Results 1 to 5 of 5

Thread: భక్తి మార్గం (1)

          
   
 1. #1
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  భక్తి మార్గం (1)

  వేదాల్లో చెప్పబడిన కర్మకాండ, ఉపనిషత్తులలో జ్ఞానము అందరికీ అందుబాటులో ఉండదు. అంచేత అందరికీ సులభమైనదీ , అందుబాటులో ఉండేదైన భక్తిమార్గాన్నిఅధికంగా ప్రాచుర్యంలోకి తెచ్చినది నారద మహర్షే. భక్తిమార్గాన్ని అందరూ అవలబించ వచ్చును. భగవదనుగ్రహం పట్ల విశ్వాసము, భవబంధాలనుంచి విముక్తీ , కల్గుతాయనే నమ్మకము౦టే చాలు . బుద్ధి భగవల్లీనం కావడం ప్రధానం. ప్రతి వ్యక్తికీ మొదట ఇష్టవస్తువుపట్ల ఒకరకమైన ఇష్టం ఏర్పడి , క్రమంగా అది రాగముగా మారుతుంది . అది క్రమంగా తన్మయత్వంగా రూపు చెందుతుంది. దీన్నే భక్తి అంటారు .

  భగవంతుని పట్ల పరమ ప్రేమయే భక్తి. ప్రేమ అంటే అనుభవంలోకి వచ్చేదే కాని , దాన్ని నిర్వచించలేం. కాని అనేకులు భక్తి అంటే ఇలా చెప్పడం జరిగింది. ఎలాంటి ఫలితాన్నీ కోరక భగవంతుని సేవ చెయ్యడమే భక్తి. భగవంతుడు నావాడు అనే మమకారమే భక్తి అని నారద పంచరాత్రంలో చెప్పబడింది. అవిచ్చిన్నంగా తైలధారలా భక్తుని మనస్సు భగవంతుని వేపు నిరంతరమూ పోవడమే భక్తి. స్వస్వరూపానుసంధానమే భక్తి అని శంకరులు వివేక చూడామణిలో అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా భక్తి అనేది మాటలకు, మనస్సుకూ అతీతమైనది. భక్తి కేవలం అనుభూతిచెందేదే.


  ఒకసారి శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తు తెచ్చుకుంటే దాన్లో సాలెపురుగు, సర్పము , ఏనుగు వాటిస్థాయికి తగినట్లు ఈశ్వరుడిని కొలిచి ధన్యమయ్యాయి. అలాగే తిన్నడు అనే భక్తుడుకూడా తనకు తోచినట్లు శివుడిని సేవించి ధన్యత చెందేడు. అంచేత భక్తి మార్గానికి అన్ని జీవులూ అర్హులే. ఏవిధమైన యోగ్యతలూ అక్కరలేదని , భావమే ప్రధానమని విజ్ఞులు చెబుతారు. ఈ విధంగానే భక్తిని ఆచరించాలనే నిబంధన ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ భక్తి మార్గాన్నే అనుసరిస్తున్నారు. భక్తి దానంత అదే కలుగుతుంది లేదా పూర్వజన్మ సంస్కారం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది. అంతేగాకుండా భక్తుల సహచర్యము, జపమూ భక్తికి దోహదం చేస్తాయని పెద్దలు అంటారు. భక్తిని విడిచి ముక్తి లేదని , అంచేత ఎంతటి వారైనా భక్తి లేకుండా ఆధ్యాత్మిక సాధనలో పురోగమించ లేరని కూడ చెబుతారు.  ఉపనిషత్తులు ఏ వస్తువును అంతర్యామి అని చెప్పాయో అదే భక్తికి ధ్యేయం. ఈధ్యేయ సత్పదార్ధన్నిగురించి చేప్పేటపుడు అనేకమైన పేర్లు కల్పి౦చబడ్డాయి. సగుణాకారమైనపుడు ఆ విభూతులను ఈశ్వరుడనీ,శివుడనీ ,రాముడనీ ,కృష్ణుడనీ, కేశవుడనీ అనేక నామములతో పిలుస్తారు. అలాగే స్త్రీరూపంగా ఉపాసన చేసే శాక్తేయులు ఉన్నారు. వాస్తవానికి ఆత్మకు లింగభేదం లేదు. నిరాకారమైనపుడు బ్రహ్మమనీ , పరామత్మ అనీ చెబుతారు. సగుణ బ్రహ్మమూ నిర్గుణ బ్రహ్మమూ ఒక్కడే . అంతా అద్వితీయమైన బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మం అతి సూక్ష్మమవ్వడం చేత మనస్సు కందదు. కావున అలాంటి బ్రహ్మాన్ని ప్రేమించి ఉపాసి౦చలేము. అందుచేత భక్తుడు సాకారుడైన ఈశ్వరుణ్ణి ఉపాసిస్తాడు . బ్రహ్మాన్ని గురించిన ఎరుకలో మానవ మనస్సు ఊహించగల గొప్ప స్థాయినే ఈశ్వరుడని చెప్పవచ్చు. భక్తియోగము యొక్క ఆశయం బ్రహ్మానుభవమే. జపవిధానమంతా సగుణమే. సాధకుడి సంకల్పము , మనస్స్తత్వాన్నిబట్టీ ధ్యేయం ఉంటుంది . ధ్యేయాకారాలన్నీ మనోకల్పితాలే కాబట్టి వాటన్నిటి పట్ల సమదృష్టి కల్గి ఉండాలి. ప్రతిమ అంటే విగ్రహం. ప్రతీకోపాసన అంటే బ్రహ్మం కాని దాన్ని బ్రహ్మంగా భావించి భక్తితో దాన్లో మనస్సు లగ్నం చెయ్యడం. బ్రహ్మమే ఉపాసకుని లక్ష్యమై , ప్రతీకం కేవలం ప్రతిగా ఉండి సర్వవ్యాపకమైన బ్రహ్మం ప్రతీకమూలంగా ఉపాసించబడితే , అది అందరికీ ప్రాధమిక దశలో అవసరమే. ఒకవేళ అవతారాలనుగాని, గురువును గాని ధ్యేయంగా గ్రహిస్తే వారి ప్రారబ్ద దోషాన్ని పట్టించుకోకుండా వారు సాక్షాత్ భగవత్స్వరూపులనే భావంతో సాధన చెయ్యాలని చెబుతారు.

 2. #2
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  భక్తి మార్గం (2)

  భక్తి గురించి , ధ్యేయాకారాలను గురించి మొదటి భాగంలో చెప్పుకున్నాం. భక్తి జ్ఞానపూర్వకమైనది. ఈ జ్ఞానపూర్వకమైన భక్తిమార్గాన్ని వాసుదేవ భక్తిగా మొదట్లో భగవంతుడు సూర్యునికి , సూర్యుడు వైవస్వత మనువుకు, మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించగా ఇలా పారంపర్యంగా వచ్చే ఈ విద్యను రాజర్షులు తెలుసుకున్నారు. కాలక్రమంలో ఈ విద్య నశించింది. దీన్ని శ్రీకృష్ణావతారంలో గీతా రూపంలో తిరిగి ఉద్ధరించ బడింది అని చెబుతారు.


  భక్తుడికి శ్రద్ధ, ప్రేమ, భావబలమూ కావాలి. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవే. సాత్విక బుద్ది జ్ఞానాన్ని కల్గిస్తుంది. భగవంతునియందు శ్రద్ధాభక్తులుండి, బుద్ది శుద్ధంగా లేకపోతే అతడికి భగవంతుడు ఇలాంటి వాడు అనేది తెలియదు. అలాంటి వాళ్ళలో కొందరు సరైన అవగాహన లేక క్షుద్రదేవతలనో, యక్ష, రాక్షసులనో ఆరాధిస్తారు. అంచేత భక్తునికి కొంతైనా బ్రహ్మమును గురించిన జ్ఞానం ఉండాలి. దీనితో బాటు సత్వగుణం పెంపొందించు కోవాలి. భగవానుడు గీతలో నిత్యయోగియై ముఖ్యభక్తి కల్గిన జ్ఞాని అధికుడని చెప్పారు. దీన్నిబట్టి గీత జ్ఞానంతో కూడిన భక్తిమార్గాన్నే బోధించిందని చెప్పాలి. భక్తీ, జ్ఞానమూ భిన్న మార్గాలైనా వాటి గమ్యం ఒక్కటే. వీటిలో ఏఒకటి ఎక్కువని గాని , తక్కువని గాని చెప్పలేం.


  భక్తి పరాభక్తి , అపరాభక్తి లేక గౌణభక్తి అని ముఖ్యంగా రెండు విధములు. అపరాభక్తి నుంచి పరాభక్తికి పురోగమించడం జరుగుతుంది. ఈ అపరాభాక్తికీ పరాభాక్తికీ మధ్య ముఖ్యభక్తిని , ఏకాంత భక్తినీ కూడ కొందరు అంగీకరిస్తారు.
  పరాభక్తి ఇది భక్తియొక్క సిద్దావస్థ లేక చరమావస్థ అనవచ్చు. ఈ స్థితిలో మనస్సు పూర్తిగా నశించి ఆత్మానుభూతి కలుగుతుంది. అపుడిక సంకల్పాలు ఉండవు. సాధన కొనసాగిస్తుండగా అహంకార నాశనము, చిత్తశుద్ది కలిగి ఆత్మ ప్రకాశానికున్న అడ్డుగోడలన్నీతొలగి పోతాయి. ఈ అనుభూతి ఏకరూపము, అవిచ్చిన్నము అవడం వల్ల ఇంద్రియాలన్నీ తమ పనులు మాని ఈ అనుభూతిలో ఏకమై ఉంటాయి. ఇట్టి అనుభవం వర్ణించలేనిది. అంచేత అనిర్వచనీయం అనబడుతోంది. భక్తుడు ఈ స్థితిలో సమస్తంలోనూ భగవత్స్వరూపాన్నే దర్శిస్తాడు. సమస్తాన్నీ ప్రేమిస్తాడు. ఎపుడూ భక్తిరసంలోనే పొంగి పొర్లాడుతూంటాడు. ఈశ్వరేచ్చానుసారంగా కర్మలను చేస్తుంటాడు. పరాభక్తివల్ల ద్వైతభావంతో ఉండే భక్తుడు,తనలో ఉండే ఆత్మయే భగవంతుడని గ్రహిస్తాడు. ప్రారబ్ద కర్మ నశిస్తేనే అభేద స్థితి కలుగుతుంది. అపుడు దేశ, కాల, కారణ భేదం నశించి పరమ ప్రేమానుభవం పొందుతూ నిత్యమూ సంతోషంగా ఉంటాడు. ఇదే జీవబ్రహ్మైక్య స్థితి. ఇలా ఆత్మానుసంధానం చేసి బ్రహ్మైక్య స్థితిని పొందినపుడే అది పరాభక్తి అవుతుందని అంటారు. భగవంతుడు , భక్తుడు అనే భేదభావం పూర్తిగా నశిస్తుంది. ఇలాంటి పరాభక్తి ఈశ్వరానుగ్రహం వల్ల, పురుష ప్రయత్నం వల్ల లభిస్తుంది. దీన్నే ముక్తి లేక కైవల్యం అని అంటారు.


  ముఖ్యభక్తి ఇది భక్తి సాధనలన్నిటినీ దాటగా దాని పర్యవసానంగా లభిస్తుంది. దీన్లో భగవంతుడికీ భక్తునికీ మధ్యలో సూక్ష్మంగా భేదభావం నామమాత్రంగా ఉంటుంది. ఈ భేదాన్ని భక్తుడే బ్రహ్మానుభవం కోసం కల్పించుకుంటాడని అంటారు. ఇదికూడా అనిర్వచనీయమే అంటారు. అకారణమైన కరుణ , ప్రేమానుభూతి భక్తునిలో పొంగిపొర్లుతుంది. హృదయాంతరాళంలో మనం పొందే అనుభూతే సాక్షాత్కారమంటే.

  ఏకాంతభక్తి సాధన పురోగతి చెందుతుండగా చిత్తవృత్తులు అన్నీ స్తంభించినపుడు అది ఏకాంత భక్తి అని అంటారు. దీన్నే జ్ఞానం అంటారు. ఈ స్థితిలో భక్తునికీ , జ్ఞానికీ తేడా ఏమీ ఉండదు. ఎవరు కేవలం ప్రేమకోసం భగవంతుడిని ప్రేమిస్తారో వారే ఏకాంత భక్తులు. సత్వగుణ ప్రధానులై ఏ అపేక్షా లేకుండా ఆత్మయందే స్థితుడై ఉండేవారిని ఏకాంత భక్తులు అంటారని కొందరు చెబుతారు. భక్తులు ముక్తిని కూడ కోరరు.


  గౌణ భక్తి ఇది సాధనావస్థ మొదట్లో ఉండేది. సాధన తొలి దశలో ఒక విగ్రహాన్ని గాని లేదా ఒక ప్రతీకను గాని ఆలంబనం చేసుకొని , భక్తిని సలుపుతారు. వీరు స్తోత్రాలను, కీర్తనలను గానం చేస్తారు. నామసంకీర్తనం చెయ్యడం, భగవత్కధలను వినడం వినిపించడం, ఆయన లీలలను స్మరించుకోడం, ప్రార్ధన చెయ్యడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రియలనే భజించటం అంటారు. ఇవన్నీ ఉత్తమమైన పరాభాక్తికి సాధనలవ్వడం చేత దీన్ని అపరాభక్తి లేక గౌణభక్తి అని చెబుతారు.


  గౌణభక్తి అంటే గుణాలకు సంబంధించినది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మూడు గుణాలున్నాయి. వీటిని బట్టి , మనస్సు సత్వగుణ సంబంధమైనపుడు సాత్విక భక్తి కల్గి స్వార్ధమైన కోరికలు లేకుండా భగవంతుని ప్రీతి కొరకే ఆరాధిస్తాడు. సాధ్య సాధక జ్ఞానం పూర్తిగా ఉంటుంది. అలాగే మనస్సు రాజసిక యుక్తమైనపుడు, రాజసిక భక్తి కల్గి కేవలం స్వప్రయోజనం కోసం భక్తి కల్గి ఉంటాడు. వీరికి సాధ్య సాధక జ్ఞానం కొంతవరకే ఉంటుంది. అదేవిధంగా తామస ప్రవృత్తి కలిగినవారి భక్తి తామసికమై , మూఢాచారములు మూఢవిశ్వాసములు కలదై ఉంటుంది. వీరికి సాధ్య సాధక జ్ఞానం సంగ్రమగా ఉండదు.


  సంకల్పాన్ని బట్టి భక్తులు నాల్గు విధములు.

  (అ) ఆర్తుడు ప్రాణ రక్షణ కోసమో , బాధా నివారణం కోసమో , మాన భంగం కలుగకుండానో భగవంతునికి మొర పెట్టుకునేవాడు ఆర్తుడు. ఇలాంటి వాడు, రజస్తమో గుణములు అధికంగా ఉండటంవల్ల తనకు, తనవారికీ కలిగే కష్టాన్నే తీర్చమని కోరుతాడు. ఉదాహరణకు గజేంద్ర మొక్షంలో తనను కాపాడమని ఏనుగు, మానం కాపాడమని కురుసభలో ద్రౌపది కోరుతారు. కాని సత్వగుణాధిక్యత గలవాడు లోకాలకు కల్గిన కష్టాలని తీర్చమని ప్రార్ధిస్తాడు.


  (ఆ) జిజ్ఞాసువు భగవంతుడిని పొందాలనే లేక తెలిసికోవాలనే కోరిక కల్గి దానికోసమే తపిస్తూ , మిగిలినవాటిపై ఆపేక్ష లేనివాడు జిజ్ఞాసువు. ఇది సత్వగుణాధిక్యత వల్ల, సాత్విక శ్రద్ధ వల్ల కలుగుతుంది. ఇలాంటి వారికి తనతో బాటు ఇతరులు కూడ భగవంతుని తెలిసికొందురు గాక అనే అభిలాష కలవారై ఉంటారు. ఉదాహరణకు గోపికలు. ఈ జిజ్ఞాస తామస భక్తులకు ఉండదు. రాజసిక భక్తులకు కొద్దిగానే ఉంటుంది.


  (ఇ) అర్ధార్ది రజస్తమో గుణములతో కూడిన బుద్ది గలవాడవటం వల్ల స్వలాభం కోసం ధనాన్ని కోరుతాడు. అదే సాత్విక బుద్దిగలవాడైతే లోకులకోసం కోరుతాడు.


  (ఈ) జ్ఞాని ఆత్మజ్ఞానం గలవాడు.
  తామసిక భక్తికన్న రాజసిక భక్తి, దానికన్న సాత్విక భక్తీ ఉత్తమములు.


  భక్తిమార్గంలో సాధకుడు క్రింది స్థాయినుంచి తన ప్రయత్నంలో భగవంతుడిని చేరడానికి అనేక సోపానాలను అధిష్టించ వలసి ఉంటుంది. అపుడే నిజమైన భక్తికల్గి భగవంతుడిని ప్రేమిస్తాడు. భారతీయ తత్వవిచారణలో క్రింది స్థాయి నుండీ అన్నితరగతుల వారికీ వారి యోగ్యతను బట్టి భక్తి సాధనావిధానం ఉంది. ఇలా వారికి లభించిన సాధనామార్గంలో భక్తి ద్వారా ప్రయాణం చేస్తూ అది అభివృద్ది చెంది చివరికి ముక్తిని పొందుతారు.

 3. #3
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  భక్తి మార్గం (3)

  భక్తిభావాలు - శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం , ఆత్మార్పణం వాత్సల్యం, మధురభావం అనేవి . ఆఖరుకి శిశుపాలుడు శత్రుభావంతో ఉన్నప్పటికీ , శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని చూస్తూ మరణించడం వల్ల కైవల్యం లభించింది. అంటే ఆ పరాత్పరునితో ఎలాంటి సంబంధం ఉన్నా తరించగలరని విశదమవుతోంది. భక్తిభావం ఎన్ని విధాలు అనేది పక్కకు పెడితే అన్నీ; స్థూలంగా కాయికము, వాచికము, మానసికము అని మూడు రకాలకే చెందుతాయి. కాయిక భక్తి అంటే పారవశ్యంతో నృత్యం చేయటం , ఉత్సవాలు జరిపించటం , ఆలయాలు నిర్మించటం వంటివి. వాచిక భక్తి అంటే జపం,కీర్తనలు రచించి పాడటం, పురాణ పఠనం, స్తోత్రాల్ని పాడటం వంటివి. మనస్సు పని చేయకుండా పైరెండూ ఉండలేవు. అంటే మనస్సు ఈ మూడింట వర్తిస్తుంది. భక్తికి ఆత్మానందం ముఖ్యం. భగవద్వియోగాన్ని సహించ లేకుండటం, ఆత్మసమర్పణ భావాన్ని కలిగి ఉండటం వంటివి మానసిక భక్తి అంటారు.


  ప్రతీకను లేక ఒక విగ్రహాన్ని ఏదేవతాభావంతో పూజిస్తే , భక్తునికి వారి వారి యోగ్యతనుబట్టి ఫలం ఇచ్చేవాడు ఆ పరమాత్మయే. సర్వభూతాల్లోను అంతరాత్మను తెలియక , కేవలం విగ్రహారాధన చెయ్యడం వల్ల ప్రయోజనం లేదు. ఏదొక విగ్రహమూర్తినే మనసులో స్థిరంగా ఉంచుకోవాలి. కొంతకాలం విష్ణువును , మరికొంతకాలం మరో మూర్తిని
  ఇలా మార్చుకోవడం అంత మంచిదికాదు.

  మనసు కెపుడూ ఒక ఆధారం కావాలి. కాబట్టి దాన్ని మనన , స్మరణలలో వర్తింప జేస్తే దాన్లో ఉంటుంది. అవకాశం దొరికినపుడల్లా , శాస్త్రపఠనమో మంత్ర జపమో చేస్తుండాలి. మంత్రం అంటే అది ఒక అక్షరం గాని,ఒక పదం గాని , వాక్యం గాని , శ్లోకం గాని అవ్వవచ్చు . ఈ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం జపమవుతుంది. అంతరంగంలోనే జపం చెయ్యడం మంచిదంటారు. అలా చేసేటపుడు శబ్దం యొక్క అర్ధం మనస్సులో ఉంచుకోవాలి. అపుడే ఫలితముంటుంది. ఈ బాహ్యాచారాలన్నీ చిత్తశుద్ది కోసమే. ఏవిధంగా భక్తి సిద్ధించినా మనస్సు ఏకాగ్రమవ్వటం ముఖ్యం. భగవదనుగ్రహం సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటుంది . దానికోసం ప్రయత్నించిన వారికే అది దొరుకుతుంది.


  భక్తుడు భగవంతుడిని ప్రేమించగల్గే స్థితికి రావాలంటే అనేక సోపానాలను దాటాలని అనుకున్నాం. వాట్లోమొదటి మెట్టు శ్రవణం భగవత్కధలను వినడం. ఎప్పుడు ఎలాంటి అవతారాలను ధరించినదీ , వాట్లో ఎలాంటి లీలలను చూపించనదీ అనే విషయాలను తెలుసుకోడం వల్ల భగవంతుని యందు ప్రేమ కలుగుతుంది.
  కీర్తనం రెండవ మెట్టు శ్రవణ సంకీర్తనాలవల్ల చిత్తం పరిశుద్ధమై భగవల్లీలను, ఆయన కల్యాణ గుణాలను లోలోపల చింతించడం మొదలవుతుంది.
  స్మరణం- మూడవ మెట్టు.
  పాద సేవనం నాల్గవ మెట్టు.
  అర్చనం అయిదవ మెట్టు. దీన్లో పత్రాలతోను , పుష్పాలతోను ఇష్ట దైవాన్ని అర్చిస్తారు.
  వందనం ఆరవ మెట్టు. ప్రదక్షిణ చెయ్యడం , సాష్టాంగ నమస్కారం చెయ్యడం వంటివి.
  దాస్యం ఏడవమెట్టు. దేవాలయం శుభ్రం చెయ్యడం లాంటివి. ఇప్పటికి దాసుడను అనే భావం కలుగుతుంది.
  సఖ్య భక్తి ఇది ఎనిమదవ మెట్టు. దీన్లో భక్తుడు భగవంతునికి అంతరంగ మిత్రుడనని భావిస్తాడు.
  తొమ్మిదవ మెట్టు- ఆత్మ నివేదనం లేక ఆత్మార్పణం . దీన్లో తనను తానే భగవంతునికి అర్పించుకుంటాడు. ఇదే శరణాగతి . ఇదే ఆఖరి మెట్టుకూడా. శరణాగతిలో భక్తుడు నేను, నాది అనడానికి బదులు నీవు, నీది అని అహంకార మమకారాలను వదలుకొని దాసుడను అనే భావం పొందుతాడు. సర్వాత్మ సమర్పణ వల్ల దైవానుగ్రహం పొందటానికి అడ్డు తొలగిపోతుంది.


  మనస్సు భగవంతుడి వేపుకు మరలడానికి పూర్వవాసనలే కారణం. ఆర్తులైనా,అర్ధార్తులైనా,ముముక్షువులైనా భగవదనుగ్రహానికి పాత్రులు కావలసిందే. ఇంద్రియాలను విషయాలవేపు పోకుండా నిగ్రహించి వశం చేసుకోడమే సాధనలో ప్రధానాంశం. తర్వాత మనోనిగ్రహం , స్వార్ధరాహిత్యమూ అలవర్చు కోవాలి. అభ్యాస వైరాగ్యాలతో మనోనిగ్రహం కల్గుతుంది. కోర్కె మొదలవగానే దాన్ని వెంటనే త్రుంచెయ్యాలి. సాధన మొదటి దశలో మనస్సునాకర్షించి, ఉద్వేగాన్ని కలిగించే వాటిని తుచ్చమనే భావంతోవదిలేస్తూ రావాలి. ఈ త్యాగం స్వతస్సిద్ధంగా రావాలి. వస్తువులపట్ల ప్రీతిని మానసికంగా త్యజిస్తేనే సంగత్యాగమవుతుంది. అంతర త్యాగం కల్గితే బాహ్యత్యాగమూ కల్గుతుంది. మొత్తం మీద అహంకారం నశిస్తే గాని త్యాగం సంపూర్ణం కాదు. ఒక వస్తువు ఆకర్షణ , వస్తుజ్ఞానం అనేవి దాని స్పర్శ , దర్శన , శ్రవణాల వల్ల కల్గుతుంది. అంచేత అలాటి వాటకి దూరంగా ఉండాలి. మనస్సును ఏకాగ్రంచేసిజ్ఞానేంద్రియాలను,కర్మేంద్రియాలను భగవదార్పణ౦ చేసి ఫలాపేక్ష లేకుండా ఉండాలి

 4. #4
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  భక్తి మార్గం (4)

  భక్తియోగం పరాత్పరుడిని ప్రేమించమనే చెబుతుంది. ఫలాపేక్ష ఉన్నచోట నిజమైన ప్రేమ ఉండలేదు. సహజంగా ప్రేమించడమే ప్రేమకు ప్రధాన లక్షణం. భక్తి అభ్యాసం చేతనే లభిస్తుంది. భవ బంధాలనుండి విడివడటానికే మానవ జన్మ ఉద్దేశించబడింది. ప్రతి జీవిలోనూ భగవంతునిపట్ల కొంత భక్తిభావం స్వతః గా ఉంటుంది. నియమాలను పాటిస్తుండగా, భగవంతునితో మరికొంత అనుబంధమేర్పడి , క్రమంగా తను చేసే ఉపచారాలను సహజమైన ప్రేమతో చేస్తాడు. భగవత్ప్రేమపూర్వకంగా ఏది చేసినా, అది భజనే . అసలు భక్తి ,భజనా కలిసే ఉంటాయి. భజన బాహ్య వ్యవహారమైతే, భక్తి అంతరంగికం . సాధనలన్నీ మనశ్శుద్దికే . భగవంతుణ్ణి ప్రేమతో ఉపాసిస్తూ సమస్త కర్మలనూ భగవదర్పితం చేస్తే , ప్రారబ్ద మలిన వాసనలు బలహీనమై మనస్సు భగవంతుని అధీనమవడానికి దోహదమవుతుంది. భక్తిమార్గం లో త్యాగమంటే ఉన్నవాటిని భగవంతునివేపుకు మరల్చడమే భక్తుని పని. విషయాలవల్ల కలిగే ప్రీతి మిధ్యయేగాని సత్యము కాదనేభావ౦తో, ప్రాప్తించిన వాటిని మమకారం లేకుండా అనుభవించడమే విషయ త్యాగమంటే.


  మన మనస్సు యొక్క స్థితి మనం తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. సాత్వికాహారం వల్ల సత్త్వగుణాలు అభివృద్ది చెందుతాయి. అందుకని సాత్త్వికాహారం తీసికోవాలి. మంచి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనలను మార్చటానికి కావలసిన మనోబలం సత్త్వగుణం వల్ల కలుగుతుంది. సాధనలన్నీదీర్ఘకాలం, ప్రీతితో చెయ్యాలి . దైవానుగ్రహం భక్తివల్ల కలుగుతుంది . భక్తి భగవత్తత్వం బోధపడినపుడు కలుగుతుంది . భగవత్తత్వం సంశయాలు తొలగినపుడు బోధ పడుతుంది . ఆత్మ సమర్పణమంటే అహంకార మమకారాలను వదలి నీవే గతి అని భగవానుని శరణువేడి , ఆయన అనుగ్రహానికి ఎదురుచూడటం. కర్మలన్నీ జ్ఞానానికి సాధనాలుగా ప్రతిపాదించబడ్డాయి. ఆర్తులకు సహాయం చేసేటపుడు అది భగవత్కై౦కర్యమని , అలాంటి అవకాశమిచ్చిన ఆర్తులకు కృతజ్ఞతలు చెప్పాలి . ఇలా చేయటం వల్ల గర్వము , అభిమానము క్రమంగా పోతాయి. వైరాగ్యమంటే ఇంద్రియాలు ఐహిక సుఖాలచే ఆకర్షించ బడకుండుట౦ . అనగా ఆకర్షణల మధ్య జీవిస్తూ ,భవబంధాలతో కట్టుబడకుండట౦.


  సంతాపానికి,కోపానికి వశుడయ్యేవాడి హృదయంలో భగవత్సాక్షాత్కారం కల్గే అవకాశముండదు. భక్తునికి అన్య దేవతలపట్ల అగౌరవం లేకుండ , అన్ని ప్రాణులను దయతో తన బిడ్డలలా చూసేవారి హృదయం విశుద్ధమై, వారికి భగవదనుగ్రహ౦ త్వరలోనే లభిస్తుంది. భక్తుడు వృక్షానికన్నఎక్కువ సహనము, గడ్డి మొక్క కంటే ఎక్కువ అణకువ కల్గి ఉండాలి . అందరిని గౌరవిస్తూ , తను మాత్ర౦ ఎట్టి గౌరవమూ ఆశించ కూడదు. ప్రారంభ౦లో భక్తుడు, గురువు విధించే నియమాలను విధిగా పాటించాలి.


  ఒక వ్యక్తి శరీరక౦గా తన పనులు చేయలేకు౦టే,ఆ ధర్మాలను భావంతో నిర్వర్తించినా వాస్తవ౦గా నిర్వర్తించిన ఫలితాన్నే పొందుతాడు. అంటే భగవత్ కైంకర్యం ధ్యాన రూపంలో కూడ చెయ్యవచ్చును. ఐహిక జీవితం అంటే యాతనలని , కర్మ ఫలితాలనూ అనుభవించడమే కాబట్టి బద్ధ జీవుడెవరైనా , ఈ యాతనల కతీతుడు కాదు. వేద విహితమైన కర్మలను , జీవనోపాధికి అవసరమైన కర్మలనూ చేస్తుండాలి. భగవంతునిపై సహజంగా ఆకర్షణ కలిగే వరకే వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి . ఈ ధర్మాలు ఆర్ధికాభివృద్ది , ఇంద్రియతృప్తి ,మోక్షానికీ ఉపయోగపడే కర్మకాండలు. వైదిక విజ్ఞానం చివరకు దైవాన్ని అర్ధం చేసుకోడానికే.

  భగవంతుడు మనలో ఆత్మగా ఉంటాడనే విషయం మరచి నేను భగవంతునికన్న వేరు అనే భావంతో ఉంటాం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని సత్యం అనుభవం చెందటమే మన పరమావధి. భగవత్ప్రాప్తి స్వతస్సిద్ధమైనా ;అహంకారం , అజ్ఞానం అనే పొరలచేత కప్పబడి ఉండటం చేత, అనుభవం లోకి రావడం లేదు. దాని తత్వం తెలిసికోడమే దాన్ని పొందటం అని నారద మహర్షి అంటారు. భక్తికీ ఆత్మానందానికీ తేడా లేదు. భక్తి ప్రేమలో పుట్టి , ప్రేమలో వికసించి , ప్రేమలోనే లయిస్తుంది. ఇలాంటి భక్తి కలిగిన వ్యక్తి సమస్తాన్నీ ప్రేమిస్తూ నిత్య సంతుష్టుడై ఉంటాడు. కోరికలున్నంత వరకు ఇలాంటి ప్రేమ కలుగదు. ఇట్టి భక్తి లభిస్తే, సంశయాలన్నీతొలగి భవబంధాలన్నీపటాపంచలవుతాయి. అన్ని స్థితుగతులలోనూ భగవానుడిని మరువకుండా , సేవిస్తూ ఆ రూపానందాన్ని అనుభవిస్తుండటమే భక్తుని కోరికగా ఉంటుంది. మరి దేన్నీ ఆశి౦చడు. ప్రారబ్ద కర్మ పూర్తిగా నశించినపుడు అబేధస్థితి కల్గుతుంది . అపుడు దైవానుగ్రహ౦ వల్ల ముక్తి లభిస్తుంది. ఇలా జీవ బ్రహ్మముల బేధ భావముతో మొదలైన భక్తి, అద్వైత సిద్ధిని కలిగించి, జీవన్ముక్తిని / లేక మోక్షాన్ని కలుగచేస్తుంది .

 5. #5
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  భక్తి మార్గం (5)

  భక్తి యోగంలో మరికొన్ని విషయాలు.
  సంసార సాగరాన్ని దాటించడానికి పుణ్య క్షేత్రాలు , మహాత్ములు, సద్గుణాలు తోడ్పడతాయి. దాటించేదాన్ని తీర్థం అంటారు. ఒక్కొక్క ఋషియొక్క తపోమహిమ చేత తీర్థం అయింది. అంచేత తీర్థ యాత్రలలో తాత్కాలికంగా అయినా యాత్రికుడి హృదయాన్ని ఆ తపోవిశేషం ఆకర్షిస్తుంది. ఆ బీజం క్రమాభివృద్ధి చెందటమే తీర్థ యాత్రా ఫలం. ఈ ఫలం ఆ తీర్థం యొక్క మహాత్మ్యం తెలిసినపుడే కల్గుతుంది. దానికి తోడుగా విశ్వాసం ఉండాలి.


  ఆత్మ మరొక అత్మవల్ల ప్రేరణ పొందుతుంది. ఇలాంటి ప్రేరణ శక్తి ఎవరిలో నుంచి ప్రసరిస్తుందో అతడే గురువు. దాన్ని గ్రహించేవాడు శిష్యుడు అని పెద్దలు చెబుతారు. అంతరంగంలో జిజ్ఞాస ఉదయిస్తే , జ్ఞానప్రదాత ఐన గురువు కన్పిస్తాడు. గురువును కలసి నపుడు తత్వజ్యోతి తన మీద , కాంతి ప్రసరింప చెయ్యడం మొదలైనట్లు తన ఆత్మకు సహజంగానే తెలుస్తుందని అంటారు . వేద శాస్త్రవేత్త, పాపరహితుడు, కామగంధ దూరుడు , బ్రహ్మవేత్తలలో మేటి ఐన వాడే నిజమైన గురువు. సాధకుని కళ్ళు తెరిపించేవాడు గురువు.
  భక్తిలో బాహ్యశౌచం అంతగా పాటించడం సాధ్యం కాపోతే అంతరశౌచాన్నిఆచరించటం శ్రేయస్కరం.
  భక్తి వైరాగ్యం స్వాభావిక మైనది. దివ్యమైన జ్యోతిముందు చిరుదీపాలన్నీ ఎలా వెలవెలా పోతాయో, అలా భక్తి తేజం ముందు విషయసుఖాలు అణచి వేయబడతాయి. దీన్లో ఏ నిరోధమూ, ప్రయత్నమూ అవసరం లేదు. ఉన్నవాటిని భగవో న్ముఖం చెయ్యడమే భక్తుని పని .


  మనస్సు కాయిక,వాచిక, మానసిక భక్తుల మూడిట్లోను పనిచేస్తుంది. మనసు పనిచెయ్యకుండా మిగిలిన రెండూ ఉండలేవు. గోపికల క్రీడలన్నీ వారి మానసిక సంబంధమైనవే . శరీరంతో సంబంధాలు లేవు. యోగ ప్రభావంతో వారి మనస్సులు కర్మబందాలన్నిటినీ వీడి ఈశ్వరాధీనాలై, ఆయన ఆడించినట్లు ఆడాయి. ఇలాంటి ఆటలో గుణ దోషాలుండవు. దేహాభిమానం ఉన్నంతవరకే నాది, నీది అనే తేడాలు. అది నశిస్తే తానెవరు ? పరుడెవరు? అంతా ఒక్కటే కదా! గోపికలకు కృష్ణుడు తమ హృదయాల్లో ఉన్నాడు. సదా తన్మయత్వంలో ఉండేవారికి కాయిక వ్యాపారానికి అవకాశమే లేదు. అందునా గోపికలకు అలాంటి సుఖభావం బొత్తిగా లేదు. కృష్ణునికి సౌఖ్యం కూర్చడమే వారి స్వధర్మంగా భావించారు. పరాభక్తిలో అహంకార మమకారాలకు తావు లేదు. ఇది అత్మకున్న పరిపూర్ణత అనుభవంలోకి వచ్చే స్థితి.


  భక్తుడు ద్వందాతీతుడు. అంచేత సుఖ దుఖాలుండవు.
  సమర్పణ , ఆకర్షణల మధ్య ఉండే అడ్డంకులను తొలగించుకోడానికి చేసే ప్రయత్నమే సాధన అంటే.
  దేశ, కాల ,పాత్రలను బట్టి ఒక కాలంలో ఉండే ఆచారాలు మరొక కాలంలో అంగీకరించరు.
  పూజ, ధ్యానం, జపం, సంకీర్తనం , సేవ, దాన ధర్మాలు , తీర్థ యాత్రలూ ఒకటి మార్చి మరోటి చేస్తూండాలి.
  పరమార్ధం ఒక్కటే అయినా , దాన్ని వివిధ రూపాల్లో, వారి బుద్ధిశక్తిని బట్టి చూస్తుంటారు. ఈ పరమార్ధం విషయంలో ఎవరికి ఏది ప్రియమని నమ్ముతారో , వారిని అలాగే కొనసాగ నివ్వాలి. భక్తియోగం యొక్క ఆశయం బ్రహ్మానుభవమే.

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •