Online Puja Services

యమాదిత్యుని క్షేత్రాన్ని దర్శిస్తే, యమలోకాన్ని దర్శించాల్సిన అవసరం ఉండదు .

3.141.200.180

యమాదిత్యుని క్షేత్రాన్ని దర్శిస్తే, యమలోకాన్ని దర్శించాల్సిన అవసరం ఉండదు . 
- లక్ష్మి రమణ 

నిజం. యమాదిత్యుని (yamaditya) క్షేత్రాన్ని దర్శిస్తే, యమలోకాన్ని (Yama Lokam) దర్శించాల్సిన అవసరం ఉండదు . పద్మపురాణం (Padma Puranam) ఈ యమాదిత్యుని మహిమని వేనోళ్ళా కొనియాడుతూ ఉంది.  అద్భుతమైన సూర్యపుత్రుడైన యముడు స్వయంగా తపస్సు చేసిన భూమి, నారాయణుడే సూర్యుడై ప్రకాశించిన దివ్య స్థలం ఈ యమాదిత్య (యముడు +ఆదిత్యుడు) క్షేత్రం.  పితృ దేవతలకి పుణ్యలోకాలని ప్రసాదించేది, మనతో పాటు మూడు తరాలని ఉద్ధరించే గొప్ప మహిమాన్వితమైనది ఈ క్షేత్ర మహిమ .  రండి ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శిద్దాం . 

భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం |
గాయత్రీ ప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహం ||

విష్ణుమూర్తే (Vishnu) ఆ సూర్య భగవానుడు (Surya Bhagavan).  సూర్యభగవానుడి సూర్యమండలము మధ్యలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఆ విష్ణువు.  మూడు వేదములు ఆయనను స్తుతిస్తూ ఉంటాయి.  గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆవిష్ణువునకు నేను భక్తితో నమస్కరించుచున్నాను . అటువంటి విష్ణ్వాదిత్యుడు ఆరు వేల కిరణములతో శోభిల్లుతూ ఉంటారు అరుణ వర్ణములో ప్రకాశిస్తూ ఉంటారు.  

ఒకసారి యమధర్మరాజు తన లోకములో  పాశములను , దండములను ధరించిన తన దూతలను ఈ విధంగా ఆదేశించారు. 

 " విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుని భక్తుల సమీపముకు కూడా  మీరు వెళ్ళవద్దు.  ఎందుకంటె, వారు ఈలోకానికి తీసుకురాతగినవారు కాదు.  నిరంతరమూ తమ హృదయములను సూర్యుని పట్ల లగ్నము చేసి ఉండే  ఆయన భక్తులకు , సూర్యభగవానుని పూజించే వారికీ  మీరు దూరమునుండే నమస్కరించి తిరిగి రండి. సర్వకాల సర్వావస్థల లోనూ యందును సూర్యుని నామములను కీర్తించేవారు యమలోకమునకు రానక్కరలేదు . భాస్కరుని కోసము నిత్య నైమిత్తికము లైన యజ్ఞములను ఆచరించే వారిని మీరు కన్నెత్తి యైన చూడకూడదు.  మీరు అటువంటి సూర్య భక్తులను తాకినా, లేక వారిని యమలోకమునకు తీసుకొని రావడానికి ప్రయత్నించినా  మీకు పుట్టగతులుండవు . 

పుష్పములతో , ధూపదీపములతో , అందమైన వస్త్రములతో సూర్యుని సేవించువారిని మీరు బంధించకూడదు. ఎందుకంటే ఇటువంటి వారందరూ కూడా ఆ జగత్ప్రభువు అయిన మా తండ్రికి ఏంటో ఇష్టమైనవారని గ్రహించండి. ఆశ్రితులకు ఆశ్రయమైనవారు,  సూర్యమందిరమును శుభ్రపరచేవారు , లేదా సూర్యమందిరమును నిర్మించేవారు ఇటువంటి వారినే కాదు, వారికి చెందిన మూడు తరముల వారిని మీరు బంధింప కూడదు . అంతేకాక,  మా తండ్రియైన సూర్యభగవానుని అర్చించే  భక్తుల వంశములవారికి కూడా మీరు సర్వదా దూరముగా ఉండాలి" అని ఆదేశించారు. 

 యమధర్మరాజు చేసిన ఈ ఆదేశాన్ని అనుసరించి ఆయన సేవకులైన యమభటులు అప్రమత్తంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా , ఒకసారి  ఆ ఆదేశమును జవదాటి , సూర్యభక్తుడైన సత్రాజిత్తు జోలికి వెళ్లారు. కానీ, సత్రాజిత్తు తేజస్సుకు ఆ యమభటులు తట్టుకోలేక మూర్ఛపోయి భూమిపై పడిపోయారు. వారు చేసిన అపరాధాన్ని తన అపరాధంగా భావించిన యమధర్మరాజు కాశీ క్షేత్రంలో యమాదిత్యుని ప్రతిష్టించారు.  ఆ ప్రదేశంలో , తీవ్రముగా తపస్సు చేశారు. తత్ఫలితముగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై, ఆయనకు అనేకానేక వారాలని అనుగ్రహించారు. 

ఈ యమాదిత్యుడు కాశీ క్షేత్రంలో, యమేశ్వరునకు పశ్చిమ దిశలో  , ఆత్మవీరేశ్వరునకు తూర్పు దిశలోనూ , సంకట ఘట్టములో ప్రతిష్ఠితుడై ఉన్నాడు . యమాదిత్యుని దర్శించేవారికి యమలోకము దర్శించే అవసరము ఉండదు.  మంగళవారముతో కూడిన చతుర్దశి నాడు  స్నానము చేసి యమేశ్వరుని , యమాదిత్యుని దర్శించేవారు సకల పాపములనుండీ ముక్తులు అవుతారు. 

 యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమేశ్వరునకూ , యమాదిత్యునకూ నమస్కారం చేసుకున్నవారికి  యమలోక యాతనలను అనుభవింపవలసిన పనిలేదు సరికదా , వారికి యమలోకమును చూడవలసినపని కూడా ఉండదు . అంతేగాక , యమ తీర్థములో  శ్రాద్ధము చేసి యమాదిత్యుని పూజించేవారు పితృ ఋణమునుండీ విముక్తులవుతారు.

కాశీలో యమాదిత్యునితో పాటుగా పండ్రెండు మంది ఆదిత్యులు ప్రతిష్టితులై ఉన్నారు. ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను వినినవారికీ , వినిపించినవారికీ, దుర్గతులు దూరమై సద్గతులు లభిస్థాయిని ప్రతీతి.

Yama Aditya, Vishnu, Kashi, Kasi, Varanasi,

#yama #aditya #yamaditya

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore