Online Puja Services

తెలుగు వాడి జిహ్వ చాపల్యం

3.147.58.27
భోజన ప్రియులకు మాత్రమే!
 
సాంబారులో చందమామలు
 
తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. 
మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. 
 
అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 
‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, 
పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, 
పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’ 
 
వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. 
 
వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. 
 
మామిడిపండుతోనో, 
మాగాయ టెంకతోనో 
‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. 
 
‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! 
 
కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. 
 
చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. 
 
ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. 
 
‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.
 
మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం. 
 
ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! 
 
తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. 
 
‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. 
ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. 
 
ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. 
దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. 
 
విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. 
 
వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.
వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. 
 
ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. 
 
దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. 
 
ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!   
 
(kV Ramana Rao garu and తెలుగు వెలుగు మాసపత్రిక సౌజన్యముతో)
 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda