Online Puja Services

కేశవనామాల్లో 24 నామాలే ఉంటాయెందుకు ?

3.145.178.240

కేశవనామాల్లో 24 నామాలే ఉంటాయెందుకు ?
- లక్ష్మీరమణ 

ప్రతిరోజూ చేసే పూజలో గణపతి లేదా విష్వక్షేనారాధనకి ప్రధమ ప్రాధాన్యత ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా ఆచమనానికి , కేశవ నామాలకీ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆచమనం చేయకుండా, కేశవనామాలు చెప్పుకోకుండా సాధారణంగా ఏ పూజలూ నిర్వహించరు. ఆ నామాలు మొత్తం 24 ఉంటాయి.  సాధారణంగా అష్టోత్తరం , సహస్రనామం అని 108, 1000 నామాలతో ఉండే పూజకి భిన్నంగా  24 నామాల పూజ ఖచ్చితంగా చేయడానికి కారణం ఏమిటి ? పైగా విష్ణుమూర్తి ధరించినవి దశావతారాలు. అవి కాకుండా ఈ 24 నామాల్లో ఉన్న 24 రూపాలు ఏమిటి ? 

హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఉంటాయి . విష్ణుమూర్తి స్థితికారకుడు . రక్షకుడు. రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలని, సంవత్సరంలో నెలకి రెండుసార్లు   (12X 2= 24) తన నాలుగు చేతుల్లో ఉన్న ఆయుధాల్ని చేతులు మార్చుకుంటూ రక్షణ చేస్తూ ఉంటారేమో మరి. ఆ విధమైన దర్శనమే మనకి ఈ కేశవనామాల్లో ఉన్న మాధవ దర్శనం అనుగ్రహిస్తుంది . 

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటారు. ఆయన తన నాలుగు చేతులలో శంఖు, చక్ర, గదా, పద్మాలు పట్టుకుని ఉంటారు కదా బాగా గమనిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలో వచ్చే మార్పులు శ్రీహరి ఇరవై నాలుగు వేరు వేరు రూపాలుగా  దర్శనం చేయవచ్చు . ఆ రూపాలకు కలిగిన పేర్లే కేశవనామాలు కావొచ్చు . 

ఉదాహరణకి ,కేశవ నామాలలో మొదటి నామం కేశవ.

ఈ కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము పట్టుకుని ఉంటాడు.  ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు.
 
అలాగే విష్ణువు యొక్క మరొక నామము మాధవ. ఈ మాధవ రూపంలో కుడి వైపు రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు. ఎడమవైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము పట్టుకుని ఉంటాడు.

మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో చక్రం, శంఖము మరియు ఎడమవైపు చేతులతో గద, పద్మము పట్టుకుని ఉంటాడు. 

ఈ విధంగా ఒకే పరమాత్ముడు అయినా విష్ణువుని మన మహర్షులు 24 రూపాల్లో దర్శించారు . వీటినే గణిత శాస్త్ర పరంగా ప్రస్తారాలు అంటారని పండితులు చెబుతున్నారు.
 
ఈ నామాలని పలకడం, ఆచమనం చేయడం ద్వారా మన స్వరపేటికకి అవసరమైన సున్నితమైన వ్యాయామం పూర్తవుతుంది . శరీరానికి శుద్ధితో పాటు, ఒక నూతనమైన ఉత్తేజం కూడా కలుగుతుంది .  అంతటి అద్భుతమైన పురుషోత్తముని కీర్తించే నామాలని ఒక్కసారి ఇక్కడ పరికించండి .  
 

కేశవ రూపాలు :

కేశవ,
నారాయణ,
మాధవ,
గోవింద,
విష్ణు,
మధుసూధన,
త్రివిక్రమ,
వామన,
శ్రీధర,
హృషీకేశ,
పద్మనాభ,
దామోదర,
సంకర్షణ,
వాసుదేవ,
అనిరుధ్ధ,
ప్రద్యుమ్న,
పురుషోత్తమ,
అధోక్షజ,
నారసింహ,
అచ్యుత,
జనార్ధన,
ఉపేంద్ర,
హరి,
 శ్రీకృష్ణ.
 

ఇదీ కేశవనామాల విశిష్టత . మన పెద్దలు దర్శించినట్టే , మనం కూడా ఆ కేశవుణ్ణి ఈ 24 రూపాల్లోనూ తలచుకొని, దర్శనం చేసి తరిద్దాం . 

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోన్నమః . 

శుభం . 

#kesava #vishnu #narayana

Tags: Kesava, narayana, vishnu, madhusudana, mantra, mantram, namam, incarnations, avatar, 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya