Online Puja Services

ఆ బంగారు తోరణ దర్శనం అయ్యిందా

3.128.79.88

ఆ బంగారు తోరణ దర్శనం అయ్యిందా ! ఇక మన్రోలాగే మరుజన్మ లేదు !! 
- లక్ష్మి రమణ 

థామస్ మన్రో గారు అవడానికి ఆంగ్లేయుల కలెక్టరే అయినా ఆయనకీ మన భగవంతుని దర్శనం పలుమార్లు జరిగింది . కొన్నిసార్లు అది ఆంగ్లేయుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయడానికి భగవంతుడే స్వయంగా పూనుకున్న సందర్భం అయితే, అటువంటి సందర్భాలలో భగవంతుని ఉనికిని గుర్తెరిగి, ఆ పరంధాముని సేవలో తనని తానే అంకితం చేసుకున్న పుణ్య ఫలం మరికొన్నిసార్లు. ఆ విధంగా మన్రోగారు శ్రీ వేంకటేశ్వరుని కృపకి పాత్రులయ్యారు . గురు రాఘవేంద్రులతో మాట్లాడారు . దక్షిణ భారతావనిలో ఇంతటి దివ్యానుభూతులని పొందిన ఆయనకీ శ్రీరాముని కృపాకటాక్షం కూడా సిద్ధించింది . 

 సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయారు. ఆమెను అన్వేషిస్తూ రాములవారు వ్యాకులతతో తిరుగుతున్నా రోజులవి . ఆ  అన్వేషణలో భాగంగానే గండి లోయకి వచ్చారు శ్రీరామచంద్రుడు.  ఆ సమయంలో అక్కడ వాయుదేవుడు ధ్యానంలో ఉన్నారు . స్వయంగా రామచంద్రుడే తానున్న ప్రదేశానికి రావడంతో , ఆయన్ని తన ఆతిధ్యం స్వీకరించమని  వాయుదేవుడు అభ్యర్ధించారు. కానీ రామయ్య , ఇప్పుడు సీతాన్వేషణలో ఉన్నానని , కాబట్టి  తిరుగు ప్రయాణంలో తప్పక వచ్చి , ఆయన ఆతిధ్యాన్ని స్వీకరిస్తానని మాట ఇచ్చారు. 

ఆ తర్వాత లంక పైన  రాముని విజయ వార్తని తెలుసుకున్న వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో, అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా, ఆయన్ని ఆహ్వానిస్తూ లోయపైన, ఒక బంగారు తోరణాన్ని అలంకరించారు.ఆ తోరణం వాయుదేవుడు నిర్మించినది. ఆయన ఎలాగైతే విదేహుడో, అలాగే ఆ తోరణంకూడా అందరికీ కనిపించదు . పవిత్రమైన ఆత్మ  కలిగిన వారికి మాత్రం ఇప్పటికీ  కనిపిస్తూ ఉంటుందిట . ఆ తోరణం దర్శించుకున్న వారికి , దర్శనమైనవారికి  మరుజన్మ ఉండదని ప్రశస్తి. ఇదీ ఆ తోరణం కథ . 

ఇక, థామస్ మన్రో గారు మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా, చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించాలని బయల్దేరారు.  అప్పుడు ఆయన  గండి క్షేత్రంలో లోయగుండా, గుర్రాలపై ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే, అంత ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని, తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి, తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. 

కానీ వారిలో ఒక భారతీయుడైన ముసలి సేవకుడు మాత్రం, అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని దొర వారికి తెలియజేశాడు . ఆ విధంగా తోరణం దర్శించుకున్న వారు త్వరలోనే శివైక్యం చెందుతారని తెలియజేశారు .  మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆయన ఆ తర్వాత ఆరునెలలలోపే, కలరాతో మరణించారు.

మన దేశంపైన దాడి చేసినా , భగవంతుని తెలుసుకొని న్యాయ బద్ధమైన జీవనాన్ని గడిపిన వారికి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం కలిగింది . అద్భుతమైన ఇటువంటి ఎన్నో దృష్టాంతారాలు ఈ నేలమీద సనాతన ధర్మం వైభవాన్ని చాటిచెబుతున్నాయి . చెబుతూనే ఉంటాయి . 

శుభం !! 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha