Online Puja Services

Om Tryambhakam Yajamahe

 Sugandhim Pushtivardhanam |

Urvarukamiva Bandhanan

 Mrityor Mukshiya Maamritat ||

నాయనార్ల గాథలు - ఇయర్పగై నాయనారు . 
లక్ష్మీ రమణ 

 శివతత్వం ప్రేమ . ఆ స్వామిని భక్తితో పిలిస్తే చాలు , తలిస్తే చాలు పిలిచినవాడు ఎవరని ఆలోచించడు.  పరమాత్మ, పరమ అనుగ్రహంతో ఆదుకునేందుకు ఆ క్షణమే పరుగెత్తుకు వస్తాడు.  అందుకే రావణాసురుని వంటి  రాక్షసులు పిలిచినా, అనుగ్రహించాడు.  అదే సమయంలో రాముని ఆశీర్వదించి తానే  ఆయనకి  అనుచరుడై హనుమయ్యగా దిగి వచ్చాడు.  ఇటువంటి న్యాయం ఈశ్వరుడు తప్ప మరెవరు చేయగలరు. ఇరువైపులా తానే  ఉన్నా, ధర్మాన్ని దగ్గరుండి గెలిపించిన   ధర్మప్రియుడు, ధర్మమార్గ తత్పరుడు , ధర్మరక్షకుడు ఆ పరమేశ్వరుడు. ధర్మమార్గంలో  ఆ పరాత్పరుని చేరుకున్న మహనీయులలో ఇయర్పగై నాయనారు ఒకరు.   

శివభక్తుల ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది . అనంతమైన ఐశ్వర్య ప్రదాయకుడు, శుభకరుడు పరమశివుడు. ఆ శివుని నిస్సంశయ భావంతో నిరతమూ అర్చించిన భక్తుడు ఇయర్పగై నాయనారు.   ఇయర్పగై అంటే, ప్రకృతి విరుద్ధమైన అని అర్థం. కానీ ఆయన మాత్రం ఎంతో ధర్మనిరతుడు . శివపూజని నిరంతమూ విడువకుండా చేసేటటువంటివాడు. శివపూజానిరతులైన వారెవరు కనిపించినా ఆదరంగా ఇంటికి పిలిచి ఆతిధ్యమిచ్చేవాడు.   శివానుగ్రహం వలన వైశ్యుడైన ఇయర్పగైకి సంపదకి లోటులేదు .  తనకున్న దాంట్లో అతిధులకు వారు కోరిన దాన్ని దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందేవాడు .  ఆ ఆశీర్వాదాలే తనకి నిజమైన సంపదలని , మిగిలిన సంపదలు ఆ శివునికి చెందినవేనని ఆయన నిత్యమూ తన వద్దకి వచ్చేవారితో చెబుతూ ఉండేవాడు . 

శివార్పణ భావంతో ఆయన చేసే ఈ ధర్మకార్యాలకి సంతృప్తిని పొందిన పరమేశ్వరుడు ఒకనాడు, ఇయర్పగై భక్తిని పరీక్షించాలని తలచాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి తానే  యాచకుడై ఇయర్పగై ఇంటికి వచ్చాడు .  విభూదితో త్రిపుండ్రాలు దిద్దుకొని, నిలువెల్లా రుద్రాక్షలు ధరించి, దివ్యతేజో విరాజితుడై ఉన్న  ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే, ఎంతో భక్తితో లోపలికి ఆహ్వానించి ఆదరించాడు ఇయర్పగై. చక్కని పిండివంటలు స్వయంగా వండి వడ్డించింది ఇయర్పగై భార్య . 

ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి చక్కగా తాంబూలం కూడా సేవించి, విశ్రాంతిగా కూర్చున్నాక, ఇయర్పగై ఆయనకి విసినకర్రతో వీస్తూ సేదతీరుస్తూ “ స్వామీ! ఆ ఈశ్వరుని  దయవలన నాకు ఐశ్వర్యానికి లోటు లేదు. నాకున్న దానిలో మీరు కోరినదైనా సరే, మీకు సమర్పించగలను.  నా యందు దయవుంచి మీకు ఏం కావాలో చెప్పండి” అని అడిగాడు.  అప్పుడా విప్రుడు “ ఓ ఇయర్పగై! నీ గురించి నేను ఇప్పటికే విని ఉన్నాను. అందుకే నీ ఇంటికి వచ్చాను. కానీ నాకు కావలసింది ఏదైనా ఇస్తానంటున్నావు . నేను అడిగాక, కాదంటావేమో అని అనుమానంగా ఉంది “ అని ఒకింత సందేహంగా తన అనుమానాన్ని బయట పెట్టాడు .

అప్పుడు, ఇయర్పగై “ లేదు స్వామీ ! మీరు కోరేది నా దగ్గరుంటే, అది ఎంతటి విలువైనదైనా క్షణం కూడా ఆలోచించకుండా అది మీకు అప్పజెబుతాను.  సందేహించకుండా మీకు కావలసినదానిని అడగండి” అని జవాబిచ్చాడు.   

ఆ బ్రాహ్మడు మెల్లగా గొంతు సవరించుకొని “ ఇయర్పగై ! నీ భార్యను నాకీయగలవా ?” అని అడిగాడు.  ఇయర్పగై ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు . అందులోని ఉచితానుచితాలు బేరీజు వేయలేదు.  అవునూ కాదని తర్కించనూ లేదు .  తన దగ్గర ఉన్నదే ఆ బ్రాహ్మణుడు అడిగాడు . అంతే  అదొక్కటే ఆలోచించాడు.  “సరే స్వామీ! ఇచ్చేశాను.  మీ వెంట తీసుకువెళ్ళండి .” అన్నాడు. ఆమె కూడా ఇయర్పగైకు తగిన ఇల్లాలు . “ స్వామీ! నా భర్త మాటే నాకు వేదం . నేను మీ వెంట వస్తాను . కానీ, నా బంధువులు ధర్మం తప్పానని భావించి మనల్ని వెంబడించవచ్చు.  చంపేయవచ్చు కూడా ! కాబట్టి గ్రామం దాటే దాకా నా భర్తని రక్షణగా మన వెంట రమ్మనండి” అని కోరింది . సరేనన్నాడు ఇయర్పగై . 

ఆ విధంగా వాళ్ళు ముగ్గురూ ఇయర్పగై ఇంటి నుండీ బయల్దేరారు.  ఇయర్పగై  పెద్ద కత్తిని పట్టుకొని బ్రాహ్మణుణ్ణి , తన భార్యనీ కాపాడుతూ వారి వెంటే వెళుతున్నాడు . మెల్లగా ఈ విషయం ఆ ఊరిలో వైశ్య పెద్దలందరికీ తెలిసింది.  నీతి తప్పిన ఇయర్పగై జంటని , కోరరాని కోరిక కోరిన ఆ బ్రాహ్మణుణ్ణి ఊరు దాటకముందే అంతం చేయాలని వారందరూ మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు . కానీ వీరుడైన ఇయర్పగై  వారందరినీ ఇసుమంతైనా సంకోచం లేకుండా సంహరించాడు . 

ఆవిధంగా వాళ్ళు ముగ్గురూ ఊరికి పొలిమేరకి చేరుకున్నారు . మరో నాలుగడుగులు వేస్తే తిరుచ్చైకాడు కోవెల. అక్కడ దాకా వచ్చాక ఆ బ్రాహ్మణుడు , “ఇక నువ్వు వెనక్కి వెళ్ళవచ్చు” ఇయర్పగై  అన్నాడు. అక్కడైనా, భార్య అనే బంధం, మొహం అనే లాలస అతన్ని అడ్డుకుంటాయేమో ననే పరీక్ష కాబోలు . కానీ, ఇయర్పగై అప్పటికే వాటన్నిటినీ అధిగమించాడు . వెంటనే వెను తిరిగి ఇంటికి బయల్దేరాడు . రెండు అడుగులు అలా ఇంటి వైపు వేయగానే, వెనుక నుండీ ఆ బ్రాహ్మణుడు గట్టిగా పిలిచినట్టు వినిపించింది .

వెనుతిరిగి చూసిన ఇయర్పగై కి అక్కడ కేవలం తన భార్య మాత్రమే చేతులు జోడించి నిలబడి కనిపించింది . ఆకాశంలో దివ్య జ్యోతిర్మయ కాంతితో ప్రకాశిస్తూ, శివపార్వతులు దర్శనమిచ్చారు.  “ఇయర్పగై  నీ  నిస్సందేహమైన భక్తికి , ధర్మ నిరతికి ఎంతో సంతోషించాను. మీరిద్దరూ కూడా మాతో కలిసి కైలాసంలో నివసించండి .” అని ఆహ్వానించారు.  అప్పటికప్పుడే ఒక దివ్య విమానం కైలాసం నుండీ దిగివచ్చి, వారిని తీసుకొని వెళ్ళింది. ఇయర్పగై  సంహరించిన అతని బంధువులందరూ కూడా, ఇయర్పగై మూలంగా స్వయంగా ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం చేత  వారందరూ కూడా కైలాసాన్ని చేరుకున్నారు . 

ఆ విధంగా ఇయర్పగై  నాయనారు తాను నమ్మిన ధర్మాన్ని నిస్సందేహంగా , పరిపూర్ణమైన ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించడం వలన తనతో పాటు మరెందరికో జన్మజన్మల చక్ర భ్రమణం నుండీ ముక్తిని ప్రసాదించ గలిగాడు. ఈ దివ్య దృశ్యాన్ని భావనతో దర్శిస్తూ,  ఆ ఈశ్వరుణ్ణి మనసారా స్మరిస్తూ .. శలవు . 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు .

 

Nayanar, stories, Iyarpagai, 

Videos View All

అర్ధ నారీశ్వర అష్టకం
శ్రీ శరభేశాష్టకమ్
చంద్రశేఖరాష్టకం
శ్రీ కాలభైరవాష్టకం
లింగాష్టకం | Lingastakam
విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే,

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore