Online Puja Services

కామిక ఏకాదశి

3.145.171.58

కామిక ఏకాదశి

ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. 
ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. 
శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు.

శ్రీహరిని ఆరాధించటం , తులసీ దళాలతో పూజ చేయటం , వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.
 
కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ

ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని " ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా , దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై  "ఓ రాజా ! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే , ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. " ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు , వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 
 
దానికి బ్రహ్మ బదులిస్తూ " నా ప్రియమైన కుమారుడా ! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ , చక్ర గదాధరుడు , తామర పాదములు కలిగి ఉన్నవాడు , శ్రీధరుడు , హరి , విష్ణు , మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు.  

కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా , హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా , సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా , సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా , గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు - సోమవారం , గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 
 
కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును , దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు , పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. 
ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 
 
నారదా ! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు.  " కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు , సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు."  ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు... 
ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. 

కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి.  కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు , అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 
 
ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము , బంగారం , వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి , ముత్యాలు , కెంపులు , పుష్పరాగములు , వజ్రాలు , నీలం మరియు గోమధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.  లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 

కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. 

ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో , వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు...
కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని , భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. " అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా" శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.

- సేకరణ 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya