ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ. || 16 ||
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ. || 17 ||
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 18 ||
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ. || 19 ||
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. || 20 ||
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ. || 21 ||
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ. || 22 ||
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ. || 23 ||
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 24 ||
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. || 25 ||
’రా’ కలుషంబులెల్ల బయలంబడద్రోచిన ’మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ. || 26 ||
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ. || 27 ||
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. || 28 ||
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ. || 29 ||
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 30 ||
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. || 31 ||
Bookmarks