Online Puja Services

కవచాన్ని గురించి తెలుసా!

3.149.213.209

కవచాన్ని గురించి తెలుసా!
- లక్ష్మి రమణ 

యుద్ధానికి వెళ్లే యోధులు కవచాన్ని ధరించి వెళతారు . అప్పుడు శత్రువులు ఉపయోగించే ఆయుధాల ప్రహారం నుండీ ఆ కవచాలు యోధులని కాపాడతాయి. రోగాలు మనుషుల  దాడికి పాల్పడతాయి . మనుషులు తమ రోగనిరోధక శక్తి ద్వారా వాటి నుండీ బయట పడేందుకు పోరాడుతూ ఉంటారు. కవచం అనే పేరుతొ మనకి అనేకమైన దేవీ  దేవతలకి సంబంధించిన కవచాలు అందుబాటులో ఉన్నాయి . ఇవి మనం ఒక కవచాన్ని తొడుక్కున్నట్టుగా మనల్ని రక్షిస్తాయా ? 

ఒక కవచం తొడుక్కుంటే కేవలం బాహ్యమైన దాడి నుండే రక్షణ లభించవచ్చు . కానీ ఈ మంత్ర పూరితమైన కవచాలు అంతర్గత శక్తిని జాగృతం చేస్తాయి . మంత్రం దేవత మనకి రక్షగా ఉండేలా అనుగ్రహిస్తాయి .  మనలో అంతర్గతమైన, బహిర్గతమైన శక్తిని జాగృతం చేసి కవచంలా మనని రక్షించే మంత్ర రక్షలే కవచాలు. శ్రీ దుర్గా కవచం, శ్రీ నృసింహ కవచం , శ్రీ హనుమత్కవచం, శ్రీ సుబ్రహ్మణ్య కవచం వంటి ఎన్నో మంత్ర కవచాలు మహనీయులైన మన ఋషులు, దేవతలు అందించారు .  ఉదాహరణకి నృసింహ కవచం ఆయన అనంగు భక్తుడు, సేవకుడు అయినా ప్రహ్లాదుడు బ్రహ్మానందపురాణంలో చెబుతారు . శ్రీ హనుమత్కవచాన్ని వశిష్ఠ మహర్షి అందించారు. శ్రీ సుబ్రహ్మణ్య కవచాన్ని బ్రహ్మగరే స్వయంగా చెప్పారు . ఇక ఈశ్వరుడే స్వయంగా అందించిన కవచం శ్రీ దుర్గాకవచం . ఇంకా నారద మహర్షి ఇచ్చిన గరుడ కవచం, కాశ్యపముని అందించిన నారాయణ కవచం వంటి శక్తివంతమైన కవచాలు ఎన్నో ఉన్నాయి . 

ఇవన్నీ అద్భుతమైన ఫలాన్ని అనుగ్రహించేవే ! వీటిని శ్రద్ధగా , భక్తిగా చేసుకోగలిగితే ఖచ్చితంగా శరీరానికి కవచమై కాపాడతాయి .  మన శరీరంలో ప్రతి భాగాన్ని- అంతరంగ, బహిరంగ అంగాలను కూడా భగవంతుడు ఏవిధంగా కాపాడతాడో వివరిస్తూ ఆయా ఋషులు ( ఆ కవచాన్ని మనకి ప్రసాదించిన వారు) కవచంలో దేవతా శక్తిని అద్భుతమైన రీతిలో కీర్తిస్తారు . 

ఉదాహరణకి ప్రహ్లాదుడు చెప్పిన దివ్యమైన నృసింహ కవచం ఒక్కసారి ధారణ చేస్తే, శరీరమంతా మంత్ర శక్తితో నిండిపోయి శరీరం కవచాన్ని తొడుక్కునట్లుగా కాపాడబడుతుంది.  ఎటువంటి సూక్ష్మ శక్తి కూడా మనల్ని బాధించకుండా రక్షించే ఒకానొక మహిమ ఈ దివ్యమైన కవచంలో నిక్షిప్తం చేసి ఉంచారు. ఇక్కడ భగవంతుని స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవాలి . 

ఆకారం కలవారు నరులు, జీవులు అనుకుంటే, అటువంటి ఆకారమే లేని నిరాకార నిర్గుణ శుద్ధ చైతన్యమే ఆ పరంథాముడు. ఆ  స్వామి ఆకారం ఇతర జీవుల లాగా, జడాకారం కాదు. సంకేత రూపం . విశిష్టమైన, శ్రేష్ఠమైన సింహ తత్త్వం. అది నిరాకార నిర్గుణ తత్వానికి అభిన్నం. వట్టి నారదు కాదు, శ్రేష్ఠమైన నృసింహుడు ఆయన. సత్యము ఆనందము కలిసిన చైతన్య విగ్రహం నృసింహ దైవం. ఈ కవచాన్ని రోజూ స్మరిస్తే, అటువంటి వారి చెంతకి రోగమే కాదు, రోగం గాలి కూడా రావడానికి భయపడుతుంది . 

ఇది నృసింహ కవచాన్ని ఉన్న ప్రత్యేకత. కవచాలు దాదాపు అన్ని కూడా మంత్రగర్భితాలు. భక్తితో , నిష్ఠగా చేస్తేమాత్రం వీటికన్నా ఫలదాయకాలు , గొప్ప ప్రయోజాకారకాలు, ముక్తిప్రదాయకాలు మరొకటి ఉండవు. ఇహపరసుఖములనిచ్చే వారధులు అని చెప్పుకుంటే అతిశయోక్తికాదు .  కాబట్టి మీకు నచ్చిన దైవానికి సంబంధించిన కవచ స్తోత్రాన్ని మీ రోజూ వారీ పూజలో చేర్చుకొని చక్కగా సాధన చేయండి. 

భగవంతుడు  కరుణా రస పరిపూర్ణుడే ! ఆయన కరుణామృతాన్ని స్వీకరించడానికి మనకి కావలసింది కేవలం పూర్ణమైన భక్తి అనే పాత్ర . అది  ఉంటె,అంతులేని ఆ అమృతాన్ని తాగి జన్మ , మృత్యు చక్రం నుండీ ఎంచక్కా బయటపడొచ్చు .

శుభం !!  

Kavacham.

Do you know about Kavacham?

#kavacham

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda