Online Puja Services

శనీశ్వరునికి పట్టిన శని.

13.59.82.167

శనీశ్వరునికి పట్టిన శని. 
- లక్ష్మి రమణ  

 ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర  సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని  "ఏలిన నాటి శని" అంటారు.   ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది. శని ప్రభావం గురించి ‘ శనిలా పట్టుకున్నావేం ‘ అని  కూడా పరిపాటి .  అంతటి కఠినమైన పరీక్షలకి గురి చేస్తారు శనీశ్వరుడు . నిజానికి ధర్మాత్ముడైన శని ప్రభావం నుండీ తప్పించుకో గలిగినవారు ఎవ్వరూ లేదు . ఆఖరికి మహేశ్వరుడు కూడా శని ప్రభావం నుండీ తప్పించు కోలేకపోయాడు . కానీ అదే రుద్ర స్వరూపమైన ఆంజనేయుడి జోలికి వెళ్ళినప్పుడు మాత్రం , శనీశ్వరుడు తనకే శని పట్టిందని భావించారట .   

అది వానరవీరులంతా కలిసి రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం.  శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి  వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను  ఏరి పెడుతున్నాడు.  శ్రీ రాముడు ఒక బండ మీద  ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. జై శ్రీరామ్ అనే వానరుల నినాదాలతో ఆ ప్రదేశమంతా మారు మ్రోగిపోతోంది . 

అటువంటి వాతావరణంలో మహాభక్తుడైన హనుమంతుని జోలికి వెళ్ళడానికి శనీశ్వరుడు కూడా కాస్త వెనుకంజ వేశారు . అందులోనూ ఆయన పట్టుకోవాలనుకుంటున్నది సాక్షాత్తూ అగ్ని స్వరూపుడు , రుద్రసంభవుడు, నింరంతర విష్ణు ధ్యాన చిత్తుడు అయినా హనుమంతుణ్ణి . అప్పటికే ఒకకాలు కుంటిదయ్యిందని భయంతో ఎందుకైనా మంచిదని, ముందుగా అనుమతి తీసుకోవడం మేలనుకున్నారు .  

రామసేతు నిర్మాణంలో నిమగ్నమైయున్న ఆ సమయంలో హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు  ఉండబోతున్నాను."  అన్నాడు శనీశ్వరుడు. “నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను.  ఇపుడు నీకు అంత కాలం కేటాయించలేనన్నారు” ఆంజనేయుడు .  “సరి ,   ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను  ,సరేనా " అన్నాడు.  అందుకు కూడా ఒప్పుకోలేదు హనుమ . ఇక తప్పక కాల బేరానికి దిగారు శనీశ్వరుడు . “ఏడున్నర వారాలు” అన్నారు శనీశ్వరుడు . హనుమంతుడు ,  రామనామం ఆపకుండా జపిస్తూ, ఒక ఏడు క్షణాల కాలం మాత్రం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. 

అప్పుడు శనీశ్వరుడు ఆ సమయంలో ఏ అంగంలో ప్రవేశించాలని దానిమీద ఆంజనేయుని అనుమతి కోరారు.  "నీ కాళ్ళలో ప్రవేశించనా" 
అని అడిగాడు. హనుమంతుడు "వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం" అన్నాడు.

“మరి,  నీ చేతులు పట్టుకోనా?” అడిగారు శనీశ్వరుడు . “ఆ రాళ్ళని చేతులతోనే  కదా మోసేది”  అన్నారు ఆంజనేయుడు. కాలికేస్తే, వెలికిస్తావ్, వేలికేస్తే, కాలికేస్తావ్ ఎలాగయ్యా నీతో చచ్చేది ?  పోనీ నీ భుజాలమీదికి ఎక్కమంటావా ? అనిఅడిగారు . అప్పుడు హనుమంతుడు అన్నారు ,” రామలక్ష్మణులను నా భుజాల మీద తిప్పుతున్నానయ్యా ! అందువల్ల నా భుజాల మీదికి ఎక్కేందుకు వీలుకాదు .” అన్నారు . “ సరే పోనీ , నీ హృదయంలోకి దూరమంటావా?” అడిగారు శనీశ్వరుడు.  “అయ్యో అక్కడ సీతమ్మ తల్లి రామునితో కలిసి నివసిస్తుందయ్యా ! అక్కడ మరొకరికి చోటే లేదు . ఇవన్నీ కాదుగానీ నిన్ను నా తలమీద పెట్టుకుంటా , నా తలమీదికి ఎక్కు” . అన్నారు  హనుమంతుడు. 

వెంటనే ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పైన ( అంటే శనీశ్వరుని మీద) పెట్టుకున్నారు .  ఆ విధంగా శనీశ్వరుడి చేత ఒక్కొక్క బండను మోయిస్తూ సముద్రంలో వేయడం మొదలెట్టారు హనుమ . ఆ బండరాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేసాడు.  మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సు పై నుండి  కిందకి దూకేశాడు. 

“మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా” అంటూ  చేతులెత్తేసి, ఒకటే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
 
హనుమంతుని ముందా కుప్పిగంతులు! నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు  రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు.  పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే, కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. ఆంజనేయుని నిరంతరం పూజించేవారిని, శ్రీరాముని ధ్యానించేవారిని శనీశ్వరుడు పట్టుకోరని విశ్వాసం . 

జై శ్రీరామ్ !!

#hanuman #jaisriram #saneeswara #sanaischara

Tags: hanuman, sri rama, rama, saneeswara, sanaischara

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi