Online Puja Services

చిన్నారులకి రక్షా , శిక్షణా

3.21.231.245

చిన్నారులకి రక్షా , శిక్షణా రెండూ ఇవ్వాలనుకుంటే ఇలా చేయండి !
- లక్ష్మి రమణ 

మృత్యుదేవత కనికరం లేనిది.  కాలం క్షణమైనా అలుపు లేనిది .  ఈ రెండూ ఎప్పుడూ పనిలోనే నిమగ్నమై ఉంటాయి . వాటి నీడ తమపైన పడుతుందేమో అనే భయం మనని నిరంతరమూ వెంటాడుతూనే ఉంటుంది . అటువంటి వాటిని తన ప్రభావంతో అడ్డుకోగలిగినవాడు రుద్ర స్వరూపుడు మాత్రమే ! విశేషించి కలికాలంలో రుద్రసంభవుడైన రామభక్తుడు హనుమంతుడు .  ప్రతి రోజూ ఆ అంజనీ సుతుని ద్వాదశనామాలు అంటే పన్నెండు పేర్లు తలచుకుంటే చాలు ! మృత్యుభయం ఉండదు. పైగా సర్వకాలాలలో విజయం సిద్ధిస్తుంది .  

ఆంజనేయుడు ఎంతటి శక్తి మంతుడంటే , స్వయంగా ఆయన రుద్ర సమమానుడు. శివుడికి ఆయనకీ భేదమే లేదు . అటువంటి ఆంజనేయుడు పిల్లాడిగా ఉండి , కొంత వానర జాతిలో జన్మించి, దేవతలందరి చేతా వరాలని పొందడం చేత కావొచ్చు మునులని ఏడిపిస్తూ ఉండేవారట ! అప్పుడు ఆయనకీ నీశక్తిని నీకెవరైనా గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు అని మునులు శపించారట . రామ కార్యార్థమై శతయోజనాలున్న సంద్రాన్ని అధిగమించేందుకు వెనకాడుతుంటే , భల్లూకశ్రేష్ఠుడైన జాంబవంతుడు హనుమ శక్తిని గుర్తుచేసి, నీవు తప్ప ఈ సంద్రాన్ని దాటగల శక్తివంతుడు ఎవరున్నారయ్యా ? అని ప్రశ్నిస్తారు . అప్పుడు హనుమ ఒకే ఒక్క ఊపులో సముద్రాన్ని లంఖించారు . 

అలాగే, ఆయన శక్తిని రోజూ ఒక్కసారి గుర్తు చేసుకుంటే సముద్రమంత కష్టాలైనా తేలిగ్గా దాటించేస్తారు . ప్రతిరోజూ పడుకునేముందర ఈ చిన్న శ్లోకం చదువుకోండి. దానివల్ల పీడకలలు రావు . తేలికగా నోటికి వచ్చేస్తాయి . కాబట్టి చక్కగా  ప్రయాణ సమయంలో, ప్రయాణానికి ముందర ఒక్కసారి స్మరించుకోండి . మృత్యుభయం ఉండదు .  వెళ్లే కార్యం విజయవంతం అవుతుంది . ఇతరత్రా సర్వకార్యాలలోనూ విజయం వరిస్తుంది. వీటినే ద్వాదశనామాలు అంటారు . 

హనుమంతుని ద్వాదశనామాలు:

హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, 
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్!!

ఈ స్తోత్రంలోనే పఠించడం వలన కలిగే ఫలము కూడా వివరించారు కదా ! అది ఆర్షవాక్యం . పొల్లుపోదు . అందువల్ల చక్కగా మీరు చదువుకోవడంతోపాటు, చిన్నారులకి నేర్పించండి. మన సంస్కృతికి, సంప్రదాయానికి వారిగా రేపటి సారధులు . ఇలా చేయడం వాళ్ళ వారికి రక్షా , శిక్షణా రెండూ పంచినవారం  అవుతాము . 

సర్వేజనా సుఖినోభవంతు !!

#hanuman #dwadasanamani #anjaneya

Tags: hanuman, anjaneya, dwadasa, nama, stotram, namani, 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi