దైవం గురించి ఆలోచించడం అవసరమా! అని మనలో ప్రశ్నించుకుంటే , కొన్ని విషయాలు అర్ధమవ్వడం మొదలవుతాయి. కాని ఈప్రశ్న ఎపుడు మొదలవుతుంది?జీవితంలో మనం అనుకునేవన్నీ జరుగవు
కదా ! ఏ కొద్దిమందికో జరుగుతున్నట్లు అనిపిస్తుందే గాని,వారూ జీవితంలో ఎదురీదవలసినదే. అయితే మనం అనుకున్నవన్నీ ఎందుకు జరగటం లేదు? ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నట్లుగా గాక మరోలా,ఎందుకు జరుగుతోంది - ఇలా ఆలోచనా సరళి సాగుతుంటుంది. ఇలాంటి అంతర్మధనం వల్ల మనం కొన్ని భిన్నమైన నిర్ణయాలకు వస్తాం.

కొందరు ఇలా జరగటానికి, మన సంకల్పమే గాకుండా, ఎన్నో ఇతర విషయాలు కూడా; జరిగే సంఘటనలను ప్రభావితం చేస్తాయని నమ్మి సరిపెట్టుకుంటారు. కొందరు తమకనుగుణంగా ఏదీ జరగడం లేదనిదుఖపడుతుంటారు. ఇంకా కొందరు ఆలోచనాపరులు ; తన విషయంలోనే గాకుండా అందరి విషయంలోనూ అలాగే జరుగుతుండటాన్ని గ్రహించి, దానికి కారణాలను ఊహించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని సంఘటనలను తరచి చూసినపుడు, అవి తమ ప్రమేయమేమీ లేకుండానే జరిగిపోయినట్లు గ్రహిస్తారు.
మన జీవన గమనంలో కష్టసుఖాలను అనుభవించి; బాధ్యతలు తీరిన తర్వాత, ఏ కొద్ది మందో గతాన్ని తిరిగి చూసుకుంటారు. అనేక సందర్భాలలో ఏదో అదృశ్య శక్తి తమను జీవితంలో నడిపించినట్లుగా తెలుస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, జరిగే సంఘటనలనూ జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్ని సంఘటనలూ నిర్ణీతంగా ఏవిధమైన లోపమూ లేకుండా లోకవ్యవహారం జరుగుతున్నట్లు చూస్తాం. ఇలా జరగడానికి కారణమైన ఒక సూత్రధారి ఉన్నట్లుగా భావిస్తాం. ఆ సూత్రధారినే దైవమని, పరమాత్మ అనీ, బ్రహ్మమని చెబుతాం.

గడచిన జీవితం వేపు చూసుకున్నపుడే గాకుండా ; ఇతర కారణాల వల్లా మన దృష్టి భగవంతుని వేపు మళ్లడం గమనిస్తాం. అలాంటి వారిని గురించి చూద్దాం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చినపుడు తమ వంతు ప్రయత్నమంతా చేసి, ఇక నావల్ల కాదని; ఏది జరిగినా దాన్ని స్వీకరిస్తానని ఉదాసీనులై భగవదనుగ్రహం కోసం వేచి ఉండేవాళ్ళు ఉంటారు. వాస్తవానికి ప్రపంచంలో ఎన్నో దుఃఖ కారణాలు ఉన్నాయి. కొందరికి ఈ దుఃఖానుభవం సూక్షంగా ఉంటే, మరికొందరికి తీవ్రంగా ఉండటం మనం చూస్తాం.
తీవ్ర దుఖానికి దారి తీసే సంఘటనలకు ఉదాహరణగా - తను అమితంగా ప్రేమించే కుటుంబ సభ్యులను పోగొట్టు కోవడం వల్లనో, లేదా అకస్మాత్తుగా ఉద్యోగ వ్యాపారాల నుంచి తొలగి పోవటమో చెప్పవచ్చు. ఇవే గాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు మొదలైన వాటికి; ఎంత ప్రయత్నించినా నివారణోపాయం లేపోవడం వంటి సంఘటనలూ, తీవ్ర దుఃఖానికి దారి తీస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో తమ జీవితంలో అన్నీ పుష్కలంగా లభించి వాటిని అనుభవిస్తున్నా ; ఏదో తెలియని వెలితిని అనుభవిస్తుంటారు. ఇది వారిలో అంతర్గతంగా సూక్ష్మరూపంలో ఉన్న దుఃఖంగా భావించ వచ్చు. ఇది ఆధ్యాత్మిక దుఃఖంగా పరిగణిస్తారు. ఇంకా కొందరిలో పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడిని తెలిసికోవాలనే వాంఛ ఉంటుంది.


మన స్వానుభవాన్ని నిశింతంగా పరిశీలిస్తే , సుఖాలలో ఉండేటపుడు అసలు ఆసుఖానుభవాన్ని దాటి ఆలోచనే రాదు. సుఖానుభవం త్వరగా మరచి పోయేది. ఎందుకంటే ఒక సుఖానుభవం తర్వాత మరొకదాని కోసం తపిస్తాం. కాని దుఖానుభవం మనలో చెరగని ముద్రను వేస్తుంది. అంచేత దాన్ని మరచిపోలేక ఎన్నో సార్లు గుర్తుచేసుకొని బాధ పడుతుంటాం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అసలు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటాం. అసలు నేను ఏమంత పెద్ద తప్పు చేశానని భగవంతుడు నాకు ఇంత కష్టాన్ని ఇచ్చాడు అని వాపోతుంటాం కూడా. అట్టి సమయంలోనే కొందరు విచక్షణా జ్ఞానంతో ఆలోచిస్తారు. అపుడు వాళ్లకి భగవంతుడనేవాడు ఒకడున్నాడనీ , సర్వాన్నీ నడిపించే అతడిని తెలుసుకుంటే దుఃఖోపశమనం కల్గుతుందనీ , మనమంతా నిమిత్త మాత్రులమని తెలుసుకుంటాడు.