Online Puja Services

ఫాల్గుణ మాసంలో ఇలా చేశారంటే

18.216.123.120

ఫాల్గుణ మాసంలో ఇలా చేశారంటే, దైవానుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోతాయి . 
- లక్ష్మి రమణ 

ఫాల్గుణమాసం సంవత్సరంలో చివరి నెల. ఈ నెలలో చేసే పూజలు అమితమైన ఫలాన్ని అందిస్తాయి. ఈ మాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది.  ఫాల్గుణ మాసంలో ఈశ్వరార్చన ప్రధానం. కానీ ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ దేవిని అర్చిస్తారో, వారికి అఖండమైన లక్ష్మీ కటాక్షం , సౌభాగ్యం సిద్ధిస్తాయి . ఈ మాసమంతా కూడా ఎంతో విశిష్టమయినది. కనుక,  ఇంకా ఫాల్గుణ మాసంలో ఎటువంటి విశేషాలున్నాయి, ఎటువంటి పూజాకార్యక్రమాలు ఆచరించాలో ఇక్కడ తెలుసుకుందాం .  

గణపతి ఆరాధన  : 

ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు. ఆనాడు నువ్వులతో కలిపి వండిన అన్నంతో హోమం చేస్తే సర్వవిఘ్నాలు నశిస్తాయి. ఆనాడు పుత్రగణపతి వ్రతం కూడా ఆచరించాలి. పంచమినాడు అనంతపంచమి వ్రతాన్ని ఆచరించాలి. ఫాల్గుణ చవితినాడు 'సంకట గణేశ' వ్రతం ఆచరిస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు:

 ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతుంటారో వారు ఫాల్గుణమాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదే విధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో  ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఫాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు.

విష్ణువు ఆరాధన:

తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి.

ఫాల్గుణమాసంలో  మీ శక్తి సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానమిస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

పౌర్ణమి నాడు ఈశ్వరుడిని, శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించి 'లింగ పురాణా'న్ని దానంగా ఇవ్వాలి. ఫాల్గుణపూర్ణిమ రోజు శ్రీ క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊయలలూపాలి  . దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

శుక్లపక్షంతో ప్రారంభించి ఫాల్గుణ బహుళ ద్వాదశి వరకు నృసింహారాధన చేయాలి. ఫాల్గుణ పూర్ణిమనాడు హోళీ వస్తుంది. ఆనాడు రాబోయే వసంతానికి స్వాగతం చెబుతూ వసంతోత్సవాలు జరుపుకుంటారు.

ఫాల్గుణ మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణును ఆరాధిస్తే కచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు.

కాంచీపురంలో ఫాల్గుణ పౌర్ణమి ఉత్సవం :  

పురాణాల ప్రకారం మామిడి చెట్టు కింద పార్వతీ దేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు.

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha