Online Puja Services

శివుడినే కదిలించింది 'శివతాండవ స్తోత్రం'

18.117.183.150

అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది 'శివతాండవ స్తోత్రం'
-సేకరణ: లక్ష్మి రమణ 

శబ్దం అంటే ధ్వని మాత్రమే కాదు. అది అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే ఉచ్చారణ విధానం మాత్రమే కాదు. శ్వాసనియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నియం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్తమైన వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది 'శివతాండవ స్తోత్రం'.

రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకున్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివయ్య కరుణించలేదు. ఆయన అనుగ్రహ వీక్షణం కోసం పరితపించిన రావణుడు , మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ వెర్రి ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతుతో కైలాసపర్వతాన్ని పెకళించటం ప్రారంభించాడు.

ఇది ఎవ్వరూ ఊహించని ఘట్టం. ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తోంది. పరమేశ్వరి కూడా విస్తుబోయింది. మరోపక్క, శివయ్యకు మాత్రం ఇవేమీ పట్టటం లేదు. పరమానందంతో తాండవం చేస్తున్నాడు. భూనభోంతరాళాలకు అతీతమైన తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు. రావణాసురుడు కూడా గాఢమైన మూఢభక్తితో పర్వతాన్ని పెకలిస్తూనే ఉన్నాడు. కేవలం పెకలించటమేనా, అంటే కాదు. గొప్ప ఆర్తితో తన ప్రాణదైవం శివయ్యను అనేకవిధాలుగా స్తోత్రం చేస్తున్నాడు.

అద్భుతమైన ఆ తాండవాన్ని చతుర్ముఖ బ్రహ్మ కూడా ఊహించలేడు. అటువంటి  సర్వోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. రాక్షసుడి నోటి నుంచి అద్భుతమైన స్తోత్రం ఆవిర్భవించింది. అద్భుత వర్ణన, అపురూపమైన శబ్ద సౌందర్యం,  అనుపమానమైన విన్యాసం!  అద్భుతం రావణా! భక్తుడవంటే నీవేనయ్యా అంటూ సృష్టి అంతా ముక్తకంఠంతో ప్రశంసించేలా శివతాండవస్తోత్రం ఆవిర్భవించింది. దశకంఠకృత శివతాండవ స్తోత్రంగా విశ్వవిఖ్యాతి పొంది నేటికీ శివభక్తుల పాలిట కల్పవృక్షంగా ప్రకాశిస్తోంది ఆ స్తోత్రరాజం.

తాండవ సందేశం

 'అమంత్రం అక్షరం నాస్తి' - మంత్రం కాని అక్షరం లేదంటారు పెద్దలు. బీజాక్షరాల్లోని మంత్రశక్తి ఈ స్తోత్రంలో అంతర్లీనంగా సాగుతుంది. అందుకే శివతాండవ స్తోత్రాన్ని కేవలం స్తోత్రంగా కాకుండా మోక్షానికి దోవ చూపించే యోగసాధన విధానంగా గ్రహించాలి.

❍ స్వామి చిదగ్ని స్వరూపుడు. మూడోకన్ను అందించే సందేశం ఇదే. లౌకిక దృష్టికి అందని జ్ఞానాన్ని మూడోనేత్రంతో అందుకోవాలి. పరమశివుడి మూడోకన్ను ప్రళయానికి, విధ్వంసానికే కాదు, జ్ఞానోదయానికి, చైతన్యానికి సూచిక. ఇది ప్రాపంచిక కోరికలను దూరం చేసే సాధనం. శివయ్య మూడో నేత్రం తెరిస్తే భస్మమే అంటారు. పాపం భస్మమైతే మిగిలేది జ్ఞానమే. అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన స్వామి దృష్టి మన మీద నిరంతరం ప్రసాదించాని వేడుకోవాలి. అందుకోసం ఆరాటపడాని చెబుతుందీ స్తోత్రం.

❍ విభిన్న వర్ణాలు, విభిన్న తత్త్వాలు, విభిన్న ప్రకృతులు, అన్నీ వేటికవే ప్రత్యేకం. కానీ, స్వామి దగ్గరకు వచ్చేసరికి అంతా ఏకత్వమే. నాగరాజులైనా, గజరాజులైనా స్వామి అధీనంలో ఉండాల్సిందే. నిజానికి స్వామి అధీనంలో ఉండేవి నాగులు, గజాలు కావు. పాములాగా చలిస్తూ, ఏనుగు తీరులో మదమెక్కి అహంకరించే మన మనస్సు స్వామికి అధీనం కావాలి. అప్పుడిక ఆనందం తప్ప మరొకటి ఉండదని చెబుతుందీ స్తోత్రం.

❍ శివయ్య రూపం, చేష్టలు ఎంతో చిత్రవిచిత్రంగా ఉంటాయి. అంతగొప్ప మనిషి కదా. అడగంగానే హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. స్వర్గం నుంచి ఉరుకు పరుగు వేగంతో వచ్చే గంగమ్మ ఆనటానికి తన శిరస్సును అడ్డుపెట్టాడు. మరే వస్త్రమూ లేనట్టు గజచర్మాన్ని కప్పుకున్నాడు. తల మీద తెల్లని చంద్రవంక. ఆ కిందగా నల్లటి కంఠసీమ. ఆ కింద ఎర్రటి జీరతో ఉండే పులిచర్మం. ఇంతటి భిన్నత్వాన్ని ధరిస్తూ సకల విశ్వాన్ని ఏకత్వభావనతో చూసే పరమేశ్వరుడు ప్రపంచానికి శ్రేయస్సును కలిగించాలని కోరుతుందీ స్తోత్రం.

❍ పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్త్వరజస్తమో గుణాకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. శిరస్సు మీద అంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్త్వానికి ప్రతీక. ఆభరణాలుగా ప్రకాశించే సర్పాలు భగవంతుని జీవాత్మగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, పులిచర్మం కోరికకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. శివుడు పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. ఇంతటి వైవిధ్యాన్ని, వైభవాన్ని తనలో దాచుకున్న శివయ్యను మించిన దైవం లేదని ప్రకటిస్తుంది.

ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సృష్టి అంతా శక్తి ప్రకంపనల సమూహమని స్పష్టంగా చెబుతోంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ శబ్దం ఉంటుంది. యోగాలో ఈ సృష్టి అంతా శబ్దమే అనీ, దీన్ని నాదబ్రహ్మ అని అంటాము. ఈ సృష్టి అంతా సంక్లిష్ట మైన శబ్ద అమరికలే. ఈ సంక్లిష్టమైన అమరికల్లో, కొన్ని శబ్దాలని మూల శబ్దాలుగా గుర్తించారు. వీటినే బీజాక్షరాలు అంటారు. ఇటువంటి అనేక బీజాక్షరాల సమాహారంగా సాగుతుంది శివతాండవ స్తోత్రం.

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం వంటి శబ్దాలంకారాలు శివతాండవ స్తోత్రానికి వన్నెతీసుకువస్తాయి. ఒకే శబ్దాన్ని అనేకసార్లు వెంట వెంటనే పలకటం ద్వారా వచ్చే శబ్దసౌందర్యం చక్కటి నాదాన్ని ధ్వనింపజేస్తుంది. నాదం అంటే శబ్దం. అది శివ-శక్తి సంయోగం. వారిద్దరి పరస్పర సంబంధమే నాదం. శివుడు నాద స్వరూపుడు. అన్ని అర్చనల కన్నా నాదార్చన పరమశివుడికి ఎంతో ఇష్టం. అందువల్లనే తాండవ స్తోత్రం శివుడికి ప్రీతిపాత్రమైంది.

శబ్ద ఝరి... భావనా లహరి

❍ శివతాండవ స్తోత్రంలోని తొలి శ్లోకమే పరమేశ్వరుడి నాదతత్త్వాన్ని ప్రకటించటంతో ప్రారంభమవుతుంది. 'డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం'... ఢమ ఢమ ఢమ అంటూ మోగే స్వామి ఢమరుక శబ్దంలోని వైవిధ్యం, ఆ శబ్ద వైభవం, అందుకోసం రావణుడు ఉపయోగించిన శబ్దవైచిత్రి మన మనసుల్ని ఊయలూగిస్తాయి.

ధగద్ధగద్ధగజ్జ్వల్లలాటపట్టపావకే, స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం, స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం 

శివతాండవ స్తోత్రంలో ఇటువంటి అద్భుతమైన పదప్రయోగాలు, విశేషణాలకు కొదవ లేదు. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్థంలో ప్రయోగిస్తూ అంత్యప్రాసతో సాగిన తాండవ స్తోత్రం మన మనసుల్ని నిజంగానే ఆనంద తాండవం చేయిస్తుంది.

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ

 కైలాసంలో మోగుతున్న మృదంగ, భేరీ శద్దనాదాలన్నీ ఒడిసి పట్టినట్లు ఈ ప్రయోగంలో ఇమిడి కుదురుకున్నాయి. మృదంగనాదాన్ని శబ్దనాదంతో అనుసంధానం చెయ్యటం, శబ్దం పకటంతోటే మృదంగ నాదాన్ని ధ్వనింపజేయటం మొత్తం స్తోత్రానికే వన్నె తీసుకువస్తుంది. ఇలాంటి ప్రయోగాలు శివతాండవ స్తోత్రంలోని ప్రతి పాదంలోనూ కనిపిస్తాయి.

మకరందం పిబన్‌ భృంగో గంధాన్నాపేక్షతే యథా / నాదాసక్తం సదా చిత్తం విషయం నాహికాంక్షతి'

థ పువ్వు నుంచి మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద మకరందం మత్తులో లీనమై పువ్వు రంగేమిటో కనీసం పట్టించుకోనట్లుగా శబ్దంలో లీనమైన చిత్తం ఇంద్రియ సుఖాలను కోరదు. అది తన చంచలత్వాన్ని విడిచిపెట్టి నాదం యొక్క సుగంధం చేత మత్తెక్కినదవుతుంది' అని నాదబిందూపనిషత్‌ చెబుతోంది. శివతాండవ స్తోత్రం సరిగ్గా ఇలాంటి అనుభూతినే కలిగిస్తుంది.

❍ మన శరీరంలోని షట్చక్రాలకు శబ్దమే మూలం. మన రెండు చెవులనూ మూసుకుని శ్రద్ధగా ఆలకిస్తే లోపలి నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. వాటిని అనాహత ధ్వనులు అంటారు. అనాహత చక్రం నుంచి అవి ఉత్పన్నమవుతాయి. అంటే మానవ శరీరం పూర్తిగా శబ్ద (నాద) మయమని అర్థం చేసుకోవాలి. నాదమయమైన తనువుతో నాదస్వరూపుడైన పరమేశ్వరుడిని అర్చించాలి. అదే మోక్షసాధన.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi