Online Puja Services

మీరాబాయి చాను

3.133.126.39

మీరాబాయ్ చాను

 భారతదేశానికి 2021 లో ఒలింపిక్స్ లో  మొదటి రజత పతకం సాధించిపెట్టిన  'మీరాబాయ్ సైకమ్ చాను ' ది మణిపూర్ లోని నఙ్గపోక్ దగ్గర కక్చింగ్ అనే చిన్న గ్రామం.చిన్నప్పటి నుండి తల్లి తో పాటు గ్రామంలో తమకు ఉన్న అర ఎకరం పొలం పనులు చేసేది. తలమీద బరువైన కట్టెల మోపులు మోసేది. తండ్రి  సైకోమ్ కృతి సింగ్,  మణిపూర్ పబ్లిక్ వర్క్స్ లో చిన్నపాటి నిర్మాణ కూలీ. తల్లి 'తొంబి దేవి ' పొలంపనితో పాటు గ్రామం లో చిన్న టీ స్టాల్ కూడా నడుపుతుంది.

  ఆ దంపతులకు ఆరుగురు సంతానం.  రంజన్, రంజనా, రంజిత, నానో, సనతొంబ ,  మీరాబాయ్ అందరిలోకి చిన్నది మీరాబాయ్. పెద్ద పిల్లలు చదువుకుంటూ నేతపనిలో ఉంటే మీరా మాత్రం తల్లి వెంట పొలం లోనే ఉండేది. వయసుకు మించిన బరువైన పనులు చేసేది.

   క్రీడలంటే ఇష్టపడే మీరాబాయ్ మొదట ఆర్చర్ కావాలనుకుంది.తర్వాత ఒక వెయిట్లిఫ్టర్ పరిచయంతో బరువులు ఎత్తడం పట్ల ఆసక్తి పెంచుకుంది.

తండ్రి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ లోని ఖుమాన్ లంపాక్ స్టేడియం లో శిక్షణ గురించి ఆరా తీసాడు. అక్కడి కోచ్ ప్రముఖ వెయిట్ లిఫ్టర్ అనిత చాను మీరాబాయ్ ని చూసిన వెంటనే తను వెయిట్ లిఫ్టింగ్ లో తప్పక రాణిస్తుందని చేర్చుకున్నారు. చిన్ననాటి నుండి శారీరక శ్రమ చెయ్యడం వల్ల మీరా రన్నింగ్ ,  స్క్వాట్,  లిఫ్ట్ చాలా సునాయాసంగా చేసేది. సాయంత్రం శిక్షణ పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోడానికి ఆసక్తి చూపేది. అక్కడ ఇచ్చే ఆహారం కాకుండా ఇంటి భోజనమే తినేది నల్లటి బియ్యం,  ఉడికించిన కూరగాయలు తీసుకునేది.

    ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ టికెట్ కు ఒక్కోసారి డబ్బులు లేకుంటే ఇసుక లారీల్లో లిఫ్ట్ అడిగి వచ్చేది.తల్లి ఊరుబయట నిలబడి తనకోసం ఎదురుచూసేది. మీరా అక్కలు నేత పని ద్వారా వచ్చే డబ్బులు దాచి మీరా శిక్షణ కు , బస్ ఫేర్ కు డబ్బులిచ్చేవాళ్ళు. మెల్లిగా ఒక సైకిల్ కొనిపెట్టారు.

    మీరాబాయి చాను 2009 లో ఛత్తీస్గడ్ లో నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. 2014 లోని గ్లాస్గో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది.2016 రియో ఒలింపిక్స్ లో కొంచం వెనకబడింది. వెయిట్ లిఫ్టింగ్ నుండి వైదొలగాలని అనుకుంది. చాలా డిప్రెషన్ కు గురైంది. అయితే కుటుంబం యొక్క మద్దతు తో తొందరగానే తిరిగి విజయ్ కుమార్ కోచ్  శిక్షణలో 2018  థాయిలాండ్ కామన్ వెల్త్ లో కాంస్యం , టాష్కెంట్ లో ఏషియన్ చాంపియన్ షిప్ గెలుచుకుని 2021 ఒలింపిక్స్ కు సన్నద్ధమైంది.

తొంబిదేవి  మీరా అమెరికా నుండి తెచ్చిన తెల్లని షాల్ ను ప్రేమగా నిమురుకుంటూ " మీరాకెప్పుడూ నా గురించే బాధ. నా  బరువును, కష్టాన్ని పంచుకోవాలని ఆరాటపడేది.దేశం మొత్తం బరువును తన భుజాల మీద మోస్తుందని తెలుసుకున్నాం " అంటారు. ఆమె అక్కలు అన్నలు మీరా రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె ఇష్టంగా తినే వంటకాలు తయారు చేస్తామని మురిసిపోతున్నారు. తల్లి చేసే కాంగ్సోయి , ఇరోంబ,  పకనం వంటకాలు మీరాబాయి కి ప్రాణం అట.

            పేదరికాన్ని లెక్కచేయక , మొక్కవోని పట్టుదలతో , అలుపులేని శ్రమ తో దేశం యొక్క పరువును నిలబెట్టి రజత పతకం సాధించిన మీరాబాయ్ , నీరాక కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అమ్మాయి నీకు వేల వేల శుభాకాంక్షలు.

-✍️Rajitha Kommu

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore