Online Puja Services

విష్ణు స్వరూపాన్ని రచించే విచిత్రమైన జీవి వజ్రకీట .

18.217.228.35

విష్ణు స్వరూపాన్ని రచించే విచిత్రమైన జీవి వజ్రకీట . 
- లక్ష్మి రమణ 

శ్రీమహావిష్ణువుని భక్తితో ఆరాధించినవారందరూ తప్పక ముక్తిని పొందుతారని అనేక సనాతన వాంగ్మయగాధలు వివరిస్తున్నాయి . ధనుర్మాసంలో ఆ విష్ణుమూర్తిని సేవించుకోవడం మరింత పుణ్యప్రదమైనది . నేపాల్ లోని గండకీ నదిని ఈ కాలంలో స్మరించుకోవడం, ఆనదీగర్భంలో నిత్యమూ జన్మించే ఆ పరమాత్ముని సేవించుకోవడం పరమ
పావనమైన కార్యం . రండి ఈ వజ్రకీట చేసే అద్భుతాలు తెలుసుకుందాం . 
 
దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవని శాస్త్రం. 

సాలిగ్రామం అంటే  ఊరి పేరు కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. కొన్ని తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణుఏవరూపం ఉటుంది. ఇవన్నీ కూడా ఒకే ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. అదే గండకి నది. ఈ నదీ గర్భంలోనే విష్ణువు ఇలా ఉద్భవించడానికి ఒక కారణముంది. 

గండకీ నది కథ :

ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం శ్రావస్తి అనే నగరంలో గండకీ అనే వేశ్య  ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను పొందాలనుకునేవారు. 

అయితే గండకీ మాత్రం రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం క్షణికమైన సుఖాన్నే పరమావధిగా భావించేది కాదు .తాను ఆరోజుకి  భర్తగా భావించిన ఆ  వ్యక్తికి ఏదైనా జరిగితే  తట్టుకోలేకపోయేది.

గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.

సరే అని, గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.
స్వయంగా  వంట చేసి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో కలిపి నోట్లో  తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని తాను తింటుంది. తర్వాత నటనసూత్రధారి నారాయణుడు  బాగా జ్వరంతో వణికిపోతారు. ఆ రాత్రంతా అనే ఆయన పక్కనుండి సేవ చేస్తుంది గండకి. కానీ ఆనాటి రాత్రి గడవకుండానే చనిపోతాడు ఆ విటుడు .

అప్పుడు గండకీ తన కట్టుకున్న  భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో దూకి  సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఎవరెంత చెప్పినా ఆమె వినదు. తన దగ్గరున్న సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత నారాయణుని శరీరంతో పాటు సహగమనం చేస్తుంది . 
 

విష్ణువే  తన గర్భాన పుట్టాలని కోరుకున్న గండకీ :

జ్వలిస్తున్న చితి గండకీ ప్రవేశించగానే ఒక్కసారిగా మల్లె పూల గుట్టగా మారిపోతుంది . అక్కడున్నవారంతా ఆశ్చర్య చకితులవుతూండగా , మహా  విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది . నిన్ను పరీక్షించదలచి నేనే నీ దగ్గరికి వచ్చాను . నిన్ను మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకోమని అనుగ్రహించారు . అప్పుడామె విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.

నదిగా మారిన గండకీ , తులసీ శాపంతో సాలిగ్రామమైన విష్ణువు :  

గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఇదీ గండకీ కథ. అయితే విష్ణుమూర్తి సాలిగ్రామ రూపంగానే ఉద్భవించడానికి కారణం మాత్రం తులసీమాత. తులసి శాపం వలనే  సాలగ్రామం గా మారిన విష్ణువు, గండకీకి ఇచ్చిన వరం వలన ఆ  నదిలోకి సాలగ్రామ రూపంలో చేరారు. 

వజ్రకీట :

ఇక్కడ అందంగా ఒక గుండ్రని అండాకారపు సాలిగ్రామంలో విష్ణుస్వరూపాన్ని చెక్కేందుకు ఒక పనివాడుకూడా ఉన్నాడు . విష్ణుమూర్తి చేతిలో ఉండే ఆ చక్రాయుధమే తానేమో అనేంత భయంకరంగా ఉండే చిన్నా కీటకం ఇది . దాని పేరే వజ్రకీట.  ఇది చూడడానికి ముళ్ళతో భయానకంగా ఉంటుంది కానీ నేపాల్ గండకీ నదిలో నివసిస్తూ, దాని శరీరంలో ఊరే రసాయనాలతో ఇంకా  ముళ్ళతో, పరమ పవిత్రమైన సాలిగ్రామాలను చెక్కుతుంది! విష్ణుమూర్తికి సంబంధించిన శంఖు, చక్ర, గద,ఇంకా అనేక స్వరూపాలతో సాలిగ్రామాలను చెక్కగల నేర్పరితనం ఈ జీవికి ఉంది! కొన్ని నారసింహ సాలిగ్రామాలు కూడా వీటిల్లో ఉంటాయంటే, ఆ కీటకం పనితనంలోని నేర్పరితనం అర్థం చేసుకోవచ్చు . మరికొన్ని  సాలిగ్రామాలకి పైన బంగరు వర్ణంలో ఉండే పూత కూడా ఈ వజ్ర కీట వల్ల ఏర్పడినదే!

 ఈ గండకి నది నేపాల్ లో ఉంది. ఖాట్మండు వెళ్లే దారిలో కనిపిస్తుంది. 

#vajrakeeta #vajrakreeta #gandakiriver #nepal #vishnu #tulasi

Tags: vajrakeeta, vajrakreeta, gandaki, river, nepal, vishnu, tulasi

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi