Online Puja Services

ఆంజనేయునికి వందమంది భార్యలున్నారా !!

3.137.218.215

ఆంజనేయునికి వందమంది భార్యలున్నారా !!
-సేకరణ 

ఆంజనేయుడు నవ వ్యాకరణ పండితుడు . వివాహం చేసుకోనిదే, వ్యాకరణాన్ని అభ్యాసమే చేయడానికి  అనర్హుడు అవుతారు . మరి ఆయన బ్రహ్మచారి కదా ! ఎలా ఆయన నవ వ్యాకరణ పండితులయ్యారు. స్వయంగా ఆ సూర్య భగవానుడే గురువై ఆయనకీ ఆ విద్యలని బోధించారు . అనర్హుడికి అపాత్రదానం ఒక భగవంతుడు చేయడు కదా ! మరి ఇది ఎలా సాధ్యమయ్యింది ?

హనుమంతుని గొప్పదనం , ఆయన బలం అన్ని ఆయన భక్తిలో ఇమిడి ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వంలో నిలిచి ఉన్నాయి. అటువంటి స్వామికి స్వయంగా సూర్యుడే గురువయ్యాడు . సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయదన దగ్గర వేదాలన్నింటినీ నేర్చేసుకున్నారు హనుమ. 

ఆపై నవ వ్యాకరణాలుగా పిలవబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్లయినవారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా!

హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురూ సూర్య భగవానుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించారు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. ‘నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ’ అంటూ ఆమెతో ఆంజనేయుడి వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ నేర్పారు.

ఇదీ సువర్చలాదేవి వెనుక ఉన్న కథ. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి, హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ, ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయస్వామికీ, సువర్చలాదేవికీ మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు ‘హనుమంత్‌ కళ్యాణం’ చేస్తుంటారు.

హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి వందమందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనఖ కూడా ఒకరు. ఇక థాయ్‌లాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మత్స్యకన్యతో వివాహం జరిగిందనీ, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడనీ నమ్ముతారు. అయితే , భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోకకళ్యాణం కోసమే!

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore