Online Puja Services

చిగురేసే .. మొగ్గేసే .. చైత్ర మాసం విశిష్టత!!

3.133.109.30

చిగురేసే .. మొగ్గేసే .. చైత్ర మాసం విశిష్టత!!
- లక్ష్మి రమణ 

“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.

ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం (నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.

ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.

పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు

సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 

చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.

చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.

చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 

పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.

అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.

చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.

చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.

చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.

ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాం.

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda