Online Puja Services

ఐదు పవిత్రమైన నదుల సంగమ క్షేత్రం ఇది !

18.191.43.140

ఐదు పవిత్రమైన నదుల సంగమ క్షేత్రం ఇది !
- లక్ష్మి రమణ 

శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ఆధ్యాత్మిక ప్రాంతం ఎంతో విశిష్టమైనది. ఆదిశంకరుల వంటి గురువులు స్వయంగా అర్చించిన శైవక్షేత్రం .  తెలుగు నేల మీదున్న అత్యంత అద్భుతమైన , ప్రాశస్త్యమైన మహిమాన్విత క్షేత్రాలలో ఈ సంగమ క్షేత్రం కూడా ఒకటి . రండి ఇక్కడి శివ దర్శనం చేసుకుందాం . 

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ కొలువై ఉంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రమంటారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. 

ఈ కొండ క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

హరిహర క్షేత్రం పుష్పగిరి :

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.

చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుండి  వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము రెండూ కూడా ఈ కొండ మీద ఉండడం విశేషం . 

వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన
శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha