Online Puja Services

ఉగాది రోజు మనం పాటించవలసిన సంప్రదాయం

18.222.111.24

ఉగాది రోజు మనం పాటించవలసిన సంప్రదాయం ఏమిటి ?
- లక్ష్మి రమణ 

మాసానాం మార్గ శీర్షోహం,  ఋతునాం కుసుమాకరః  అంటారు భగవానుడు భగవద్గీతలోని  విభూతి యోగంలో. పరమాత్మే ఋతువై ప్రభావిస్తే నిజంగానే వసంతఋతువులాగానే ఉంటుందేమో మరి ! మోడులైన చెట్లన్నీ చిగురులు తొడుగుతున్న అద్భుత దృశ్యాలు, గుబాళించే పరిమళంతో మనసుని మైమరపించే పూల పరిమళాలు, తీయని పండ్ల మధుర రసాలు కలగలిసిన గొప్ప వాతావరణం ఈ వసంతం. నిజానికి మన పండుగలన్నీ ఋతువులపైనే ఆధార పడి ఉన్నాయి. ఈ పండుగలన్నింటికీ ఆది అని చెప్పుకోతగిన నూతన సంవత్సరాది పండుగ మన ఉగాది. ఉగాది కూడా వసంత ఋతువులోనే  వస్తుంది మరి ! ఉగాది రోజు మనం పాటించవలసిన సంప్రదాయం ఏమిటి ? అనేది స్థూలంగా ఇక్కడ చెప్పుకొనే ప్రయత్నం చేద్దాం . 

ముందే చెప్పుకున్నట్టు వసంత మాసంలో  ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. తరు శాఖలు కొత్త చిగురులతో కళగా ఉంటాయి. కోకిలలు మామి చిగుళ్ళను ఆస్వాదిస్తూ పంచమ స్వరాన్ని ఆలపిస్తూ ఉంటాయి. సర్వత్రా పక్షుల కిలకిలారావాలు మారుమ్రోగుతుండగా, ఉగాది కోలాహలంగా మన ముందుకొస్తుంది.

భారతీయ కాల గణన ప్రకారం ఉగాది ముహూర్తం అన్ని శుభ కార్యాలను ప్రారంభించడానికి సరైనది.  బ్రహ్మ సృష్టి ఆరంభించిన కాలాన్ని బ్రహ్మ కల్పమని,కల్ప ప్రారంభాన్ని కల్పాది అని,  ప్రతి కల్పంలో మొదట వచ్చే యుగ ఆది సమయమే ఉగాది అని మన ఋషులు వ్యవహరించారు. ఈ విధంగా  కీ/శ 79 వ సం.లో శాలివాహన చక్రవర్తి ఉగాది నాడే పట్టాభిషిక్తు డయ్యారు. ఆ చక్రవర్తి ఒక యుగ పురుషుడు. అందుకే శాలివాహన శకంగా పేర్కొంటున్నాం. శ్రీరాముని పట్టాభిషేకం ఉగాది నాడే జరిగిందని పెద్దలు చెబుతారు. శ్రీరామ జన్మోత్సవాలు జరుపుకునే నవ రాత్రులు ఉగాది తోనే ప్రారంభమవుతాయి. 

ఇంతటి గొప్ప రోజున ఏమేమి చేయాలి ? 

ఉగాది పర్వదినం నాడు పంచ విధులు చేయాలని ధర్మసింధు చెబుతుంది. అవి తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. 

తైలాభ్యంగన స్నానం:

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెరాసుకుని  తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటుందని  ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేస్తే,  లక్ష్మిదేవి , గంగమ్మ ల  అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలకీ  పుష్టినిస్తుంది ) అని ఆయుర్వేదోక్తి.  కాబట్టి అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికి ఈ  రీతిగా విశేష ప్రాధాన్యం ఇవ్వబడింది.

నూతన సంవత్సర పూజ : 

అభ్యంగ స్నానానంతరం సూర్యుణ్ణి ఆరాధించాలి. ఆర్ఘ్య,దీప,ధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన తర్వాత,  మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందులో  నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాధి  దేవతను, ఇష్టదేవతని ఉంచి ఆరాధన చేయాలి. ఆ తర్వాత  ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. 

ఉగాది పచ్చడి సేవనం:

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం / పంచదార / చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, ఇలా షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం.  పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని ఈ దివ్య ప్రసాదం చెబుతుంది . 

సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి తీసుకోవడం వలన  వివిధ అనారోగ్య స్థితులు చక్కబడి , రోగశాంతి, ఆరోగ్యపుష్టి కలగడం గమనించాల్సిన విషయం .

 పూర్ణ కుంభదానం:

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం  లాగా  కట్టి దానిపై కొబ్బరికాయని పెట్టిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి, ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఈ రోజుల్లో  ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. 

యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంగా  అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి, పుష్పాక్షతలు వేసి, ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి, కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం / కొబ్బరికాయని పెట్టి  పూజించి, దాన్ని  పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి . దీని వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

పంచాంగ శ్రవణం:

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని, తదనుగుణంగా సంవత్సరం పొడవునా ప్రణాళికలు వేసుకోవాలి .  ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుంది అని శ్రుతివాక్యం .

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.

‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించదానికి  వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు మహర్షులు  ఏర్పాటు చేశారు. 

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.  శుభం . 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda