Online Puja Services

ఉప్పు చేతికివ్వకూడదు అని ఎందుకు చెబుతారు ?

3.21.244.137

ఉప్పు చేతికివ్వకూడదు అని ఎందుకు చెబుతారు ?
- లక్ష్మి రమణ 

ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపంగా చెబుతారు . రాత్రిపూట ఉప్పు అనే పదమే నోట పలుకవద్దంటారు. ఉప్పుని తలచుట్టూ తిప్పి పడేస్తే దిష్టి తొలగిపోతుంది అని చెబుతారు. ఇంకా ఎన్నో పరిహారాలు ఉప్పుతోటి సులభంగా చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు. అలా ఉప్పుకున్న ప్రత్యేకత వెనుక ఉన్న గొప్పదనం ఏమిటి ? తెలుసుకుందాం రండి . 

ఉప్పుని లక్ష్మి దేవి తో పోలుస్తూ ఉంటారు. ఉప్పుని అప్పుగా  ఇవ్వకూడదని, చేతికి ఇవ్వకూడదని ఇలా ఉప్పుని గురించి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. వంటకి రుచినిచ్చేది ఉప్పేకదా ! ఎంతగొప్పగా వంట చేసినా , అందులో అవసరమైనంత ఉప్పు లేకపోతె రుచి పుట్టదు కదా ! లక్ష్యమును సిద్ధింపజేసేది లక్ష్మి అయినప్పుడు, పదార్థానికి రుచినివ్వడం అనే లక్ష్యాన్నిచ్చే ఉప్పు కూడా మహాలక్షీ స్వరూపమే . అదీకాక,  మహాలక్ష్మి దేవి సముద్రం నుంచి పుట్టింది. ఉప్పు కూడా సముద్రం నుంచే లభిస్తుంది. అందువల్ల కూడా  ఉప్పుని కూడా లక్ష్మి తో పోలుస్తూ ఉంటారు.  నేలపై పడితే లక్ష్మీ స్వరూపంగా భావించి తొక్కవద్దని చెబుతుంటారు.

శ్లో.గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ 
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః 

అని శ్లోకం. అంటే,  దశ దానాల్లో ఉప్పు అనేది కూడా ఉంది. ప్రత్యేకించి ఈ ఉప్పుని శనిగ్రహ ప్రీతికోసం దానంగా ఇస్తారు . ఉప్పుని చేతితో  తీసుకుంటే, అది దానంగా పరిగణించబడి అవతలివారి చెడు ప్రభావం తద్వారా తీసుకున్నవారికి చెందవచ్చని భావిస్తారు .  అలాగే పితృ కార్యాలలో ఉప్పును దానం ఇస్తూ ఉంటారు. అందువల్ల ఉప్పుని  చేతికి ఇవ్వకూడదని అంటారు.

ఉప్పుకి ఉన్న  శోషక లక్షణాల వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని ఉప్పు తొలగిస్తుందని విశ్వాసం. అందుకే ఉప్పు చుట్టూ తిప్పడంతో  దిష్టి తొలగిపోతుంది అని చెబుతారు. అలాగే బాగా అలసటగా ఉన్నప్పుడు, విపరీతమైన తలనొప్పి , నిరాశగా ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసైనా నీటితో స్నానం చేయమని చెబుతుంటారు . 

వాస్తు పరిహారాలుకూడా ఉప్పుని వాడి సూచిస్తుంటారు .  ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటె,  నైరుతి మూలలో ఒక గ్లాస్ ఉప్పు కలిపిన నీటిని ఉంచడం వల్ల ఆ సమస్యల నుండీ గట్టెక్కవచ్చని సూచిస్తారు . అలాగే, ఇంటిని శుభ్రం చేసేప్పుడు నీటిలో  కొంచెం ఉప్పు, పసుపు  వేసి ఆ నీటితో ఇల్లు తుడవడం, కడగడం చేస్తే, ప్రతికూల దోషాలు తొలగిపోతాయి . 

 ఉప్పు చేతికివ్వడం వలన అలా అందించుకున్న ఇద్దరి మధ్యలో కలహాలు వస్తాయని పెద్దల మాట . అది కూడా ఉప్పుకున్న గ్రహణ శక్తిని బట్టీ చెప్పినదే ! ఇక  ఉప్పందించడం అంటే ఒకరి రహస్య సమాచారాన్ని వారిని మోసం చేసి మరొకరికి చెప్పటం అనే అర్థంలో కూడా ఈ మాటని వాడుతూ ఉంటాం . అందుకే ఉప్పుని చేతికి తీసుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల మాట చక్కని పెరుగన్నం మూట అని గుర్తించాలి . శుభం . 

#salt

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore