Online Puja Services

కేశవ దర్శనం చేసినా, ఆ అమ్మవారి దర్శనం చేసినట్టే !

18.222.193.207

దసరా వేళ కేశవ దర్శనం చేసినా సాక్షాత్తూ  , ఆ అమ్మవారి దర్శనం చేసినట్టే !

దసరాని తెలుగువారు చాలా గొప్పగా జరుపుకుంటారు .  పసుపు , కుంకుమలతో , పచ్చని మామిడి తోరణాలతో , విరిసిన పూల సుగంధాలతో నిండిన లోగిళ్ళు అమ్మలగన్న అమ్మకి  స్వాగతాలు పలుకుతుంటాయి . దేవీ ఆలయాలు నవరాత్రి శోభతో వెలిగిపోతూ, మహిషాసురవధ వృత్తాంతాన్ని  వివరిస్తుంటే, మరోవైపు ప్రఖ్యాత కేశవ క్షేత్రాలు బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలతో సందడిగా ఉంటాయి . రావణాసురుణ్ణి వధించి రాములవారు సాధించిన విజయోత్సవ హేలను అంబరమంటే సంబరంతో నిర్వహిస్తాయి.  

అమ్మవారు స్వయంగా నవ దుర్గలుగా మారి మహిషాసురుణ్ణి వధిస్తే , ఆ అమ్మని పూజించి అనుగ్రహాన్ని పొంది , అదే రోజు రావణుణ్ణి వధించి విజయాన్ని పొందాడు శ్రీరామునిగా ఉన్న అయ్యవారు . అందుకే అటు శక్తి ఆలయాలు , ఇటు వైష్ణవాలయాలు దసరా రోజుల్లో నవఆధ్యాత్మిక  శోభలతో అలరారుతుంటాయి . 

తిరుమల :
ఎంతచూసినా తనివి తీరని రూపం తిరుమలరాయుని సొంతం. ఆ మాటకొస్తే , ఆ నల్లనయ్య ఏ అవతారమెత్తినా , ఆ రూపం భువనైకమోహనమే నంటే అతిశయోక్తికాదు . ఇక బ్రహ్మోత్సవ వేళ నవరాత్రులూ ప్రత్యేక అలంకారాలతో ఆ మోహనరూపం ఊరేగవస్తే, ఆ వల్లభరాయని దర్శనం కోసం తపించని మనసుంటుందా. 'నానాదిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అని అన్నమాచార్యులు అన్నట్టు వేంకటపతి బ్రహ్మోత్సవాలు తీర్థ ప్రజలతో మహా వైభవంగా సాగుతాయి. రోజుకో వాహనాన్ని అధిరోహించి తిరుమాడవీధులలో ఊరేగుతూ తిరుమలేశుడు భక్తులను అనుగ్రహిస్తారు . బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి శ్రీ చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. 

భద్రాచలం:
భద్రాచలంలో ఓవైపు రాములోరి బ్రహ్మోత్సవాలు , సీతమ్మతల్లి కి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కన్నులపండుగగా సాగుతాయి. సీతారాముల కల్యాణంలో రాములోరి సరసన చేరి సిగ్గుల మొగ్గగా కనిపించే సీతమ్మ తల్లి, శక్తి స్వరూపిగా నవాలంకారాలతో నవ్యశోభలతో దర్శనమిస్తుంది . ఇక రావణవధ చేసిన విజయ దరహాసం పెదవులపై మెరుస్తుండగా, కోదండాన్ని ధరించిన రాములోరు,సీతా ,లక్ష్మణ సమేతుడై  బ్రహ్మోత్సవాలు జరిపించుకుంటారు .  

అపరాజితాదేవి :
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు అజ్ఞాతవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై ఉంచిన తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. దీంతో దసారాఉత్సవాల్లో  రావణ వధ, జమ్మి చెట్టు పూజా చేయటం రివాజు.

శమీ శమయతే పాపం శమీశతృ వినాశనం  | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినః  ||

అని శమీ వృక్షరూపంలో ఉన్న అపరాజితాదేవిని ప్రార్ధించి శ్రీరాముడు, అర్జనుడు విజయదశమినాడు విజయాన్ని పొందారుకాబట్టి, ఆరోజు శమీ పూజలు చేస్తే అపరాజితాదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శృతివాక్యం. అందుకే ఈ శ్లోకం చెప్పుకొని, విజయదశమినాడు దేవాలయాల్లో శమీపూజలు నిర్వహిస్తుంటారు. 

క్షీరసాగర మధనం తర్వాత మోహినిగా మారిని విష్ణుమూర్తిని చూసి వలచి , వలపించి అయ్యప్పని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు . అందుకే,కేశవుడంటే సాక్షాతూ శక్తి స్వరూపమే మరి . కాబట్టి  , దసరా వేళ కేశవ దర్శనం చేసినా సాక్షాత్తూ  , ఆ అమ్మవారి దర్శనం చేసినట్టే !

- లక్ష్మి రమణ 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya