Online Puja Services

కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో చేసే దీపారాధన విశేషమైన ఫలితాలు

18.223.114.142

కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో చేసే దీపారాధన విశేషమైన ఫలితాలు అందిస్తుంది. 
- లక్ష్మి రమణ 

నిత్యమూ మనం చేసుకొనే దీపారాధనకు సనాతన సంప్రదాయంలో ఎంతో  ప్రాధాన్యత ఉంది . దీపారాధన చేయడం అంటే ఆత్మ జ్యోతిని దర్శించడమే ! చమురున్నంతసేపూ దీపం దేదీప్యమానమై వెలుగుతుంది . అలాగే ప్రాణం ఉన్నంతసేపూ శరీరం తనపాత్ర పోషిస్తూ ఉంటుంది .  చమురు అయిపోగానే , దీపం ఎలా కొండెక్కి ఆ పరమాత్మలో లీనమవుతోందో , అదే విధంగా మన ఆత్మ అనే దీపం , ప్రాణమనే చమురు నిండుకున్నప్పుడు ఆ పరమాత్మలో సంలీనమవ్వాలి . మరుజన్మ లేకుండా , బంధముక్తమై ముక్తికాంతని వరించాలి . అదే మనం రోజూ చేసే దీపారాధనలోని  పరమార్థం ! 

అయితే, ఐహికజగతిలో అనునిత్యం మనకి ఎదురయ్యే సమస్యల నుండీ గట్టెక్కేందుకు ఈ దీపారాధన విధి ఉపయోగిస్తుందంటున్నారు పెద్దలు . అందులోనూ కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో చేసే దీపారాధన విశేషమైన ఫలితాలు అందిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఇంట్లోనూ, ఆలయాలలోనూ చేసుకొనే ఆ ప్రత్యేక దీపారాధనలు గురించిన వివరాలు  ఇక్కడ మీకోసం . 

నిత్యదీపారాధన :
మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను ‘వ్యష్టి దీపారాధన’ అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించే దీపారాధన అన్నమాట . 

అదే దేవాలయాలలో చేసే దీపారధన వలన మనకి దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేష ఫలితాలు లభిస్తాయి. అందుకే కార్తీకమాసంలో తప్పనిసరిగా దేవాలయంలో దీపాలు వెలిగిస్తూ ఉంటాం . కార్తీక పురాణం కూడా శివ కేశవుల ఆలయాల్లో చేసే ఈ దీపారాధనా మహిమని ఉన్నతంగా విశ్లేషిస్తుంది . 

ఇక, తులసి కోట వద్ద చేసే దీపారాధనని ‘బృందావన దీపారాధన’ అంటారు. ఇది తులసీమాత అనుగ్రహాన్ని అందిస్తుంది . మహిళలకి సౌభాగ్య ప్రాప్తినిస్తుంది . 

పారాయణల్లో లేదా ఏదైనా దైవసంబంధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందుగా వెలిగించే దీపాన్ని అఖండదీపమంటారు. ఈ దీపం, తలపెట్టిన కార్యక్రమం పూర్తయ్యేవరకూ వెలుగుతూనే ఉంటుంది. అవిఘ్నంగా , దిగ్విజయంగా తలపెట్టిన కార్యక్రమం పూర్తవ్వడానికి అవసరమైన దైవానుగ్రహాన్ని అందిస్తుంది . 

దీపాన్ని వెలిగించేప్పుడు ఏక ముఖం- మధ్యమ మనీ , ద్విముఖం - కుటుంబ ఐక్యతనిస్తుందనీ , త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం ప్రసాదిస్తుందని , చతుర్ముఖం -పశుసంపద, ధన సంపదను వృద్ధి చేస్తుందనీ,  పంచముఖం సిరిసంపదులని అనుగ్రహిస్తుందనీ పండిత వచనం. 

అలాగే మట్టి, వెండి, పంచలోహాదల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం. వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థానం. దీపారాధన చేసేటప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి. 

ఆలయాలలో దీపారాధన:
ఆలయాలలో ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ‘ఆకాశదీపం’. సాధారణంగా కార్తిక మాసం నెలరోజులూ శివాలయాల్లో దీన్ని తప్పక వెలిగిస్తారు. దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా ‘బలిదీపం’ అని అంటారు. మరీ చిన్నచిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తే దానిని ‘నిరంజన దీపావళి’ అని పిలుస్తారు. 

కార్తిక పౌర్ణమిరోజున తోరణం మాదిరిగా వెలిగించే దీపాన్ని జ్వాలాతోరణమనీ పేర్కొంటారు.   దీపారాధనలో ఇన్ని రకాల దీపాలు ఉంటాయి. ఈ జ్వాలా తోరణం కిందినుండీ వెళితే అపమృత్యువు తొలగిపోతుందని విశ్వాసం . 

దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను ‘అర్చనా దీపాలు’ అంటారు. ఇక, గర్భగుడిలో వెలిగించే దీపాన్ని ‘నందాదీపము’ అని అంటారు. అదే లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో  వెలిగించే దీపాన్ని ‘లక్ష్మీ దీపం’ అంటారు.

అలాగ పంచాయతన దేవాలయాలలో అంటే, శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఆలయం . ఇక్కడ  ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. 

పుట్ట దగ్గర వెలిగించే దీపారాధన వలన నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది . సంతానం కలుగుతుంది. సస్యములు అభివృద్ధి చెందుతాయి. 

శివాలయాలలో నందిరూపంగా నందీదీపం , నాగరూపంలో నాగదీపం వంటివి కనిపిస్తాయి. వైష్ణవాలయాల్లో దీపాకృతులు శంఖు,చక్ర,గద,పద్మ రూపాల్లో కనిపిస్తాయి.

ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పని సరిగా  చెయ్యాలి. ఇలా చేయడం వలన దుష్టశక్తులు నశించి నిత్యం శుభఫలితాలను ఆ భగవంతుడు అనుగ్రహిస్తారు . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi