Online Puja Services

అనంత ఐశ్వర్య సిద్ధి కోసం అనంత పద్మనాభ స్వామి వ్రతం

3.139.81.58

అనంత ఐశ్వర్య సిద్ధి కోసం అనంత పద్మనాభ స్వామి వ్రతం . 

కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారిని గురించి తెలియనివారుండరు .  ఆయన ఎంతటి శ్రీమంతుడో , తన భక్తులని కూడా అంతటి శ్రీమంతులుగా ఆశీర్వదించే మార్గాన్ని కృష్ణావతారంలో స్వయంగా ధర్మరాజుకి చెప్పి ఉన్నారు . ఆ విశేషాలు మీకోసం . 

పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు . రాజ్యం లేదు , భోగ భాగ్యాలు లేవు . శౌర్య, పరాక్రమాలు కలిగిన  రాజకుమారులైన అన్నదమ్ములు అడవుల్లో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నారు . తనవారే  పరాయి వారై , కడతేర్చేందుకు కుట్రలు పన్నడమనే పరిస్థితికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు కదా! అలాంటి పరిస్థితుల్లో ఉన్న ధర్మరాజు, ఆప్తుడు , పరమాత్ముడు అయిన శ్రీకృష్ణుని ఈ కష్టాలనుండి బయటపడే తరుణోపాయం చూపించమని అడిగాడు . 

దానికా వాసుదేవుడు ప్రన్నవదనంతో , యుధిష్ఠిరా , అనంతపద్మనాభ వ్రతాన్ని ఆచరించమని సెలవిచ్చాడు . అనంత పద్మనాభుడంటే కాల స్వరూపం . ఆ స్వామీ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి దారిద్ర్యం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని , సర్వశుభాలూ చేకూరుతాయని చెప్పారు . 

అప్పుడు ధర్మరాజు ,  “కృష్ణా! ఇంతకుముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? ఆ కథని చెప్పవలసిందని” కోరతాడు . కృష్ణుడు ఆ కథని చెప్పడం ఆరంభిస్తాడు . 

 “పూర్వం కృతయుగంలో వేదవేదాంగ శాస్త్రాలలో పండితుడు అయిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైన కుమార్తె పేరు సుగుణవతి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి తల్లి దీక్షాదేవి మరణించింది. సుమంతుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య పరమగయ్యాళి.

యుక్తవయస్కురాలైన తన కూతురిని , కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు  సుమంతుడు. సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకుంటాడు . ,ఈ విషయం రెండవ భార్యకు చెప్తాడు. ఆమె అల్లుడని కూడా చూడకుండా అతనిపట్ల అమర్యాదగా ప్రవస్తుంది . దీంతో సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెళ్ళికోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు. నవదంపతులు స్వగృహానికి బయల్దేరతారు . 

ఆ జంట మార్గమధ్యలో ఒక తటాకం దగ్గర ఆగుతుంది . అక్కడ కొంతమంది స్త్రీలు ఎఱ్ఱని చీరలు ధరించి ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ చేస్తున్నారు . సుగుణవతి వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం గురించి వారికి అడిగింది. వాళ్ళు ఈ విధంగా చెప్పారు “ఈ అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి.వ్రతం ఆచరించే స్త్రీ నదీస్నానం చేసి, ఎఱ్ఱని చీర ధరించి, వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకి దక్షిణ భాగంలో ఉదకంతో కలశాన్ని పెట్టి, వేదికకి మరో భాగంలోకి యమునాదేవిని, మధ్యభాగంలో దర్భలతో చేసుకున్న సర్పాకృతి ని నిల్పిఅందులోకి శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించి, అర్చించాలి.

పూజకు కావలసిన ద్రవ్యాలు పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి. పద్నాలుగు ముడులు, కుంకుమతో తడిపిన కొత్త తోరాన్ని ఆ అనంతపద్మనాభస్వామి దగ్గర పెట్టి పూజించి, ఏడున్నర కిలోల గోధుమపిండితో 28 అరిసెలు చేసి, అనంతపద్మనాభస్వామికి నివేదించి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన అరిసెలు భక్తిగా భుజించాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసిన తరువాత ఉద్యాపన చేయాలి” అని చెప్తారు.

సుగుణవతి వెంటనే అక్కడే శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది . ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకి రాగా, కౌండిన్య మహర్షి తన భార్య సుగుణవతిని ఆమె ధరించిన తోరాన్ని చూసి కోపంగా “ఎవరిని ఆకర్షించాలని ఇది చేతికి కట్టుకున్నావు’’ అంటూ ఆ తోరాన్ని తెంపి నిప్పులలో పడేస్తాడు.అంతే, ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలై, ఆగర్భ దరిద్రులు గా మారిపోతారు. 

తానుచేసిన తప్పుతెలుసుకొని , పశ్చాత్త్తాపం తో ‘శ్రీఅనంతపద్మనాభస్వామివారిని’ దర్శించాలని బయల్దేరతాడు . మార్గమధ్యలో పళ్ళతో నిండుగా వున్న మామిడిచెట్టుకనిపిస్తుంది . కానీ దానిపై ఎటువంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపడ్డతాడు . అలాగే పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్ళకుండా, దూరంగానే ఉన్న ఆంబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలోకి దిగకుండా గట్టునే నిలబడి ఉన్న జలపక్షులను, మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను, ఏనుగుని చూసి ఆశ్చర్యపోతూ “మీకు అనంతపద్మనాభస్వామి తెలుసా?” అని అడుగుతాడు . అవి అన్నీ తమకు తెలియదు అని బదులిస్తాయి .

అలా ఆ అనంతపద్మనాభస్వామిని అన్వేషిస్తూ అన్ని చోట్లా గాలించి ఒక ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోతాడు కౌండిన్యుడు . అప్పుడు శ్రీఅనంతపద్మనాభస్వామికి కౌండిన్యుడిపై జాలి కలుగుతుంది . వెంటనే ఒక వృద్ధబ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వచ్చి, సేదతీర్చి తన నిజరూపంతో దర్శనం ఇస్తాడు . కౌండిన్య మహర్షి అనంతపద్మనాభస్వామిని అనేక విధాల స్తుతిస్తాడు . తన దారిద్రాన్ని  తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహింస్తాడు . అయితే, .కౌండిన్యుడు తాను మార్గమధ్యలో చూసిన వింతలు గురించి అనంతపద్మనాభస్వామిని అడుగుతాడు . 

దానికి అనంతపద్మనాభస్వామి ఈ విధంగా బదులిచ్చాడు. “ఓ విప్రమోత్తమా! తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగాను, మహాధనవంతుడిగా పుట్టినా అన్నార్తులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను, తాను మహారాజుని అనే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటిముందు నిలబడిన పక్షులుగా, నిష్కారణంగా ఇతరులను దూషించేవాడు గాడిదగా, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించే విధంగా చేశాను. అని చెప్పి , నువ్వు ‘అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని’ పద్నాలుగు సంవత్సరాలు చేసినట్లయితే నీకు నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను” అని అనుగ్రహిస్తాడు .

కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగినది అంతా తన భార్య సుగుణవతికి చెప్పాడు. శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు.’’ అని ధర్మరాజుకు, శ్రీకృష్ణుడు శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతం గురించి తెలిపాడు.
కాబట్టి ఈ ఏడాది (2021) సెప్టెంబరు 19 నాడు వచ్చే ఈ అనంత పద్మనాభ చతుర్దశికి కల్పోక్త విధానంతో వ్రతాన్ని ఆచరించి , అనంతుని కృపకి పాత్రులై సమస్త ఈతిబాధల నుండీ విముక్తిని పొందగలరని ఆశిస్తూ , శుభం . స్వస్తి .

శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత విధానాన్ని పొందడం కోసం క్రింద  క్లిక్ చేయండి .

____________________________________

అనంత పద్మనాభ వ్రత విధానము

____________________________________

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore