Online Puja Services

శివాలయాలు స్మశానంతో సమానమా ?

3.137.180.32

శివాలయాలు స్మశానంతో సమానమా ? 
-లక్ష్మి రమణ 

శివుడు స్మశానంలోనే ఎందుకుంటాడు ? ఇదో గొప్ప ప్రశ్న ?శివుడు లయకారకుడు కాబట్టి ఆయన స్మశానంలో ఉంటాడు . దాంట్లో విశేషం ఏముంది అనుకోవచ్చు. అందులో మామూలు రహస్యం కాదు , చిదంబరరహస్యమే దాగుంది మరి . పాల్కడలిపైన పవళించిన విష్ణువుకి , ఆయన నాభిలో ముకుళించి విరిసిన బ్రహ్మదేవునికి ఉన్న సౌఖ్యం ఆ సదాశివుడు ఆశించలేదు . భక్తుల కోసం నిత్యం పరితపించే ఆ స్వామీ పరమసత్య స్వరూపాన్ని తెలియజేయడానికి భూతనాధుడై , స్మశానవాసం ఎంచుకున్నాడు . ఆ విశేషాన్ని తెలుసుకుందాం .  

శివం అంటే కల్యాణం,శుభం అని అర్ధం.శుభాన్ని కలిగించే వాడు శివుడు. అటువంటివాడు , అశుభానికి నిలయమైన ఆ స్మశానవాసం ఎందుకు ? స్మశానం అనేది మరుభూమి . పుట్టిన నాటినుండీ ఎదిగేందుకు, ఎదిగిన తర్వాత జీవించేందుకు జరిగే తపనే మనిషి బ్రతుకు . ఇందులో పరమాత్మ వైపు ప్రయాణం చేద్దాం అని మనము అనుకోవడం మాట అటుంచితే, ఎవరైనా అలా అనుకునేవాణ్ణి , మనము కూడా గేలి చేసిన సందర్భాలు ఉండొచ్చు .  కానీ ఒకసారి ఆలోచించండి , కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుణ్ణి తలుచుకోకుండా ఉంటామా ?

“అరిష్టం శినోతి తనూకరోతి” శివం అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్ధం. ఏదైనా చిన్న ఆపద , కష్టం ఎదురవ్వగానే పూర్ణమైన భక్తి వచ్చేస్తుంది మనకి . కానీ అందులో మనకి ప్రతిఫలాపేక్ష ఉంది . ఏదో కోరి , మనం ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నామన్నమాట . ఆ కాస్త వరం ఆయన ఇచ్చేశారే అనుకోండి , ఇక ఆ తర్వాత మళ్ళీ మరో ఆపద ఎదురయ్యేదాకా , భగవంతుని ప్రార్థనకి బ్రేక్ పడ్డట్టే. ఒక వేళ కొనసాగినా , ఆ ప్రణవం యాంత్రికంగా పెదవులు పలికే నాదమే కానీ, భగవంతునిపట్ల అమితమైన ప్రేమతో ఎదచేసే సవ్వడి కాదు .  అయినా మరణం కన్నా మనిషి భయపడే ఆపదేముంది ?

కానీ, మరుభూమి అలాకాదు . అక్కడి శరీరాలు చలించే మనసుతో సంబంధాన్ని కోల్పోయినవి .  భయం కూడా లేని కేవలం శరీరాలు మాత్రమే అవి . ఆత్మ వాడి వదిలేసిన యంత్రాలు . నిశ్చలమైనవి. భగవంతుడు ఆ చలనం లేని యంత్రాలని ఏంచేసుకుంటాడు ? ఆత్మ - పరమాత్మ . ఆయన  వదిలేసినా ఆ శరీరాలు కేవలం పాడుపడిన ఇళ్లుతో సమానం . 

మరి శివుడు స్మశానంలో ఉంటాడనే మాటకి అర్థం ఏమిటి? అటువంటి నిశ్చలమైన మనస్సులో ఉంటారాయన. అటువంటి ఆత్మలో జ్ఞానదీపమై ప్రకాశిస్తారా పరమాత్మ . దాన్ని తెలుసుకోమని బోధించడమే ఈ స్మశానంలో ఉండే శివ దర్శనం .  మరణంతో స్నేహం చేయాలి గానీ , భయమెందుకు . నిజానికి మరణం మనమున్న శరీరమనే జైలు నుండీ ఆణువణువూ నిండిన పరమాత్మలో లయం  అనే స్వేచ్ఛ నిచ్చే గొప్ప వరమేకదా!   

ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగ శివునికి , ఈ దేహాలయంలో ఉన్న ఆత్మలింగ శివునికి  తేడా ఏముంది ?  మూర్ఘత్వంతో స్మశానవాసి అయినా శివుని దర్శించవద్దని అనడంలో అర్థం ఏముంది ? 

కాబట్టి దేహమే దేవాలయం . ఆదిదేవుడే సనాతన దైవం అని గ్రహించాలి . ఆ జ్ఞానాన్ని సామాన్యుడూ అర్థం చేసుకుంటాడేమో , అర్థం పర్థం లేని ఐహిక సుఖాలగురించి కాకుండా , శుద్ధ చైతన్య స్వరూపమైన పరబ్రహ్మమును గురించి ఆలోచిస్తాడేమో అనే ఆ శివుడు స్మశానంలో కూడా ఎదురు చూస్తాడు . మన ఆశలు అనునిత్యం ఓపిగ్గా విని అనుగ్రహించే, ఆయన ఈ చిన్న కోరికని ఆయనకోసమే కాకపోయినా మన కోసమైనా మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం . ఏమంటారు ?

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore