Online Puja Services

భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణ ఫలితం

3.141.244.201

గీతా  సప్తమాధ్యాయ పారాయణం దానము, యజ్ఞము, తపస్సు మొదలైన వాటన్నింటి కన్నా పుణ్యప్రదాయిని .
- లక్ష్మీరమణ 
 
ప్రక్షాళన అనే మాట వినే  ఉంటారు.  ఇది మనలోని దుర్గుణాలకు కూడా వర్తిస్తుంది . ఇంటికి కళ చేకూరాలంటే, ఇంట్లోని చెత్తా చెదారాన్ని తొలగించి ప్రక్షాళన చేయాలి . మన దరహాకాశంలో పరమాత్మ ప్రకాశం మెరవాలంటే , హృదయంలోని చెడుబుద్ధులని ప్రక్షాళన చేయాలి . అద్దంలాంటి స్వచ్ఛమైన మనస్సులోమాత్రమే ఆ పరమాత్మ ప్రతిబింబిస్తాడు . అటువంటి ప్రక్షాళన చేయగలిగిన, అందుకు ప్రేరేపించగలిగిన గొప్ప సాధకం భగవద్గీతలోని ఈ సప్తమాధ్యాయం . తద్వారా మోక్షాన్ని అందించగలిగిన ఈ ఏడవధ్యాయ పారాయణా ఫలితాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నారు . 

శైల నందిని, ఇప్పుడు ఏడవ అధ్యాయ మహత్యాన్ని చెబుతున్నాను, సావధాన చిత్తవై విను. ఈ సప్తమాధ్యాయముని కేవలం వినడం మాత్రం చేతనే మానవులు అమృతమయమైన దేహాన్ని పొందగలరు . పూర్వము పాటలీ పుత్రమనే ఒక విశాలమైన నగరం ఉన్నది.  అందులో శంకుకర్ణుడనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడు.  ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు.  దైవపూజ చేస్తూ, వేదాధ్యయనము చేస్తూ, పదిమందికీ ధర్మాన్ని బోధించవలసిన ఆ బ్రాహ్మణుడు ధనాశాపరుడై వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు . ధనార్జనే పరమావధిగా ప్రవర్తిస్తూ, కనీసం పితృతర్పణం కానీ దేవ పూజ కానీ చేసేవాడు కాదు. 

ఇదిలా ఉండగా, నాలగవ వివాహం చేసుకోవాలనే కోరికతో బంధువులని వెంటబెట్టుకొని అరణ్య మార్గంగుండా ప్రయాణమై వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో  ఒక నాటి రాత్రి పాము కాటువేయడంతో అతను  మృతి చెందాడు. మనం ఏం చేస్తున్నామో ఆ ధర్మరాజుకి తెలిసినదే. ఆయన మన లెక్కలన్నీ సిద్ధంగానే ఉంచుకుంటారు . కనుక మరణానంతరం తన కౄరకర్మములకి నరకయాతనలను అన్నిటిని అనుభవించాడు . 

ఆ తర్వాత  పూర్వ జన్మ స్మృతి కలిగిన సర్పమై  జన్మించాడు.  ఆ సర్ప రూపములో శంకు కర్ణుడు ఒకసారి తనలో తాను నేను గత జన్మములో ఎంతో ధనాన్ని ఆర్జించి నా గృహములో పాతిపెట్టాను.  నా కుమారులను హెచ్చరించి  ఆ ధనమును నేనే కాపాడతాను.  అని నిశ్చయము చేసుకొని  ఆ నాటి రాత్రి స్వప్నంలో తన కుమారునికి  కలలో కనిపించి, విషయాన్ని తెలియజేశాడు.  మరుసటి రోజు ఆ కుమారుడు ఆ స్వప్న వృత్తాంతమును తన సోదరులకు తెలియజేసి, వారిని వెంట తీసుకొని, ఆ ధనము గల స్థానానికి పోయి అక్కడ భూమిని తవ్వడం ప్రారంభించారు. 

 అప్పుడు ఆ సర్ప రూపంలో ఉన్న శంకు కర్ణుడు బుసలు కొడుతూ లేచి తన కుమారులతో మనుష్య భాషలో ఇలా మాట్లాడాడు.  ‘ఓయీ ! మీరు ఎవరు ? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ గోతిని ఎందుకు తవ్వుతున్నారు? ఇక్కడ నుంచి ఏం తీసుకుపోదలుచుకున్నారు?’ అని ప్రశ్నించాడు.  అప్పుడొక కుమారుడిలా పలికాడు ‘తండ్రి! నేను నీ కుమారుడ్ని.  నా పేరు శివుడు.  రాత్రి నా కలలో నీవు చెప్పినట్టుగా, ఇక్కడ సువర్ణాన్ని దాచి పెట్టావని, దానిని తీసుకుపోవడానికి వచ్చాను’ అన్నాడు.  

పుత్రుడి మాటలు విన్నటువంటి శంకు కర్ణుడు నీవే నాకు కుమారుడవి అయితే, ముందర  నాకి సర్పదేహము పోయేటటువంటి ఉపాయాన్ని ఆలోచించు.  గత జన్మలలో నేను అమితమైన ధనాశ  చేత కుల ధర్మాన్నంతటినీ కూడా పరిత్యజించాను . లాభాపేక్షే ధ్యేయంగా వ్యాపారం చేశాను . అందువల్లే నాకు సర్పజన్మం  సంప్రాప్తించింది’ అని పలికాడు.  అది విన్న అతని  కుమారుడు ‘తండ్రి! నీకు విముక్తి ఏ విధంగా కలుగుతుంది? దీనికి ఉపాయం ఏమిటి? నీవు వివరంగా చెప్పినట్లయితే బంధువులందరినీ కూడా నీ దగ్గరకు తీసుకువచ్చి నేను ప్రయత్నం చేస్తాను’ అని సమాధానం ఇచ్చాడు . 
 
అప్పుడు శంకు కర్ణుడు ఇలా చెప్పాడు. “ కుమారా విను భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని పారాయణం చేయటం వల్ల తీర్థయాత్రలు, దానము, యజ్ఞము, తపస్సు మొదలైన వాటన్నింటినీ చేయడం కంటే కూడా అత్యధికమైన ఫలితం కలుగుతుంది.  కేవలం ఒక్క గీతలోని ఏడవ అధ్యాయం పారాయణం చేయడం చేత ప్రాణులు జన్మ,జరా,మరణ రూపాత్మకమైనటువంటి సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతారు.  కాబట్టి నీవు నా శ్రార్థము నా నీవు నా శ్రాద్ధ దినము రోజున  బ్రాహ్మణుల చేత భగవద్గీతలోని సప్తమాధ్యాయ పారాయణ చేయించి, ఆ బ్రాహ్మణులందరికీ కూడా తృప్తికరంగా భోజనాన్ని పెట్టినట్లయితే నిస్సంశయంగా నాకు సర్పము యొక్క రూపము నుండి విముక్తి కలుగుతుంది.  కనుక నీవు నీ శక్తి కొలది నా శ్రార్ధ దినమున వేద విధితులైనటువంటి బ్రాహ్మణులకు అన్నదానము చేయి’ అని చెప్పాడు.  ఈ విధంగా తండ్రి ఆనతిని తీసుకొని, అతని శ్రార్ధ తిథి నాడు  గీతలోని సప్తమాధ్యాయమును పారాయణం చేయించి, వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు అన్నదానము చేశారు శంఖుకర్ణుని కుమారులు .  

ఆ విధంగా చేసిన వెంటనే శంకు కర్ణుడు దివ్య దేహ దారియై, ధనమంతా పుత్రుల కప్పగించి వైకుంఠనికి వెళ్లిపోయాడు.  అతని కుమారుడు కూడా బుద్ధిమంతులై ఆ ధనాన్ని వెచ్చించి, దేవాలయాలు కట్టించడం, అన్న సత్రములు స్థాపించడం, మార్గమధ్యంలో నీడకై వృక్షాలు నాటించడం, బావులు తవ్వించడం మొదలైన ధర్మకార్యములను ఆచరించారు.  ఆ తరువాత వారు గీతా సప్తమాధ్యాయాన్ని పారాయణ చేస్తూ చివరకు మోక్షాన్ని పొందారు. 

కాబట్టి ఓ పార్వతి, మానవుడు జాతి, మత బ్రష్టుడై, నీచ యోనియందు జన్మించినప్పటికీ కూడా సప్తమాధ్యాయ శ్రవణము చేసినంత మాత్రము చేత జన్మరాహిత్యం కలుగుతుంది.” అని పరమేశ్వరుడు ఆ పార్వతీ దేవికి భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణ ఫలితాన్ని వివరించారు . 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! శుభం భవతు !!

#bhagavadgita

Tags: bhagavadgita, bhagawadgeeta, bhagavadgeeta

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi