Online Puja Services

వేంకటేశ్వరస్వామి కటిహస్తం, వరద హస్తం ఏం చెబుతున్నాయి?

18.117.107.90

వేంకటేశ్వరస్వామి కటిహస్తం, వరద హస్తం ఏం చెబుతున్నాయి? 
- లక్ష్మీరమణ 

తిరుమల వెంకటేశ్వరుడు తెలుగునేలమీద కొలువైన విశ్వదేవుడు . కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుసుడు. శ్రీవారి నగుమోము చూడాలని భక్తులు తాతహలాడుతారు.  ఆ నిలువెత్తు మూర్తిని దర్శించాలని నిలువెల్లా కళ్ళు చేసుకుంటారు.  ఆయన కైంకర్యాలలో ఒక్కసారైనా పాల్గొనాలని తపిస్తారు. దేశ విదేశాల నుండీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని దర్శనానికై తరలి వస్తారు. జగమేలు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఆనంద నిలయంలో దర్శించుకొని, జన్మ తరించిపోయిందని మురిసిపోతారు . వేంకటేశ్వరుని మూర్తి కటి హస్తం, వరద హస్తంతో దర్శనమిస్తుంది. తిరుమలేశుని ఈ భంగిమలోని భావమేమి అని ప్రశ్నిస్తే , పండితులు ఇలా సమాధానం ఇస్తున్నారు . 

 జగమేలేస్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు.  ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృత మూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం.  సర్వాలంకారాలతో సుశోభితుడై, నిజరూపంలో విరాజమానమైన ఆ నిత్యకళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం.  ఆనంద నిలయంగా పిలిచే తిరుమల గర్బాలయంలో, బ్రహ్మస్థానమనే దివ్య స్థలంలో, వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా కొలువుతీరి ఉన్నారు. 

తిరుమలేశుడు స్వయం వ్యక్తమైన స్వామి :

8 అడుగులకు పైగా పొడవున్న స్వామి రూపం స్వయం వ్యక్తం అని భావిస్తారు.  ఈ సాలగ్రామమూర్తి నిలుచుని ఉన్నందున స్థానక మూర్తి అని, స్థిరంగా ఉన్నందున ధ్రువ మూర్తి అని, ధ్రువబేరమని పిలుస్తారు. దేవేరులు లేకుండా ఒక్కరే కొలువుతీరి ఉన్నందున స్థానక విరహమూర్తి అని పిలుస్తారు. పద్మ పీఠంపై నిలుచుని సూర్య కటారి అనే నందక ఖడ్గాన్ని, వివిధ దివ్యమైనటువంటి ఆభరణాలని, కిరీటము, తిరునామము, వక్షస్థలంలో వ్యూహ లక్ష్మీతో పాటు  శంఖు, చక్ర, వరద, కటిహస్తాలతో అద్భుతంగా దర్శనమిస్తారు శ్రీనివాసప్రభువు. 

 వరదహస్తం:

 స్వామి వారు కుడి హస్తంలో వరద ముద్రతో ఉంటారు.  అంటే తన కుడి అరచేతిని తెరిచి తన పాదాలను చూపిస్తూ ఉంటారు.  దాని అర్థం ఆయన  పాదాలను ఆశ్రయించడం పరమోన్నత భక్తికి నిదర్శనం. తన పాదాలని ఆశ్రయించిన వారిని రక్షిస్తానని స్వామి చెబుతున్నారు. అటువంటివారి ఆపదాలన్నీ తీర్చే వైకుంఠ వాసుని వరదహస్తం ఇది. 

కటిహస్తం:

స్వామి వారు ఎడమహస్తాన్ని నడుము కింది భాగంలో కటిపై పెట్టుకుని దర్శనమిస్తారు. తనను ఆశ్రయించినవారికి సంసారసాగరం కేవలం మోకాలి లోతే నన్నది ఈ హస్తంతో స్వామి చెబుతున్నారు . ఇక్కడే జీర్ణ జనేంద్రియ వ్యవస్థలు ఉంటాయి. ఇవి మనిషి మనుగడకు అవసరమైన భాగాలే అయినా దీనిపై అతిగా వ్యామోహం పెంచుకోవద్దని సూచిస్తున్నట్లుగా ఉంటుంది ఈ భంగిమ . 

ఏ ఆగమములోనూ వర్ణించని , ఏ శాస్త్రమూ చెప్పని విశిష్టమైన భంగిమలో స్వామి తిరుమల కొండపైన నిలిచారు.ఆయన రూపం మనోహరం. ఆయన కరుణ అపారం .  అనంత కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ తిరుమలేశుని దివ్య కారుణ్య మూర్తిని మనసారా తలచుకుంటూ , ఆ దివ్య చరణాలకి కైమోడ్పులర్పిస్తూ , శుభం . 

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం 
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం . 

#venkateswaraswamy #katihastam #varadahastam

Tags: venkateswara swamy, kati hastam, hastham, kati, varada, tirumala

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda