Online Puja Services

ఆషాడంలో ఆడపిల్లని పుట్టింటికి పంపడం ఎందుకు ?

18.225.149.136

ఆషాడంలో ఆడపిల్లని పుట్టింటికి పంపడం ఎందుకు ?
లక్ష్మీ రమణ 

రుతుపవనాలు అడుగుపెట్టగానే, ప్రకృతి తల్లి పులకరించి పచ్చని చీరని అలంకరించుకుంటుంది . నల్లనల్లని కారుమబ్బుల కురుల్లో , మెరిసే మెరుపుల్ని మల్లెల్లా తురుముకుంటుంది . తన సంతోషాన్నంతా జీవ ధారలుగా మార్చి పుడమితల్లి దాహాన్ని తీరుస్తుంది.  అదిగో అలాంటి పరవశం పురులువిప్పి ఆడినప్పుడే వస్తుంది ఆషాడమాసం . వేసవిలో పెళ్ళిళ్ళు చేసుకొని అత్తారింటికి వెళ్లిన పడుచులంతా తిరిగి పుట్టిళ్ళకి చేరుకుంటారు . మళ్ళీ శ్రావణం పలకరించేంతవరకూ అమ్మా, నాన్నల దగ్గరే కాలం గడుపుతారు. కానీ ఈ ప్రత్యేక నియమం ఆషాడానికే ఎందుకు వర్తిస్తుంది ?
 
మాములుగా మానవ జీవితంలో జరిగే ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం, మంచి సమయాన్ని నిర్ణయిస్తారు . ఆ ముహూర్తాలను బట్టి అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా వివాహాలకు కొన్ని మాసాలలో మాత్రమే ముహుర్తాలు ఉంటాయి ఇవి మాత్రమే వివాహాలకు తగిన సమయాలుగా చెప్పబడ్డాయి. వీటిని హిందూ సంప్రదాయం ప్రకారం ఎప్పటి నుండో ఆచరిస్తూ వస్తున్నారు. అయితే ఒక్క మాసంలో మాత్రం పెళ్లిళ్లు పూర్తిగా నిషెందించారు.  ఇది మన పూర్వీకుల నుండి వస్తున్నదే. ఇంతకీ ఆ మాసం ఏమిటీ అంటారా ? అదే నండీ ఆషాడమాసం.

 ఆషాడమాసంలో సాధారణంగా ఎన్నో విశిష్ట పూజలు జరుపుతుంటారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆషాడమాసం పెట్టింది పేరు. తొలకరి జల్లులు కురిసేవేళ వానలు బాగా పడాలని గ్రామదేవతలని ఆరాధిస్తారు . బోనాలు , చద్ది నివేదనలూ సమర్పిస్తారు . వీధివీధినా ఈ పండుగల సంబురాలు అంబరాన్ని తాకుతుంటాయి .  అయితే శుభకార్యాలకు మాత్రం ఈ మాసం అనుకూలం  కాదని పెద్దలు చెబుతుంటారు . ఇక పెళ్ళిళ్ళకయితే, ఈ మాసంలో ముహుర్తాలు లేవంటారు . ఆషాడం అధికమాసంగా కూడా వచ్చిందో , ఇక పెళ్లి కుదుర్చుకొని, వివాహంకోసం ఎదురుచూసే జంటలకు, మరో నెల విరహం తప్పదు మరి !అంతేకాకుండా ఆషాడమాసంలో భార్య భర్తలు, అత్తా కోడళ్ళు దూరంగా ఉండాలనే పద్దతి కూడా ఎప్పటి నుండో పాటిస్తున్నదే. 

అయితే ఇంతకీ ఈ ఆషాడమాసం ఎందుకు శుభకార్యాలకు అనుకూలం కాదు అంటే అందుకు పురాణాలు సమాధానం చెబుతాయి . కాలం అనేది మనుషులకే, దేవతలకీ ఒకే రకంగా ఉండదు . స్థితి కారకుడైన మహా విష్ణువు అలిసిపోయి, ఆషాడ మాసం లోనే యోగ నిద్రకి ఉపక్రమించి ఉంటారని పురాణాలు చెబుతాయి . అంటే ఈ మాసంలో జరిగే శుభకార్యాలకు ఆ శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం ఉండదు. ఆయన నిద్రలో ఉంటారు కాబట్టి, ఆయన్ని మంత్రయుక్తంగా ఆహ్వానించి , ఆశీర్వదించమనడం సరైనది కాదుకదా ! అందుకనే ఆషాడంలో శుభకార్యాలకు యోగ్యం లేదని చెప్పబడింది. 

అంతేకాకుండా మనిషి యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆషాడమాసం సంప్రదాయాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు పెద్దలు. భారతదేశంలో వ్యవసాయం ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆషాడమాసం సమయంలో పంటలేవి చేతికి అంది రావు.  తద్వారా ఆదాయం కూడా ఉండదు.  ఇలాంటి సమయంలో ఖర్చుతో కూడుకున్న పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు చేయడం కష్టమైన పనే ! అందువలన కూడా  ఈ ఆచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కొందరు చెబుతారు. 

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna