Online Puja Services

నదులని స్త్రీ దేవతా స్వరూపాలుగానే ఎందుకు పూజిస్తాం ?

3.144.189.177

నదులని స్త్రీ దేవతా స్వరూపాలుగానే ఎందుకు పూజిస్తాం ? 
- లక్ష్మి రమణ 
 
ఒక తల్లి తన పిల్లలను ఎలా కని సాకుతుందో, ఒక నది అలానే ఒక జనావాసాన్ని, నాగరికతను తల్లిగా సాకుతుంది. అన్ని గొప్ప సంస్కృతులు నదీ తీరాలలోనే పురుడు పోసుకున్నాయి. దాహార్తిని తీర్చడం, పంటకు కావలసిన భూమి, నీరు, వాణిజ్యానికి కావలసిన సదుపాయం, చుట్టూ పర్యావరణ సమతుల్యానికి కారణం నది. కాబట్టి నదిని అమ్మగా దేవతగా కొలిచారు మన పూర్వీకులు.

నిజానికి భారతీయ సంస్కృతిలో మనకి జీవం ఇచ్చే ఏ శక్తిని అయినా స్త్రీ రూపం గానే భావిస్తాము. స్వయంగా ఆ ఆదిశక్తే తన అంశలుగా ప్రకృతిగా పరిణమించిందని ఆమెని ప్రకృతీ మాతగా ఆరాధిస్తాం. ఇలా భూమిని, నదిని, గోవును, దేశాన్ని అన్నింటినీ తల్లిగా ఆదరించడం మన సాంప్రదాయం. మనకు శక్తి స్త్రీ రూపము. అందుకే పాపములను ప్రక్షాళన చేసే దేవతా శక్తులుగా నదులను కొలిచారు మన వారు. ఇలా భావన చేయడమే విశేషమైతే, వాటిలోని ప్రత్యేకలని గుర్తించి నదీపూజని  విధించడం మరింత గొప్ప విశేషం. 

పర్వతము ధృడంగా కఠినంగా ఉంటుంది గనక పురుషుడు. నదుల జన్మస్థానాలు పర్వతములు. కనుక నదులు పర్వత పుత్రికలు అయినాయి. అందుకే గంగ, హిమవత్పర్వత పుత్రిక అయినది. మిగిలిన చాలానదలు గంగ యొక్క అంశ గానే మన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఉదాహరణకు గోదావరి గౌతమ మహర్షి తపస్సుతో శివుని జటాజూటం నుండి విడువబడిన దేవ గంగగా చెప్పబడింది.అలాగే  కావేరీ కూడా అగస్త్య మహర్షి తపస్సుతో వచ్చిన గంగ స్వరూపము. ఇలా ప్రతి నది యొక్క మూలంలో ఆ శక్తి ఉద్భవముకు సంబంధించిన ఒక స్థల పురాణము, ఆ శక్తి యొక్క ఆరాధన మన పురాణాల్లో వివరించారు. 

 పురాణాల్లో ఈ నదులను పాప ప్రక్షాళన చేసే తీర్థాలుగా పేర్కొన్నారు. నదులలో రోగ నిరోధక శక్తులను గుర్తించి, ఈ తీర్థస్నానాన్ని నిర్ణయించారు. ప్రతిరోజూ సమీపంలోని నాదీ స్థానం చేయగలగడం , ఆ నాదీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకొని తపస్సు చేయడం భగవంతుని అనుగ్రహానికి పాత్రులని చేస్తాయని మన ధర్మ శాస్త్రం చెబుతోంది . కలశ స్థాపన చేసినపుడు కూడా పవిత్రములైన నదీజలాలని మంత్రయుక్తంగా ఆయా కలశ జలాలలోకి ఆహావానించడం కూడా మన సంప్రదాయంలో ఉంది. 
 
శక్తి స్త్రీ స్వరూపము. అటువంటి శక్తిని ప్రసాదించే ప్రకృతి మాతలు, జీవధారలైన  నదులు.  గనుక నదులు స్త్రీలుగా పేర్కొనబడ్డాయి. ఈ నదులు సముద్రంలో సంగమిస్తాయి. అనంతజలరాశిని ఎక్కడ ఉంచాలన్న నిర్ణయాన్ని ఇలా చేసిన ఆ పరమాత్మ ఇంజనీరింగ్ ప్రతిభ ఈ ఒక్క ఇషయంతో తేటతెల్లం అవుతోంది కదూ ! ఇలా సముద్రుణ్ణి కలుస్తున్నాయి కనుక ఆ సముద్రున్ని పురుషునిగా వర్ణించారు. అదీకాక , నదీజలాలు మంచినీటి తావులు. తీయగా సున్నితంగా ఉంటాయి . సముద్రజలాలు లవణాన్నీ అధికంగా కలిగిన క్షారజలాలు. కఠినంగా ఉంటాయి . కనుక సున్నితమైన నదులని స్త్రీలుగా, సముద్రుణ్ణి వారికి భర్తగా  ఊహించారు.

#river #goddess

Tags: river, goddess, woman, 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya