Online Puja Services

భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయ పారాయణ మహత్యం

18.225.11.98

భగవద్సాక్షాత్కారాన్ని అనుగ్రహించే భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయ పారాయణం. 
- లక్ష్మీరమణ 

భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయానికి భక్తియోగమని పేరు . పరమాత్ముని రూపాన్ని (సగుణ) ప్రతిష్ఠించుకొని పూజించడం మంచిదా ? లేక  నిర్గుణ రూపమును ఆరాధించాలా అన్న అర్జనుని ప్రశ్నకి భగవానుడు సమాధానమిచారు . అప్పుడు ఆ రెండూ కూడా భగవంతుణ్ణి చేర్చే మార్గాలేననీ, వాటిల్లో  సగుణ సాకార ఉపాసన భక్తులకు అనువైన మార్గమని  భగవానుడు చెప్పారు . ఇంకా ఈ అధ్యాయములో  భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరిస్తారు . భగవంతుని పట్ల  అత్యంత ప్రేమ కలిగి ఉండడమే  భక్తి . ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి. అని చెబుతారు . ఈ విభాగాన్ని పఠించడం వలన , నిత్యమూ పారాయణం చేయడం వలన కలిగే ఫలితాలని మహేశ్వరుడు , గౌరీదేవికి ఇలా చెబుతున్నారు . 

“ ఓ పర్వత రాజనందినీ! భగవద్గీత భగవంతుని పొందేందుకు ఉపదేశించబడిన మార్గమే ! దక్షిణ దేశములో కొల్హాపురం అనేటటువంటి ఒక నగరం ఉన్నది.  ఆ పట్టణము సర్వ సౌకర్యాలతో శోభిల్లుతూ ఉండేది . ఆ పట్టణంలో సిద్ధులు నివసిస్తూ ఉండేవారు. పరాశక్తి అయినటువంటి లక్ష్మీదేవి సదా అక్కడ నివసిస్తూ ఉండేది.  ఆ నగరము పురాణ ప్రసిద్ధమై తీర్థమునకు, భోగమునకు, మోక్షమునకు, సాధనకు అనువైన స్థలిగా  వెలుగొందుతూ ఉండేది కోటి తీర్థములు, కోటి శివలింగములు కూడా ఆ దేశంలో ఉన్నాయి. 

అటువంటి ఆ నగరానికి ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చాడు.  అతడు సాముద్రిక శాస్త్రము వర్ణించినట్టు మంచి లక్షణాలు కలిగి, సుందరాకారుడై ఉన్నాడు. అతడు లక్ష్మీ దేవి దర్శనం కోసం బయల్దేరాడు . చక్కగా మణికంఠ తీర్థంలో స్నానం చేసి, సంధ్యావందనం చేసి, దేవ పితృ తర్పణాలను నిర్వర్తించుకొని ఆ తరువాత భక్తి పూర్వకంగా లక్ష్మీదేవిని సందర్శించి, నమస్కరించాడు . 

“ఓ జగన్మాతా ! నీకు నమస్కారము. నీ ఆజ్ఞను తీసుకునే బ్రహ్మ, విష్ణు రుద్రుడు సృష్టి స్థితి సంహారములు చేస్తూ ఉంటారు. యోగేశ్వరులందరూ కూడా సర్వకాలముల యందు నీ చరణారవిందములనే సేవిస్తూ ఉంటారు. నీవే  ఇచ్ఛాశక్తివిజ్ఞాన శక్తివి క్రియాశక్తి స్వరూపురాలవు.  పరమ జ్ఞాన పరిపూర్ణమైనటువంటి మీ ఆకారము నిష్కలంకము,  నిర్మలము, నిత్యము, నిరంజనము, ఆద్యంత  రహితము, నిర్భయము, ఆధార శూన్యము, నిరామయము అయున్నది.  ఓ దేవి! నీ మహిమను వర్ణించగలిగినటువంటి వారెవరు? మాతా! నీకు నమస్కారము. తల్లీ ! షోడశ కళా పరిపూర్ణమైనటువంటి నీ ముఖారవిందుము నుండి అమృతం వర్షిస్తూ ఉంటుంది. ఓ దేవి! జగమును రక్షించడానికి నీవు అనేక రూపములను దాలుస్తూ ఉంటావు. అందుకే నీవు బ్రాహ్మీ, మహేశ్వరి, వైష్ణవి శక్తి స్వరూపురాలవు.  వారాహి, మహాలక్ష్మి, నరసింహి , ఐ ంద్రీ, కౌమారి, చండిక, లక్ష్మీ  అనే వన్నీ కూడా నీరూపాలే.  అమ్మా !నీవు భక్తుల పాలిటి కల్పవృక్షానివి. తల్లీ  ! మహాలక్ష్మి !!ఎల్లప్పుడూ నిన్నే భజిస్తూ ఉంటాను. నన్ను అనుగ్రహించమ్మా!” అంటూ స్తుతించాడు. 

ఆ రాజకుమారుని స్తుతిని ఆలకించిన అమ్మ ప్రసన్నురాలైంది .  ఆ రాజకుమారుడి పట్ల దయ కలిగి ఆ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది . “ఓ  రాజపుత్రా ! నీ భక్తికి మెచ్చాను. నీకు ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకో! అనుగ్రహిస్తాను.”  అని పలికింది. 

 అప్పుడు రాజకుమారుడు ఈ విధంగా చెప్పాడు. “ మాతా ! నా తండ్రి పేరు  బృహద్రదుడు.  అశ్వమేధ యాగాన్ని చేస్తూ, దైవ వశమున రోగగ్రస్తుడై స్వర్గాన్ని పొందాడు. యుపస్తంభానికి బంధించబడిన అశ్వము భూప్రదక్షిణార్థమై వెళ్ళవలసి ఉన్నది.  ఒకచోట రాత్రి సమయంలో అది  దాటిని తెంపుకొని, ఎక్కడికో పారిపోయింది. దాని  సంరక్షణర్థమై వెళ్లిన  సైనికులు నెలనాలుగు చెరగులా కూడా దానికోసం వెతికారు .  అయినా ప్రయోజనం లేకపోయింది . అప్పుడు ఋత్వికులు నీవు తప్ప వేరెవ్వరూ ఈ సమస్యని తీర్చలేరని చెప్పారు . అందువల్ల నేను నీ శరణు కోరి వచ్చాను . దేవీ , నీవే శరణు . రక్షించు . ఆ అశ్వం జాడ తెలియజేయి . యాగము పూర్తి చేస్తాను.  పితృ ఋణ విముక్తుడవుతాను.  కాబట్టి ఓ జగజ్జనని నువ్వు నాయందు కరుణ చూపి, యాగమును పూర్తి చేసేటటువంటి ఉపాయం ఏదైనా సెలవు ఇవ్వు” అని ప్రార్థించాడు. 

రాజపుత్రుని వచనాలను విన్నటువంటి లక్ష్మీదేవి ఈ విధంగా పలికింది. 

“ఓ రాజకుమారా! నా ఆలయ ద్వారం దగ్గర  ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు.  జనులందరూ అతనిని సిద్ధ సమాధి అని పిలుస్తూ ఉంటారు.  అతడు నీ సమస్యకి పరిష్కారం చూపించగలడు . కాబట్టి నీవు అతని వద్దకు వెళ్ళు” అని పలికి లక్ష్మి అంతర్దానమైంది. 

 రాజకుమారుడు వెంటనే సిద్ధ సమాధిని దర్శించుకొనేందుకు వెళ్ళాడు . అప్పటికే ఆయనకీ లక్ష్మీదేవి రాజకుమారుని సమస్యనంతా చెప్పిఉండడం చేత, వెంటనే రాజకుమారుని ఆదరించి ఆయన సమస్య తీర్చేందుకు పూనుకున్నారు . తన  మంత్ర ప్రభావము వల్ల దేవతలందరినీ అక్కడికి రావించాడు.  దేవతలు అందరూ చేతులు జోడించి బ్రాహ్మణుని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు దేవతలతో, “ఓ  దేవతలారా! ఈ రాజకుమారుని యజ్ఞాశ్వాన్ని రాత్రి సమయంలో ఇంద్రుడు అపహరించాడు.  కాబట్టి మీరు వెంటనే వెళ్లి  ఆ అశ్వాన్ని ఇక్కడికి తీసుకుని రండి” అని ఆజ్ఞాపించాడు.  వెంటనే దేవతలు ఆ అశ్వాన్ని తీసుకొచ్చి రాజకుమారునికి ఇచ్చారు. 

రాజకుమారుడు అది చూసి విస్మితుడై బ్రాహ్మణుడితో ఇలా పలికాడు.  “మహర్షి తాము ఈ సామర్థ్యాన్ని చూస్తే  నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది.  అశ్వమేధము చేయడాన్ని ఆరంభించి, దైవ యోగము వల్ల నా తండ్రి మృతి చెందాడు. మేము  అతని శరీరాన్ని ఒక తైల పాత్రలో ఉంచి, కాపాడుతున్నాము.  కాబట్టి ఓ సాధుశీలా ! మీరు నా యందు కరుణ వహించి నా తండ్రి బృహద్రదుని తిరిగి జీవింపజేయండి.” అని ప్రార్థించాడు.

 అతని  ప్రార్థన మన్నించి ఆ సిద్ధసమాధి క్షణకాలము అర్ధ నీలిమిత నేత్రుడై, ఆలోచించి,  బృహద్రథుని శరీరాన్ని భద్రపరిచిన  యజ్ఞవాటికకు వెళ్లారు .  ఆ బ్రాహ్మణుడు  చేత జలాన్ని గ్రహించి, అభిమంత్రించి,  బృహద్రదుని దేహము పైన చెల్లాడు.  వెంటనే బృహద్రథుడు  సజీవుడయ్యాడు.  అప్పుడు రాజకుమారుడు జరిగిన వృత్తాంతమంతా తండ్రికి తెలియజేశాడు.  అది విని బృహద్రథుడు ఆ సిద్ధసమాధికి నమస్కరించి, “బ్రాహ్మణోత్తమా! ఏ పుణ్య ప్రభావం వల్ల మీకు ఇటువంటి అలౌకిక శక్తి లభించింది? అని ప్రశ్నించాడు.  

దయామయుడైన  ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఈ విధంగా చెప్పసాగాడు . “ఓ రాజా! నేను ప్రతి రోజూ శ్రీమద్భాగవతములోని ద్వాదసాధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటాను. అందువల్ల నాకు అలౌకిక ప్రభావం లభించింది.  ఆ ప్రభావం చేతనే నిన్ను బ్రతికించగలిగాను.” అని చెప్పాడు.  ఈ మాటని విని బృహప్రద మహారాజు అతని కుమారుడు కూడా ఆ బ్రాహ్మణుని వలన ద్వాదసాధ్యాయాన్ని ఉపదేశముగా పొంది, ముగ్గురూ కలిసి ఏక కంఠముతో పారాయణ చేశారు. ఆ తర్వాత  ఆ ముగ్గురు కూడా ద్వాదశాధ్యాయ పారాయణం వల్ల పరము పదాన్ని పొందారు.  వారిని చూసి ఆ రాజ్యంలోని పౌరులందరూ కూడా ఆ విధంగానే ఆచరింప మొదలుపెట్టారు.  

కాబట్టి, ఓ  పార్వతి! భగవద్గీతలోని ఈ పన్నెండవ అధ్యాయమును నిత్యం పారాయణం చేయుట వలన, ఖచ్చితంగా దేవతా సాక్షాత్కారము, మృత సంజీవిని శక్తి, సద్గతీ కూడా లభిస్తుంది.” అని మహేశ్వరుడు గౌరీమాతకి వివరించారు . 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

#bhagavadgita

Tags: bhagavadgeeta, bhagavadgita, bhagawadgeeta


 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi