Online Puja Services

శయన స్వరూప భద్రఆంజనేయ ఆలయం !

3.147.54.6

సమస్యలు తొలగించి భద్రంగా కాచే శయన స్వరూప భద్రఆంజనేయ ఆలయం ! 
-లక్ష్మీ రమణ 

హరి స్వరూపాల్లో, అనంతపద్మనాధుడు , గోవిందరాజ స్వామి హాయిగా శయనించిన రూపంలో దర్శనమిస్తారు. ఆ హరికి దాసానుదాసుడైన హనుమ మాత్రం, ఎల్లప్పుడూ స్వామికార్యానికి సిద్ధం అన్నట్టు నిలబడో, ఆయన ముందర అర్థనీలిమిత  నేత్రాలతో రామ నామ స్మరణలో మునిగిపోయి కనిపిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో హనుమ శయన స్వరూపంగా కనిపిస్తారు. ఈయన్ని దర్శించుకోవడం  వలన సమస్య ఏదైనా సరే, అది తొలగిపోతుందని విశ్వాసం. 

సాధారణముగా ఉండే భంగిమకి పూర్తి భిన్నంగా ఆంజనేయ స్వామి వారు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం మహారాష్ట్రలోని మరాట్వాడా అని పిలువబడే ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. ప్రసిద్ధ ఎల్లోరా గుహాలకి  సుమారు 4 కి.మీ. దూరంలో ‘ఖుల్తాబాద్’లో నెలకొన్న క్షేత్రం . దానినే భద్ర మారుతి దేవాలయం అని పిలుస్తారు. దేశంలో మరెక్కడా కూడా ఉందని విధంగా శయనిస్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి ఆలయం ప్రత్యేకత.

స్థల పురాణాన్ని పరిశీలిస్తే, ఈ  ‘భద్రమారుతి’ స్వయంభువుగా ఈ భంగిమలో అవతరించారు.  ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకుని సేదతీరుతాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కానీ , రామాయణంలోని ఒక ఉదంతాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. సీతమ్మ జాడకనిపెట్టడం కోసం లంకకి వెళుతున్న హనుమంతుని , కాసేపు తనమీద ఆది విశ్రాన్తి తీసుకొని, పళ్ళూ పహ్లవులు ఆరగించి ముందుకు వెళ్ళమని అభ్యర్థిస్తాడు మైనాకుడు అనే పర్వతరాజు . కానీ రామ కార్యంలో ఉండగా, తాను విశ్రాంతి తీసుకోనని హనుమంతుడు చెబుతారు. అలాంటి ఆంజనేయుడు లక్ష్మణుడి ప్రాణాలని కాపాడడం కోసం సంజీవనీ పర్వతాన్ని తీసుకువెళుతున్న పనిలో విశ్రాంతిని కోరుకుంటారా? కాబట్టి ఇక్కడ ప్రచారంలో ఉన్న రెండవ కథే వాస్తవం అయ్యుండొచ్చన్నది పండితాభిప్రాయం . 

అదేంటంటే,  పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూండేవారు . ఆయనకు రాముడిపై గల అమితమైన భక్తితో శ్రీరాముడిని ఎప్పుడూ భజనలతో, స్త్రోత్రాలతో తనను తాను మైమరిపోయి స్తుతిస్తూ ఉండేవారు . అలాగే  ఒక రోజు భద్రకూట్ సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు నిర్వహిస్తున్నారు. రాముని భజనలు , ఆయన కావ్య గానం , పూజలు ఎక్కడైతే భక్తి పారవశ్యంతో జరుగుతాయో, అక్కడ హనుమ పిలవకపోయినా వచ్చివాలతారు. ఏదో ఒకరూపంలో ఆ గానామృతంలో తనని తానూ మైమరచిపోయి నిమగ్నమైపోతారు .అలా ఆ ప్రాంతానికి హనుమంతులవారు  వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి,  అక్కడే పడుకొని నిద్రపోయారట.

చాలా సేపటి తర్వాత అది గమనించిన ఆ రాచ రామ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడి అనుగ్రహించమని వేడుకున్నారట .  లోకకళ్యాణం కోసం, భక్తులను సదా అనుగ్రహించేందుకు, కన్యలకు సద్బుద్ధి కలిగి ఉండి అనుకూలుడైన భర్తను అనుగ్రహించడంతోపాటు, మీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించేందుకు ఇక్కడే  కొలువై ఉండవలసిందిగా కోరుకున్నారట. హనుమన్న ఆ రాజు భక్తిలోని నిస్వార్థానికి మెచ్చి, ఆయనలోని రామభక్తి నచ్చి , ఆ కోర్కెను మన్నించి , అక్కడే కొలువైనట్లు స్థానిక కథ. 

అలా ఆయన ఆ రాములో రమించిపోయిన స్థితిలోనే స్థిరుడై , శయన హనుమంతుడిగా దర్శనమిస్తూంటాడు. ఈ పురాతన ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లు ఆధారాలున్నాయి. మహరాజుల నుండి సామాన్య భక్తుల వరకూ అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే. ఇక్కడ శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore