Online Puja Services

దేవగాయకులకి కనువిప్పు కల్పించిన హనుమ

18.118.145.114

తన గానంతో రాతిని కరిగించి, దేవగాయకులకి కనువిప్పు కల్పించిన హనుమ !! 
లక్ష్మీ రమణ 

శ్రీరామచంద్రునికి దాసానుదాసుడు హనుమంతుడు . దాస్యభక్తికి ప్రతీకగా కూడా హనుమంతుడిని పేర్కొంటారు. ఆంజనేయుడు భక్తికే కాదు, ముక్తికి కూడా మార్గదర్శకుడు. ముక్తికోపనిషత్తును స్వయంగా హనుమంతుడే చెప్పాడు. అలాగే వేదాంత విషయాలు కూడా సీతారామాంజనేయ సంవాదంలో పేర్కొన్నాడు. ఆంజనేయస్వామి సూర్యభగవానుడి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకుని నిష్ణాతుడయ్యాడు. నిరంతరం రామ నామంలో లీనమై , ఆత్మ సంయోగ స్థితిలో ఉండే హనుమ సంగీతంలో కూడా ఉద్దంఢుడైన పండితుడు . 

ఒక సందర్భంలో నారద, తుంబురుల  మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన వారే ఇద్దారూనూ !  నారదుడు దేవర్షి. నారాయణ నామంలో నిరంతరం రమించేవాడు . మహతి అనే వీణపైన అద్భుతమైన రాగాలని పలికించే సంగీతజ్ఞుడు . ఇక తుంబురుడు గంధర్వుడు . సంగీతంలో అపారమైన ప్రావిణ్యం కలిగినవాడు . కళావతి అనే వీణని చేపట్టి గందహ్ర్వగానం చేస్తూ ఉంటాడు . ఇప్పటికీ సంగీత గురువులుగా వీరిద్దరినీ ముందుగా పూజించడమనే సంప్రదాయం సంగీత విద్వాసులలో కనిపిస్తూ ఉంటుంది . 

అటువంటి వీళ్ళిద్దారూ ,  ఎవరు గొప్పో తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు. “అయ్యా! సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం మా ఇరువురి మధ్య చోటు చేసుకుంది.  కాబట్టి, మాలో ఎవరు గొప్పవారో మీరు తేల్చాలని” బ్రహ్మను తుంబురుడు అడిగాడు. సంగీత శాస్త్రంలో ఎవరు విద్యాంసులో చెప్పాలంటే, ముందు ఆ న్యాయ నిర్ణేతకు సంగీతం గురించి పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి అలాంటి అర్హుడు ఒక్కడే ఉన్నాడు. అతడే గంధమాధన పర్వతం మీద ఉండే ఆంజనేయుడు. ఆతడి దగ్గరకు వెళితే మీ సమస్యను పరిష్కరిస్తాడని బ్రహ్మదేవుడు అన్నాడు. దీంతో నారద, తుంబురులు అక్కడ నుంచి ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్లారు.

 మా వివాదం గురించి చెబితే బ్రహ్మ మీ దగ్గరకు పంపించారు. మాలో ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో తేల్చిచెప్పాలని కోరారు. హనుమ గొప్ప వినయసంపన్నుడు. కాబట్టి గొప్పలు, అసత్యాలు పలికేవాడు కాదు. నేను రామ సేవకుడిని తప్ప, సంగీత విద్వాంసుడిని కాదు. కానీ మిమ్మల్ని బ్రహ్మగారు చెప్పారని అంటున్నారు కాబట్టి, నాకు తెలిసినంతవరకూ రామ కృపతో ప్రయత్నిస్తానని అన్నారు హనుమ. 

అయితే, ముందుగా మీరు మీ వీణలని అక్కడే ఉన్న ఒక శిలమీద ఉంచి,నేను  చేసే రామ గానాన్ని వినాల్సింది అని వినయంగా కోరారు . ఆ రామ నామామృత గానాన్ని  గుండ క్రియరాగంలో  ప్రారంభించగానే ఆ శిల కరిగిపోయింది . అలా కరిగిన శిలలో వీణలు మునిగిపోయాయి. నారద తుంబురులతో పాటుగా సమస్తమైన ప్రకృతీ రామనామంలో లీనమై పోయి, ఆ గానంలో పరవశమైపోయింది. అలా తన్మయ స్థాయికి వెళ్లిన హనుమ గానం, తిరిగి మళ్ళి  లోకికంలోకి , ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆగింది . ఆయన గానం ఆగగానే ,  ఆ శిల తిరిగి ఘనీభవించింది. 

ఆ తర్వాత శిలలో ఉన్న వారి వీణలు ఆ ఘనీభవించిన శిలలో ఇరుక్కుపోయాయి . అప్పుడు ఆంజనేయుడు అన్నారు ‘ స్వామీ , మీ గానంతో ఆ శిలని కరిగించి, మీ వీణలని గ్రహించండి’ అన్నారు .  

నారద, తుంబురులు తమ ప్రావీణ్యాన్ని అంతా ఉపయోగించినా చెమటలు పట్టాయి తప్ప, శిల మాత్రం కరగలేదు. తమ అజ్ఞానాన్ని తెలుసుకుని నీకు మించిన సంగీత విద్వాంసులం కాదంటూ ఆంజనేయుడికి నమస్కరించారు. మా గర్వం అణిగిపోయింది. తిరిగి మా వీణలను మాకు ఇప్పించండి చాలు అని ప్రార్థించారు. అప్పుడు మళ్లీ హనుమ తన గానంతో ఆ శిలని కరిగించి, వాటిని తీసుకునే అవకాశం ఇచ్చారు. 

అలా హనుమ గానమహిమ ప్రపంచానికి తెలిసింది . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi