Online Puja Services

Namastestu Mahamaye
Shree pithe sura poojite
Shanka Chakra Gadha haste
Maha Lakshmi Namoostute

శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజా విధానం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. 
ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును. (శ్రావణ మాసం లో ఏ శుక్రవారమైనా ఈ పూజ చేసుకొనవచ్చును. కానీ రెండవ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ)

వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్,మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు.

ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

ప్రార్థన:-

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం:-

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ:-

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం :-

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి :-

పసుపు, కుంకుమ, తమల పాకులు, 
వక్కలు, అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, 
హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, 
కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, 
దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, 
గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, 
అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, 
అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, 
బియ్యముతో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, 
అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితీ ఉంటే) పానకము (ఆనవాయితీ ఉంటే), 
పత్తిని పావలా కాసుగా చేసి కుంకుమతో అద్ధినవి రెండు వస్త్రాలు, 
పత్తి తో  రుద్రాక్షమాలగా చేసి పసుపు/కుంకుమ లతో అద్ధిన యజ్ఞ ఉపవీతము, 
అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పళ్లేము, 
కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, 
నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే పత్తి వస్త్రాలు అక్కరలేదు, 
మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, 
పన్నీరు లేక గంధము కలిపిన నీరు, 
నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అద్ధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు  ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

తోరం తయారు చేసుకోవడం:-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజా ప్రారంభం:-

ముందుగా గణపతి ప్రార్ధన 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. 

యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః -
ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః -
దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … .....

సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… 
ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. 
(కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! 
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

ఉద్వాసన:

పసుపు గణపతిని ఆసీన పరిచిన తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యధాస్థానంలో పెట్టాలి. 

శ్రీ మహా గణాధిపతయే నమః గణపతిం ఉద్వాసయామి 
శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశయామి 
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ (అక్షతలు వేసి నమస్కరించాలి )

ఇక్కడితో మహాగణపతి పూజ అంటే పసుపు వినాయకుని పూజ పూర్తవుతుంది.

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

సౌభాగ్యాలనొసగే వరలక్ష్మీవ్రతం.. 

ఆచమనం:

కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..

శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!

(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)

సంకల్పం 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య 
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభాభ్యాం, శుభే శోభనే ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ   ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే, 
శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రధమ పాదే, 
జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, 
శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావరియో మధ్య ప్రదేశే,  స్వగృహే/శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ 
హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన 
శుభ సంవత్సరే, దక్షిణాయనే వర్షరుతౌ శ్రావణ మాసే, శుక్ల పక్షే, శుభతిధౌ 
భృగువాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం 
శుభ తిధౌ, శ్రీమతః (మీ పేరు, మీ గోత్రం చెప్పుకోండి) అస్మాకం సహకుటుంబాణాం క్షేమ, స్థైర్య,
విజయ, ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ్య, మోక్ష చతుర్విధ 
పురుషార్థ ఫల సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్ధ సిద్ధ్యర్ధం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావ్యాప్త్యర్ధం 
వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా  ప్రీత్యర్ధం భవిష్యోత్తర పురాణ కల్పోక్త 
ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. 
తదంగ త్వేన కలశ పూజాం కరిష్యే. కలశే గంధ పుష్ప అక్షతై రభ్యర్చ్య కలశశ్యోపరి 
హస్తం నిధాయ. 

కుంకుమ, గంధం, బొట్టు, కలశానికి పెట్టి, కలశం మీద చేయి ఉంచండి. 

అంభి కలశపూజ:-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు శ్రీ వరలక్ష్మీ  పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!
(అని ప్రార్ధించి దేవునిపై పుష్పము నుంచవలెను)


అథ ధ్యానమ్:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!


ఆవాహనం:
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!


ఆసనమ్:
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.


పాద్యమ్:
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!


అర్ఘ్యమ్:
శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!


ఆచమనీయం:
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!
గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి


పంచామృత స్నానం:
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి


శుద్ధోదక స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి


వస్త్రం:
సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి


యజ్ఞోపవీతం:
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి


గంధం:
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి


అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి


ఆభరణం:
కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి


పుష్పం:
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి


అధాంగపూజ: -
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి,
చపలాయై నమః – జానునీ పూజయామి,
పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి,
కమలవాసిన్యైనమః – కటిం పూజయామి,
పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,
మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి,
కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,
సుముఖాయైనమః – ముఖంపూజయామి,
సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి,
రమాయైనమః – కర్ణౌ పూజయామి,
కమలాయైనమః – శిరః పూజయామి,
శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:-

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓం బుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి

అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి

(దీపము చూపవలెను)

నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి

మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి ముందు పెట్టి నివేదన చేయాలి. 

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … .....

సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… 
ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా నైవేద్యం  సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
 

నివేదనము చేసి నీటిని వదలవలెను.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి

తాంబూలం సమర్పించవలెను. 

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి

అమ్మవారికి కర్పూర హారతి చూపించవలెను 

నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి

పుష్పము అక్షతలు ఉంచవలెను

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి

(ఆత్మ ప్రదక్షిణం చేయాలి)

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!
నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి

తోరపూజ:-

తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః -ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః -ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః -తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః -చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః -పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః -షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః -సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః -అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః -నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

శ్రీ మహాలక్ష్మి అష్టకం:-

నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే||4||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తు తే|5||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్

వ్రత కథా ప్రారంభం:-

పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.

అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. 

కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది.

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది. 

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. 

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. 

మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. 

ఇతి పూజామ్ సంపూర్ణం....

ఓం శ్రీ మాత్రే నమః 

Videos View All

అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట
సర్వదేవకృత శ్రీ లక్ష్మి స్తోత్రం
అష్ట లక్ష్మీ స్తోత్రం
సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మి ధ్యాన స్తోత్రం | Sri Mahalakshmi Dhyana Stotram

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore