామా అంటే - చేతిలో ఆత్మలింగ ముంది.  లంకకు చేరేదాకా ఎక్కడా నేలమీద ఉంచకూడదని పార్వతీనాధుడు ప్రత్యేకంగా హెచ్చరించాడు కూడాను.  ఏం చేయడమా అని ఆలోచిస్తూ - దిక్కులు చూడసాగాడు.

అదే సమయానికి అక్కడికి చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు.  ఒకానొక బ్రాహ్మణ బాలుడి రూపాన్ని ధరించి ఆ ప్రాంతాలలో సమిధల నేరుకుంటు న్నట్లుగా నటిస్తూ - రావణుడికి కనపడేలా సంచరించసాగాడు.

రావణాసురుడా మాయా వటువుని చూశాడు.  “కుర్రాడెవడో బ్రాహ్మణ బాలుడే !   నేను సంధ్యావందనం ముగించుకుని వచ్చేదాకా - ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమంటే సరిపోతుంది” అనుకున్నాడు.  వెంటనే ఆ విప్రకుమారుణ్ణి సమిపించి- అబ్బాయీ ! సూర్యాస్తమయమై పోతోంది నేను సంధ్య వార్చు కోవాలి ముగించుకొని వచ్చేదాకా - ఈ వస్తువుని నీ చేతుల్లో వుంచుకో.  రాగానే యిచ్చివేద్దువుగాని.  ఇందుకు ప్రతిఫలంగా నీవేది కోరితే అది యిస్తాను సుమా !” అని చెప్పాడు.  అందుకా మాయాబాలుడు - అయ్యా ! నేను కూడా సంధ్యా సమయానికల్లా అగ్నికార్యం చేసుకోవాలి. అందుకే సమిధలను ఏరుకుంటున్నాను.  మీ సంధ్యావందనం యెప్పటికవుతుందో యేమిటో !

ఆలస్యమైతే నా అగ్నికార్యం భంగమవుతుంది.  అయినా పెద్దవారు , మీరింతగా చెబుతున్నారు గనక - ఒక్క నియమం.   నాకు వీలైనంత సేపు నేనీ వస్తువును పట్టుకుంటాను.  సమయం కాగానే - మిమ్మల్ని మూడుసార్లు పిలుస్తాను.  వెంటనే వస్తే - దీన్ని మీ చేతుల్లో పెడతాను లేదంటే ఇక్కడే కింద పెట్టేసి వెళ్ళిపోతాను సరేనా ?” అని అడిగాడు.

ఎట్టకేలకు - ఆమాయా వటువు మాటప్రకారము - అతగాడు మూడు సార్లు పిలిచే లోపల వచ్చి - ఆత్మలింగాన్ని తాను తిరిగి తీసుకునే నియమం ప్రకారం రావణాసురుడు దానినా కుర్రవాడి చేతికిచ్చి, తన పేరు చెప్పమని తాను సంధ్యవార్చుకోవడానికై సముద్రంలో అడుగుపెట్టాడు.

సమయం కోసం వేచివున్నాడా విప్రబాలుడి వేషంలో వున్న విఘ్నే శ్వరుడు -  దేవకార్య నిర్వహణకిదే సరైన ముహూర్తం అనిపించినదే తడవుగా - ఓయ్ రావణా ! ఒకటవసారి పిలిచాను”అన్నాడు.

ఆకేక గాలిని బడి రావణుడి చెవికి సోకగానే రెండవసారి పిలిచాడు.  ఆ పిలుపు వినబడి - ఉరకలు పరుగులుతో రావణుడు తనను సమీపిస్తుండ గానే మూడవసారికూడా పిలిచి చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని  అక్కడనే నేలమీద ఉంచేసి, తాను వున్నవాడు వున్నట్లుగానే అదృశ్యమయిపోయాడు విఘ్నేశ్వరుడు. 

ఆ విధంగా ఈశ్వరుడిచ్చిన ఆత్మలింగం విఘ్నేశ్వరుడి పుణ్యమా అని సముద్రగర్భాన వున్న లంకకు చేరకుండానే - సముద్ర తీరప్రాంతంలో భూభాగితమైపోయింది.  రావణాసురుడా లింగాన్ని నేలనుంచి వెలికి తీయాలని తన ఇరవైచేతులతోటి విశ్వప్రయత్నం చేశాడు. ప్రయోజనం లేకపోయింది. కైలాస పర్వతాన్నే అవలీలగా పెకలించిన ఆ రక్కసులరాజు ఇక్కడ సముద్ర తీరపుటిసుకకు తాపడమైపోయిన ఆత్మలింగాన్ని అరవీసమైన కూడా కదల్చలేక పోయాడు.

రావణ భుజబలానికి సహితం చలించనిది కావడంవలన ఆ శివుడి ఆత్మలింగమే. “మహాబలేశ్వర లింగం”గా పేరుపడింది. ఆ లింగాన్ని పెకలించేందుకు చేసిన రాక్షస ప్రయత్నంలో భాగంగా అక్కడ రావణుడి చేతి ముద్రలు ఆవుచెవి ఆకారంలో పడి వున్నందువల్ల ఆప్రాంతం గోకర్ణ క్షేత్రమనే పేర సుప్రసిద్ధమయ్యింది.  ఆ గోకర్ణ క్షేత్రమే - భూకైలాస్ గా కూడా ఖ్యాతి కెక్కింది-” అంటూ చెప్పడం ఆపాడు సిద్ధుడు.      

Quote of the day

Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well.…

__________Mahatma Gandhi