శివ తత్వం మనకు భోధిస్తున్నది ఏమిటి???

100.24.115.215

శివ తత్వం మనకు భోధిస్తున్నది ఏమిటి???

‘శివ’ శబ్దం మంగళాత్మకం...
అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది... 

శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలయుడైనవాడు శివుడు. 
ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది, శివ నామాన్ని జపిస్తుంది, ఆయన దర్శనం కోసమే తపిస్తుంది...
అదీ శివుడి విశిష్టత, శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని- శివుడి మూడు కళ్లు. 
అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత, అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది...
సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. 
ఆ మూడూ ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది...

భస్మాన్ని శరీరమంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు, లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు...
ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది, 

అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం, శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు. 
ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం...

ఆయన గరళ కంఠుడు, అంటే ... కంఠంలో విషాన్ని దాచుకొన్నవాడు, అది కాలకూట విషం, అత్యంత ప్రమాదకరం, అయినా శివుడు చలించకుండా లోక రక్షణార్థం గొంతులో ధరించాడు...
మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది...

జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే, దాన్ని శివుడు విహారభూమిగా చేసుకొన్నాడు, పుట్టిన ప్రతి ప్రాణీ ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక...

నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ, ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం...
ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత, పవిత్రత లభిస్తాయి...
శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం...
చంద్రశేఖరుడు- అంటే, తలపై చంద్రుణ్ని ధరించినవాడు శివుడు, శరీరంలో అగ్రభాగం శిరస్సు. 
అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే, జీవితం వెలుగుతుందని అంతరార్థం...

శివుడు నంది వాహనుడు, ‘నంది’ అంటే ఆనందింపజేసేది, వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది...

సర్పహారి శివుడు, అంటే పామును మెడలో వేసుకునేవాడు... గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని, సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కాని, భయపడి పారిపోకూడదని నాగాభరణత్వం తెలియజేస్తుంది...

శివుడు తాండవ ప్రియుడు, జీవితం ఒక రంగస్థలం, దానిపై నిత్యమూ ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన...

ప్రమథ గణాలకు నాయకుడు శివుడు, లోకంలో ప్రతి వ్యక్తీ ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి. 
వాటిని లోక క్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం.

ఆయన మహా తపస్వి, లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. 
ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది...

ఇలా శివగుణాలు అనేకం, ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే, దైవాన్ని మనిషి తన జీవనమార్గ లక్ష్యంగా చేసుకుంటే, అంతటా శివం (మంగళం) వెల్లివిరుస్తుంది!

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna