Online Puja Services

కామాక్షీ దీపం ఎలా వెలిగించాలి

18.218.70.93

కామాక్షీ దీపం ఎలా వెలిగించాలి? 
లక్ష్మీ రమణ 

కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కనుక కామాక్షీ దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించడం చాలా మందికి వంశానుగతంగా వస్తున్నా ఆచారంగా ఉంటుంది . ఆ దీపాన్ని కూడా వారసత్వ నగల్ని ఇచ్చినట్టుగా, పెద్దలు ముందు తరాలవారికి అందజేయడం ఆనవాయితీగా ఉంటుంది . ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ? ఎలా పూజించాలో చదువుకుందాం . 
 
కామాక్షీ దేవి సర్వదేవతలకూ శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షీ కోవెల తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరుచుకొని,  రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది. కన్నులతోటే అనుగ్రహాన్ని ఇచ్చే  దేవత కదా ఆ కామాక్షి .  

కామాక్షి దేవి దీపంగా దక్షిణాదిలోని తమిళనాడు వారు ప్రసిద్ధిగా ఈ ఆచారాన్ని పాటిస్తారు . ఇతర తెలుగు , కర్ణాటక రాష్ట్రాలలో ఈ దీపాన్ని లక్ష్మీ దీపంగా, గజలక్ష్మీ దీపంగా పిలుస్తూ ఉంటారు .  ఎలా పిలిచినా ఈ దీపం మాత్రం అనంతమైన జ్ఞానసిద్ధిని , ఐశ్వర్యాయాన్ని అనుగ్రహిస్తుంది విశ్వాసం . 
 
కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం.కామాక్షీదీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షీ దీపము ప్రత్యేకత ఏంటంటే , ఈ దీపం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది.

ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.

కామాక్షీ దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు:

దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి.

కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమిరోజు ఈ దీపాన్ని కుల దేవత యంత్రం పై ఉంచి వెలిగించడం సాంప్రదాయం. ఇలా కామాక్షీ దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో.. ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో, అమ్మ కృపతో నిండి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నారు. 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi