Online Puja Services

సీతమ్మ సంహరించిన శతకంఠుడు!

3.23.127.197

సీతమ్మ సంహరించిన శతకంఠుడు!
సేకరణ 

రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగుతున్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరిస్తేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. అన్నది.  ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.

శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. 

శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గాంతరం తెలియక చింతించసాగింది.

సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. 

 ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ. సీత సంహరించిన శతకంఠుని కథ . 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha