Online Puja Services

నారసింహుని శరణు వేడడం ఎలా లాభిస్తుంది ?

18.218.129.100

వేంకటేశ్వరుని కరుణ కోసం నారసింహుని శరణు వేడడం ఎలా లాభిస్తుంది ?  
-సేకరణ 

నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. పోతనామాత్యులు నరసింహోత్పత్తిని వర్ణిస్తూ,  భక్తుడు ఏవైపైతే వేలు చూపిస్తాడో అక్కడనుండి అవతరించగాయానికి సర్వ సన్నద్ధమై సృష్టిలోని ప్రతి అణువులోనూ నారసింహునిగా నిండిపోయి ఎదురుచూస్తూ ఉన్నారట . భగవంతుడు తన భక్తుల కోసం ఎంతటి కరుణతో నిండి ఉప్పొంగి రక్షించడానికి ఉద్యుక్తుడై ఉంటారో ఈ ఒక్క భావన తెలియజేస్తుంది కదా ! నారసింహుని శరణాగతి ఎంతగొప్పదంటే, అది ఇంత అని చెప్పలేనంత నిధి, పెన్నిధి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే,  ముందుగా నారసింహుని శరణుకోరడం మంచి ఫలితాన్నిస్తుంది .  

నారసింహుడు   తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు. క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై. అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే కేవలం నరసింహ స్వామికి కూడా జరుగుతాయి. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. అటువంటి నృసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో.

ఆది శంకరులు పలుమార్లు నృసింహ స్మరణ మాత్రం చేత కాపాడబడ్డారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి తిరిగి తన శరీరంలో వెళ్ళబోవు సమయంలో , రాజభటులు ఆ శరీరానికి నిప్పు పెట్టి ఆహుతి చేయ్యబోయారు . ఆ సమయంలో నారసింహ కరావలంబ స్తోత్రం చేయడం ద్వారా శంకరులు  కాపాడబడ్డారు. 

ఒకసారి ఒక వ్యాధుడు ఆయన శిరస్సును కోరి ఆయన ధ్యానమగ్నులైనప్పుడు తల నరకబోగా ఆయన శిష్యుడు చేసిన నృసింహ స్తోత్రానికి ప్రత్యక్షమై వారిని రక్షించారు. కాశ్మీరంలో ఆయన మీద విషప్రయోగం చెయ్యగా దాన్ని విరిచి మరొక సారి కాపాడారు. ఇలా కోరిన వెంటనే రక్షించిన స్వామీ నరసింహుడు. 

మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. అన్నమయ్య రాసిన 32 వేల సంకీర్తనలలో వేంకటేశునిదే అగ్రతాంబూలం. ఆ తర్వాత ఆ మధురపద కవితా పితామహుడు కీర్తించింది,  ఆర్ద్రంగా ఆరాధించింది నృసింహస్వామినే . అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.

శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు. ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వందబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది? అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతలు, ముని, ఋషి, బ్రాహ్మణులు తినరే ఎలా? అని బ్రహ్మ వ్యాకుల పడతారు. అప్పుడు  శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు. అలా అహోబిలం నారసింహుని ప్రసాదం అందరికీ వడ్డిస్తారు . 

 అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసింహుని  ముందు కూర్చుని ధ్యానిస్తే, ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.

అందుకే వెంకటేశ్వరపాదసేవలో నృసింహునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు

“రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !
శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! “

మాతా నృసింహశ్చ పితానృసింహ:
సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ

విద్యానృసింహో ద్రవిణం నృసింహ:
స్వామి నృసింహ సకలం నృసింహ

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore